తెలుగునాట గట్టిగా రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలయితే థియేటర్ల సమస్య వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్లీ ఆ సమస్య తలెత్తేలా కనిపిస్తోంది. గత నెలలో విడుదలయిన రంగస్థలం ఇంకా థియేటర్లలో వుంది. ప్రతి చోటా సింగిల్ థియేటర్ లోనే వున్నా, పెద్ద పట్టణాల్లో మాంచి షేర్ నే వసూలు చేస్తోంది. చిన్న ఊళ్లలో కూడా ఫరవాలేదు. డెఫిసిట్ అయితే ఎక్కడా లేదు. నాలుగో తేదీ నాటికి తీసేసే సెంటర్లు పెద్దగా వుండవు. ఎందుకంటే డెఫిసిట్ రానంతవరకు థియేటర్ల నుంచి తీయడానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఫ్యాన్స్ అంగీకరించరు.
ఇక నాలుగో తేదీ నాటికి భరత్ అనే నేను విడుదలయి మూడు వారాలే అవుతుంది. రెండో వారంలో కూడా దాదాపు అన్ని చోట్లా మల్టిపుల్ స్క్రీన్ లలో వుందీ సినిమా. మూడోవారం నాటికి పెద్ద సెంటర్లలో కనీసం రెండు థియేటర్లలో, మిగిలిన చోట్లు ఒక థియేటర్ లో వుంటుందీ సినిమా.
అంటే నా పేరు సూర్య విడుదలయ్యే టైమ్ కు అన్ని పెద్ద సెంటర్లలో భరత్, రంగస్థలం రెండూ వుంటాయి. కానీ రెండేసి థియేటర్లలో ఇలా కూర్చుంటే ఎలా? అలాగే సింగిల్ స్క్రీన్ లువున్న చోట్ల ఎలా? పోనీ కొన్ని చోట్ల రంగస్థలం తీసేసి, మరీ చిన్న సెంటర్లలో భరత్ కూడా తీసేసి, నా పేరు సూర్య వేస్తారు అనుకుందాం. కానీ ఆ తరువాత వచ్చే మహానటి పరిస్థితి ఏమిటి? దాంతో పాటు వచ్చే మెహబూబా సంగతి ఏమిటి?
వీటన్నింటికి కూడా మల్టిపుల్ స్క్రీన్ లు వున్న చోట ఫరవాలేదు కానీ, సింగిల్ స్క్రీన్ లు, రెండు స్క్రీన్ లు వున్న సెంటర్లలో చాలా కష్టం. ఇక మల్టీ ఫ్లెక్స్ ల్లో మాదిరిగా రెండు షోలు ఒక సినిమా రెండు షోలు మరో సినిమా వేసుకోవాల్సింది. అయినా కూడా మహానటికి, మెహబూబాకు థియేటర్లు దొరకడం కష్టం అన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
రెండు సినిమాలు పెద్ద హిట్ అయితేనే పరిస్థితి ఇలా వుంటే, వరుసగా హిట్ ల మీద హిట్ లు వుంటే ఎలా వుంటుందో?