ఇండస్ట్రీలో మంచి అభిరుచి వుండి, వనరులు వుండి, సినిమాలు తీస్తున్నా, అదృష్టం మాత్రం ఆమడ దూరంలో వుండే సంస్థ ఏదన్నా వుందీ అంటే అది ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ నే.
వరుసపెట్టి సినిమాలు తీస్తూనే వుంటారు. సినిమా నిర్మాణం టైమ్ లో బాగుంటుంది. విడుదలకు వచ్చేసరికి సరైన డేట్ దొరకదు. లేకపోతే ఏదో ఒక తేడా వస్తుంది. అనుకున్న ఫలితం చేతికి రాదు. ఈ మధ్యకాలంలో ఈడో రకం ఆడో రకం తప్పిస్తే, సరైన సినిమా రాలేదు ఆ సంస్థ నుంచి.
ఏదో చేద్దామని, ఏదో చేయబోయి, మరేదో చేసినట్లు వుంది ఆ సంస్థ సినిమాల పరిస్థితి. పాపం రాజ్ తరుణ్ ను మూడు సినిమాలకు లాక్ చేసారు. కానీ ఫలితం లేకపోయింది. రెండు సినిమాలు వచ్చాయి. వెళ్లాయి. అంతే. ఇక మూడోది మిగిలి వుంది. రాజూగాడు. ఈ సినిమా జనవరికి రెడీ అయింది.
నిఖిల్ కిర్రాక్ పార్టీ మీద దృష్టి పెట్టి దీన్ని పక్కన పెట్టారు. కిర్రాక్ పార్టీ వికటించింది. రాజుగాడుకు డేట్ లేకుండా అయిపోయింది. డేట్ ల మీద డేట్ లు ఫీలర్లు వినిపిస్తున్నాయి తప్ప ఫిక్స కావడం లేదు. మే 11విడుదల అనుకున్నారు. కానీ మహానటి, మెహబాబా లాంటి భారీ సినిమాలు రెడీగా వున్నాయి.
పోనీ మే 18కి వెళ్దాం అంటే టాక్సీవాలా, అభిమన్యుడు, 25కు వెళ్దాం అంటే ఆఫీసర్, నేలటికెట్, నా నువ్వే వున్నాయి. జూన్ ఫస్ట్ వీక్ లో కాలా, సెకెండ్ వీక్ లో సవ్యసాచి, ఇలా ప్రతివారం పెద్ద, మీడియం సినిమాలు రెడీగా వున్నాయి.
ఇలాంటి టైమ్ లో జూన్ 1మాత్రమే ఖాళీ కనిపిస్తోంది. అసలే రాజ్ తరుణ్ కు రెడీగా మిగిలింది ఈ ఒక్క సినిమానే. దీని తరువాత దిల్ రాజు లవర్ వుంది. ఇప్పటికే వరుసగా సినిమాలు సరైన టైమ్ లో థియేటర్లలోకి రాక, వచ్చినా సరైన రన్ లేక, రాజ్ తరుణ్ మార్కెట్ అంతా డౌన్ అయిందని ట్రేడ్ వర్గాల బోగట్టా. ఈ రాజూగాడు కూడా సరైన దారిలో పడకపోతే, కష్టమే.