ఆఫీసర్.. విడుదలవుతుందా?

చాలా కాలం తరువాత నాగార్జున-వర్మ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఆఫీసర్. ఈ సినిమా ఈ నెల మూడో వారంలో విడుదల కావాల్సి వుంది. అయితే ఇటీవల నెలకొన్న అనేకానేక వివాదాల రీత్యా ఈ…

చాలా కాలం తరువాత నాగార్జున-వర్మ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఆఫీసర్. ఈ సినిమా ఈ నెల మూడో వారంలో విడుదల కావాల్సి వుంది. అయితే ఇటీవల నెలకొన్న అనేకానేక వివాదాల రీత్యా ఈ సినిమా విడుదలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులు అమ్మినట్లు వార్తలు రాలేదు. వస్తున్న రేటుకు, ఆశిస్తున్న రేటుకు పొంతన కుదరడం లేదని తెలుస్తోంది.

అది అలా వుంటే నాగ్ కలుగచేసుకుంటే తప్ప, ఈసినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం కష్టం అని తెలుస్తోంది. ఎందుకంటే వర్మ ఇప్పుడు ఇటు మెగా క్యాంప్ కు అటు సురేష్ బాబుకు కూడా ఆగ్రహకారకంగానే వున్నాడు. అభిరామ్ ఇస్యూలో తాను రాజీ కోసం ప్రయత్నిస్తానని, కోట్లు ఇఫ్పిస్తానని వర్మ ప్రయత్నించడం జరిగింది. ఈ విషయం ఆయనే అంగీకరించారు.

అంటే అభిరామ్ తప్పు చేసాడని, దానికి కోట్లతో పరిహారం చేసి, రాజీ చేస్తాననే కదా? అర్థం. దీని మీద సురేష్ బాబు వర్గం కినుకతో వుందని తెలుస్తోంది. నైజాంలో, ఆంధ్రలోని కొన్ని ఏరియాల్లో సురేష్ బాబు వద్దు అనుకుంటే ఈ సినిమా విడుదల కావడం కష్టం.

అలాగే ఆంధ్రలోని పలు ఏరియాల్లో మెగా క్యాంప్ కు, దాని సన్నిహిత వర్గాలకు థియేటర్లు వున్నాయి. వారిని కాదని అక్కడ సినిమా విడుదల చేయడం కష్టం. ఈ కష్టాలు దాటాలంటే ఒక్కటే మార్గం. నాగ్ కలుగచేసుకోవాల్సి వుంటుంది.

ఆఫీసర్ సినిమాకు సంబంధించి నాగ్ పారితోషికం అందిందో లేదో తెలియదు. సినిమా విడుదల, అమ్మకాలతో దానికి సంబంధం వుంటే, ఆయన తప్పకుండా కలుగచేసుకోవాల్సి వుంటుంది. అప్పుడు సినిమా విడుదల సుగమం అవుతుంది. అలా కాకుండా, సినిమా విడుదలతో నాగ్ కు నిమిత్తం లేకపోతే మాత్రం కాస్త కష్టమే. కొనేవారు, వేసే వారు కూడా ఆలోచిస్తారు.