తేజుకు నప్పని న్యూమరాలజీ

సినిమాలకు సబ్జెక్ట్ పట్టుకుని, సరైన టైటిల్ పెట్టుకోవాలి కానీ, న్యూమరాలజీలు, జ్యోతిష్యాలు పట్టుకుని కాదు. సాయిధరమ్ తేజ–కరుణాకరన్ సినిమాకు ఇలాగే ఓ టైటిల్ అనుకుని, దాన్ని బయటకు లీక్ చేసి, మళ్లీ నాలుక కరుచుకుని,…

సినిమాలకు సబ్జెక్ట్ పట్టుకుని, సరైన టైటిల్ పెట్టుకోవాలి కానీ, న్యూమరాలజీలు, జ్యోతిష్యాలు పట్టుకుని కాదు. సాయిధరమ్ తేజ–కరుణాకరన్ సినిమాకు ఇలాగే ఓ టైటిల్ అనుకుని, దాన్ని బయటకు లీక్ చేసి, మళ్లీ నాలుక కరుచుకుని, టైటిల్ మార్చిన వైనం ఇది.

సాయిధరమ్ తేజ-కరుణాకరన్ కలిసి ఓ ప్రేమకథ చేస్తున్నారు. మాస్.. మాస్ అంటూ పరుగెత్తి, ఫెయిల్యూర్లు చవిచూసి, ఆఖరికి మిగిలిన సక్సెస్ ఫుల్ హీరోల మాదిరిగా ప్రేమకథను ఎంచుకున్నాడు సాయిధరమ్. ప్రేమను మరచిపోయే అమ్మాయికి తరచు ఆ ప్రేమను గుర్తుకు చేయాల్సి వచ్చే ప్రేమికుడు టైపు పాత్ర అది.

సరే ఈ సినిమాకు ఓ మాంచి టైటిల్, న్యూమరాలజీ తదితర లెక్కలు కూడా చూసి ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఆ టైటిల్ చూస్తే ఓ పెద్ద వాక్యం మాదిరిగా వుంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అందుకే మెల్లగా మీడియాకు లీక్ చేసారు. ‘తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమ కథ’ అన్నది ఆ టైటిల్. ఈ టైటిల్ లో తలకట్లు, నకారపొల్లులు కూడా లెక్కపెట్టి మరీ నిర్ణయించుకున్నారు. కానీ ఫ్యాన్స్ లో, ప్రేక్షకుల్లోకి ఈ టైటిల్ అంతగా వెళ్లలేదు. ఎక్కడా ఎటువంటి పాజిటివ్ రియాక్షన్ కనిపించలేదు.

దాంతో తేజ్ ఐ లవ్ యు అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకు ముందు ప్రకటించిన టైటిల్ సంగతేమిటి? అని ఫ్రశ్నిస్తే, అది అనుకుంటున్నాం అన్నాం తప్ప, ఫిక్స్ చేసాం అని అనలేదుగా అని లాజిక్ లు తీస్తున్నారు. మొత్తానికి తేజు.. తేజు అని సాయి ధరమ్ ను పిలిచే సన్నిహితులు పిలిచేది కాస్తా ఇప్పుడు తేజ్ అని మారిందన్నమాట. బహుశా అది కూడా న్యూమరాలజీ మహిమే కావచ్చు.