సినిమా రివ్యూ: ఆచారి అమెరికా యాత్ర

రివ్యూ: ఆచారి అమెరికా యాత్ర రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: పద్మజ పిక్చర్స్‌ తారాగణం: విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్‌, బ్రహ్మానందం, ప్రదీప్‌ రావత్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌, ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌, పృధ్వీ, పోసాని,…

రివ్యూ: ఆచారి అమెరికా యాత్ర
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌: పద్మజ పిక్చర్స్‌
తారాగణం: విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్‌, బ్రహ్మానందం, ప్రదీప్‌ రావత్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌, ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌, పృధ్వీ, పోసాని, కోట, సురేఖావాణి, విద్యుల్లేఖారామన్‌, సత్య కృష్ణన్‌ తదితరులు
కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి
మాటలు: డార్లింగ్‌ స్వామి
కూర్పు: ఎమ్‌.ఆర్‌. వర్మ
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌ రామస్వామి
నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు
కథనం, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్‌ 27, 2018

విష్ణు-బ్రహ్మానందం కాంబినేషన్‌ రెండు-మూడు సార్లు క్లిక్‌ అవడం, బ్రాహ్మణుడి పాత్రని కథానాయకుడిగా పెట్టిన నాగేశ్వరరెడ్డి చిత్రాలు సక్సెస్‌ అవడంతో అదే ఫార్ములాతో మరోసారి పాస్‌ అయిపోవచ్చునని వేసిన ఎత్తుగడే 'ఆచారి అమెరికా యాత్ర'. టైటిల్‌ డిసైడ్‌ చేసుకుని దానికి తగ్గట్టు సన్నివేశాలు అల్లుకుంటూ కథలాంటిది రాసుకున్నారా అన్నట్టు మొదట్నుంచీ తలా తోకా లేకుండా నడుస్తుందీ చిత్రం. కథ సంగతి ఎలాగున్నా కనీసం కామెడీతో అయినా కాలక్షేపం అవుతుందని ఆశిస్తే, అదీ లేకపోగా హాస్యం కోసం పడిన ప్రయాసతో ఈ యాత్ర ఆసాంతం పరీక్షిస్తుంది సహనం.

అనుకోకుండా కథానాయకి కట్టుకున్న టవల్‌ జారిపోతే ఆమె నగ్న స్వరూపం చూసిన కథానాయకుడు ప్రేమలో పడతాడు. తనపై దుండగులు దాడి చేస్తే, వాళ్లని కొట్టి తనని కాపాడిన కథానాయకుడి కండబలం చూసి ప్రేమించేస్తుంది కథానాయిక. ఏ కాలం నాటి ఆలోచనలు, సన్నివేశాలివి? ప్రేమకథకి ఇంత 'బలమైన' సన్నివేశాలతో బీజం వేసిన దర్శకుడు హాస్యం కోసం రాసుకున్న సన్నివేశాలైతే న భూతో న భవిష్యతి.

పృధ్వీతో చేయించిన కామెడీ ట్రాక్‌ చూసి తిట్టుకోకుండా, ఎట్‌లీస్ట్‌ విసుక్కోకుండా వున్న వాళ్లెవరైనా వుంటే వాళ్లకి 'నోబెల్‌ పీస్‌ ప్రైజ్‌' ఇచ్చేయవచ్చు. అలా అని మిగతా కామెడీ ట్రాకులు తెగ నవ్వించేస్తాయని కాదు. 'నవ్వుల యాత్ర' అంటూ ప్రచారం చేసుకున్న ఈ చిత్రాన్ని హాస్యభరితంగా తీర్చిదిద్దడానికి పడ్డ తపనైతే తక్కువేం కాదు. కాకపోతే కాలం చెల్లిపోయిన జోకులు, ఇప్పటి ట్రెండ్‌కి ఎన్నో మైళ్లు దూరంలో వుండిపోయిన సన్నివేశాలతో ఈ నవ్వుల యాత్ర కాస్తా నరక యాతనగా మారిందంతే.

సన్నివేశాల మధ్య సంబంధం లేకుండా అగమ్యగోచరంగా సాగుతోన్న కథనం చూస్తే అసలు స్క్రిప్టు రాసుకుని సెట్స్‌కి వెళ్లారా లేక ఏ రోజు తోచింది ఆ రోజు తీసేసారా అనిపిస్తుంది. సినిమా ఆరంభమైన కాసేపటికే ఈ యాత్ర పూర్తి కావడానికి ఇంకా రెండు గంటలు గడవాలా అనే జడుపు కుదిపేస్తుంది. రొమాన్సు, కామెడీ ఈ విధంగా హింసిస్తే, బెస్ట్‌ టార్చర్‌ కేటగిరీలో విన్నర్స్‌గా నిలవాలన్నట్టు విలన్స్‌ బృందం ఓవరాక్షన్‌తో చుక్కలు చూపిస్తుంది. ఈ బృందమంతా ఒకరితో ఒకరు పోటీ పడినా కానీ ప్రదీప్‌ రావత్‌ని మాత్రం బీట్‌ చేయలేకపోయారు. కెమెరా తనపై ఫోకస్‌ చేసిన ప్రతిసారీ 'నటహింస' అనిపించుకున్నాడు.

కథ విషయానికి వస్తే… ఒక ధనికుల ఇంట్లో హోమానికి వెళ్లిన కృష్ణమాచారి (విష్ణు) అమెరికానుంచి వచ్చిన రేణుకతో (ప్రగ్య) ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఆమె తన ప్రేమని వ్యక్తం చేసేలోగా తాతయ్య చనిపోవడంతో అమెరికా తిరిగెళ్లిపోతుంది. ఆమె కోసమని తన గురువుని (బ్రహ్మానందం) ఏమార్చి అమెరికా తీసుకెళ్లిపోతాడు ఆచారి. రేణుక ఆచూకీ దొరుకుతుంది కానీ మరొకరితో పెళ్లి నిశ్చయమైపోతుంది. తన అస్థికలు కాశీలో కలపాలనేది తన తాతయ్య చివరి కోరిక అని, ఆ అస్థికలు తనకి ఇవ్వకుండా బలవంతం మీద ఈ పెళ్లి చేయిస్తున్నారని ఆచారికి చెబుతుంది రేణుక. దాంతో ఆ అస్థికలు ఎలాగైనా వారి దగ్గర్నుంచి తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి పథకం రచిస్తారు.

అస్థికల గోల ఏ స్థాయిలో కథని ఆక్రమిస్తుందంటే… ఇది ఆచారి అమెరికా యాత్రా లేక అస్థికల యాత్రా అనేంతగా! స్లాప్‌స్టిక్‌ కామెడీగా తీర్చిదిద్దడానికి అవకాశమున్న ప్లాట్‌ అయినా కానీ దర్శక, రచయితల్లో ఎవరి సెన్సాఫ్‌ హ్యూమర్‌ కనీసం యావరేజ్‌ స్థాయిలో కూడా లేకపోవడంతో ఈ హాస్యం విసుగుకి పరాకాష్టగా మారింది. హీరో పాత్రని ధీరోదాత్తంగా చూపించాలా లేక బుద్ధిశాలిగా చూపించాలా అనేదానిపై కూడా దర్శకుడికి క్లారిటీ లేకపోయింది.

తన సీన్‌కి అనువుగా ఆ పాత్ర స్వభావాన్ని మార్చేస్తూ అందుకు తగ్గట్టే మనల్నీ అడ్జస్ట్‌ అయిపోమంటాడు. డీసెంట్‌ కామెడీ వుంటే విష్ణు దానిని బాగానే క్యారీ చేస్తాడని పలు చిత్రాల్లో రుజువు చేసుకున్నాడు. అయితే ఈ తరహా అర్థం లేని కథనంతో, నవ్వించడానికి అవకాశమే ఇవ్వని సన్నివేశాలతో ఎవరైనా చేయగలిగేదంటూ ఏమీ వుండదు.

బ్రహ్మానందంకి ఆద్యంతం కనిపించే పాత్రనిచ్చినా ఆయన తన సుదీర్ఘానుభవంతో కూడా నవ్వించలేని నాసిరకం హాస్యాన్ని రాసి చేతిలో పెట్టారు. ప్రవీణ్‌, ప్రభాస్‌ శ్రీను కూడా పేరుకి సపోర్ట్‌గా వున్నారే తప్ప వాళ్ల సపోర్ట్‌నీ వాడుకోలేదు. విలన్స్‌ పాత్రధారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కామెడీ, ఎమోషన్‌, రొమాన్స్‌… భావమేదైనా సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కానిచ్చేసే ప్రగ్యా జైస్వాల్‌ తన పర్‌ఫార్మెన్స్‌ నుంచి ఫోకస్‌ డైవర్ట్‌ చేయడానికా అన్నట్టు బట్టలు చాలా పొదుపుగా వాడింది.

మళ్లీ మళ్లీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరా అని తరచి చూసేలా తమన్‌ తన స్థాయికి కనీసం పది లెవల్స్‌ తక్కువ స్థాయి అవుట్‌పుట్‌తో షాకిచ్చాడు. ఎంత మంచి పాటలు చేసినా ఇందులో వృధా అయిపోతాయని గ్రహించాడో ఏమో మరి. నేపథ్య సంగీతం కూడా ఏదో మాట వరసకి మ.మ. అనిపించేసినట్టే వుంది. ఇతర సాంకేతిక విభాగాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. టైటిల్‌లోనే అమెరికా పెట్టి నిర్మాతని లాక్‌ చేసేయడంతో అక్కడికి వెళ్లక తప్పలేదు కానీ ఈ కథకి అబ్రాడ్‌ వెళ్లాల్సిన అవసరమే లేదసలు.

ఎప్పుడో వెలుగు చూడాల్సిన సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ ఇప్పటికి బయటకి వచ్చింది. అన్నిసార్లు ఎందుకు వాయిదా పడిందనే అనుమానం కూడా రానంత క్లారిటీ మొదలైన కాసేపటికే దొరికేస్తుంది. ఒకట్రెండు మంచి సినిమాలు రాగానే తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయి అని సంబరపడే వారికి రియాలిటీ చూపించడానికో లేదా ఎక్స్‌పెక్టేషన్స్‌ కంట్రోల్‌లో వుంచడానికో ఇలాంటివి ఇంకా తీస్తున్నారా అనిపిస్తుంది.

బాటమ్‌ లైన్‌: యాత్ర కాదు యాతన!

– గణేష్‌ రావూరి