సినిమా రివ్యూ: కణం

రివ్యూ: కణం రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: లైకా ప్రొడక్షన్స్‌, ఎన్‌విఆర్‌ సినిమా తారాగణం: సాయి పల్లవి, నాగ శౌర్య, వెరానికా అరోరా, ప్రియదర్శి, నిళల్‌గళ్‌ రవి, రేఖ తదితరులు కూర్పు: ఆంటోని సంగీతం: సామ్‌…

రివ్యూ: కణం
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: లైకా ప్రొడక్షన్స్‌, ఎన్‌విఆర్‌ సినిమా
తారాగణం: సాయి పల్లవి, నాగ శౌర్య, వెరానికా అరోరా, ప్రియదర్శి, నిళల్‌గళ్‌ రవి, రేఖ తదితరులు
కూర్పు: ఆంటోని
సంగీతం: సామ్‌ సి.ఎస్‌.
ఛాయాగ్రహణం: నిరవ్‌ షా
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌
రచన, దర్శకత్వం: విజయ్‌
విడుదల తేదీ: ఏప్రిల్‌ 27, 2018

వంద నిమిషాల నిడివిలో థ్రిల్లర్‌ కథాంశాన్ని డీల్‌ చేస్తే ఖచ్చితంగా అది నస లేకుండా, ప్యాక్డ్‌గా వుంటుంది. అయితే దర్శకుడు విజయ్‌ దగ్గరున్న ఐడియాకి 'వంద నిమిషాల' పాటు హోల్డ్‌ చేసేంత దమ్మున్న కథనం సమకూరలేదు. ఎలాంటి అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా సరాసరి కథలోకి వెళ్లిన విజయ్‌… అవసరమైన విషయాలని కూడా తెరపైకి ప్రతిభావంతంగా తీసుకురాలేకపోయాడు. దీంతో 'కణం' ఒక మంచి ఐడియా అనిపించుకున్నా, ఆకట్టుకునే సినిమా కాలేకపోయింది.

బ్రూణ హత్యల ఇతివృత్తంతో రాసుకున్న సూపర్‌ నేచురల్‌ ఎలిమెంట్స్‌ వున్న థ్రిల్లర్‌ ఇది. అయితే సగటు హారర్‌ చిత్రంలా కాకుండా ఎమోషనల్‌గా డీల్‌ చేసారు. పిండంగా చంపబడిన పాప అయిదేళ్ల ఆత్మగా తిరిగి వచ్చి తన 'హత్య'కి కారణమైన వాళ్లని ఒక్కొక్కరిగా చంపేయడమే ఈ కథాంశం. గర్భంలో చిదిమి వేయబడ్డ ప్రాణం కనుక ఆమె చేసే హత్యలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే సంభవిస్తాయి. ఈ అంశం 'ఈరమ్‌' (వైశాలి) అనే తమిళ చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది.

చాలా హారర్‌ లేదా సూపర్‌ నేచురల్‌ సినిమాల మాదిరిగానే ఇది కూడా ప్రతీకారంతో ముడి పడిన కథే. తల్లిని, బిడ్డని దూరం చేసిన వారందరిపై చనిపోయిన బిడ్డ ప్రతీకారం తీసుకోవడం పేపర్‌పై ఎక్సయిట్‌ చేసే పాయింటే. అయితే ఆ పాయింట్‌కి సినిమాటిక్‌ స్క్రీన్‌ప్లే రాయడంలో, ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

హత్యలన్నీ ఒక పేటర్న్‌ ప్రకారం వరుస క్రమంలో జరిగిపోవడం, ఎలాంటి టెన్షన్‌ లేకుండా చాలా సింపుల్‌గా జరిగిపోతూ వుండడంతో ఆరంభంలో వున్న ఆసక్తి క్రమేపీ సన్నగిల్లిపోతుంది. ద్వితియార్ధం మొత్తంగా ఆమె చేయాల్సింది ఒకే ఒక హత్య కాగా, అది కూడా ప్రిడిక్టబుల్‌ అయిపోవడంతో సెకండ్‌ హాఫ్‌ బాగా ఫ్లాట్‌గా అనిపిస్తుంది.

తక్కువ నిడివి కావడంతో ఏ పాత్రకీ ఒక క్యారెక్టర్‌ ఆర్క్‌ లేకుండా పోయింది. దీంతో ఏ క్యారెక్టర్‌తోను సింపతైజ్‌ చేయలేం. చివరకు సాయి పల్లవికున్న ఎమోషన్‌తో కూడా కనెక్ట్‌ కాలేం. తప్పనిసరి పరిస్థితుల్లో చేయించిన 'అబార్షన్‌' కావడంతో ఈ రివెంజ్‌ ప్లాట్‌లో విక్టిమ్‌ వైపు మొగ్గు చూపే పరిస్థితి లేకపోయింది. ఈ అబార్షన్‌ వ్యవహారాన్ని ఇంకాస్త ఎమోషనల్‌ పాయింట్‌తో ముడిపెట్టినట్టయితే ఎఫెక్టివ్‌గా వుండేది.

అలాగే అప్పటికే చనిపోయి అయిదేళ్లు గడిచిపోయిన తర్వాత ఆ పాప ఏ మోటివ్‌తో పగ తీర్చుకుంటుందనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఎలాగో తల్లికి కనిపించలేని స్థితిలో వున్న ఆ పాప దేని కోసమని ఆ హత్యలు చేస్తున్నట్టు? ఇంతకంటే ఆమెని ఏదో ప్రమాదం నుంచి, దుష్టుల నుంచి కాపాడుతూ వస్తోందంటే ఆ తల్లీ బిడ్డల ఎమోషన్‌కి స్ట్రాంగ్‌ బేస్‌ వుండేదేమో.

అన్నీ హాఫ్‌ బేక్డ్‌ పాత్రలే వున్న ఈ చిత్రంలో అంతో ఇంతో జీవమున్న పాత్ర సాయి పల్లవిదే. బహుశా తన టాలెంట్‌తో దర్శకుడు రాసుకున్న లైఫ్‌ లేని క్యారెక్టర్‌కి కూడా సాయి పల్లవి జీవం పోసిందేమో కూడా. ఆమె టాలెంట్‌ ఏమిటనేది చెప్పడానికి ఇంటర్వెల్‌, క్లయిమాక్స్‌ సీన్‌ చాలు. ఇంత ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌ ఈమధ్య కాలంలో వెండితెరపై కనిపించలేదంటే అతిశయోక్తి కాదు.

నాగశౌర్య పాత్రని పాసివ్‌గా తీర్చిదిద్దితే అతను కూడా అన్యమనస్కంగా నటిస్తున్నట్టే అనిపిస్తాడు. ఎలాంటి ఎక్స్‌ట్రా ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా స్ట్రెయిట్‌ టు ది పాయింట్‌ అన్నట్టు కథ నడిపించాలని చూసిన దర్శకుడు మరి ప్రియదర్శి పాత్రతో మాత్రం కామెడీ ఎందుకు చేయించాలని చూసాడో బోధ పడదు. ఆ క్యారెక్టర్‌ నవ్వించకపోగా ఇరిటేట్‌ చేస్తుంది. లాస్ట్‌ సీన్స్‌లో ట్రాక్‌ మీదకి వచ్చినా కానీ ఆ పాత్రలో సడన్‌ ఛేంజ్‌ దేనికి వచ్చిందో సరిగా రిజిష్టర్‌ చేయలేదు.

నేపథ్య సంగీతం, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ బాగున్నాయి. ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. ఒక మూడ్‌ మెయింటైన్‌ చేస్తూ… జరిగే హారర్‌ ఇన్సిడెంట్స్‌ మధ్య 'డేంజర్‌'ని (పాప) ప్రశాంతంగా చూపించడం, దాంట్లోంచే ఒక కొత్త రకం భయానుభూతి రేకెత్తించడం మెప్పిస్తుంది. సుజిత యాక్సిడెంట్‌ సీన్‌లో కెమెరా వర్క్‌ చాలా చాలా బాగుంది. ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా వుంది.

దర్శకుడు ఈ చిత్రాన్ని షార్ట్‌ ఫిలిం తరహాలో ఓ లొకేషన్‌ నుంచి మరో లొకేషన్‌కి షిఫ్ట్‌ అవుతున్నట్టు, తక్కువ కట్స్‌తో చిత్రీకరించాడు. బడ్జెట్‌ ఎక్కువ లేని షార్ట్‌ ఫిలిం మేకర్‌లా చాలా చాలా బేసిక్‌ పద్ధతుల్లో తీసేసాడు. మరీ ఇంత సింపుల్‌గా తీసేయడం కాకుండా టెన్షన్‌తో కూడా థ్రిల్లర్‌లా తెరకెక్కిస్తే బాగుండే ఛాన్స్‌ వుండేది. ఐడియా బాగున్నా కానీ దానిని తెరపైకి తెచ్చిన విధానం మెప్పించలేకపోయింది. ఒక ఐడియాకి రాసుకున్న ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ స్క్రిప్ట్‌తోనే షూటింగ్‌కి వెళ్లిపోయిన ఫీలింగ్‌ వస్తుంది. స్ట్రాంగ్‌ స్క్రీన్‌ప్లే వున్నట్టయితే కన్నడలో వచ్చిన 'యు టర్న్‌' మాదిరిగా ఉత్కంఠభరిత థ్రిల్లర్‌ అయి వుండేది.

పదుల సంఖ్యలో వస్తోన్న హారర్‌/థ్రిల్లర్‌ చిత్రాల మధ్య డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌ వున్న చిత్రమే అయినా కానీ సరిగ్గా డెవలప్‌ చేయని స్క్రిప్ట్‌ కావడంతో 'కణం' అనే ఐడియా కూడా మొగ్గ దశలోనే అబార్ట్‌ చేసినట్టయింది. ఒక పదిహేను నిమిషాలు నిడివి పెంచుకుని అయినా ఎమోషనల్‌ యాస్పెక్ట్‌పై వర్క్‌ చేసి వుండాల్సింది. లేదా కనీసం హత్యలని అయినా టెన్షన్‌ పెట్టే విధంగా చూపించాల్సింది.

ప్రతి సన్నివేశంలోను క్యాజువల్‌నెస్‌, లేజీనెస్‌ చొరబడడంతో 'కణం' ఏ పాయింట్‌లోను కట్టి పడేయలేకపోయింది. ఈ జోనర్‌ సినిమాలకి అది చాలా పెద్ద వెలితి. చివరకు దర్శకుడు ఇవ్వాలని చూసిన సందేశం కూడా సగం సగమే రీచ్‌ అయ్యేలాగుంది కానీ పూర్తి స్థాయిలో రిజిష్టర్‌ అవలేకపోయింది. ఏ విధమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వని ఈ ఫ్లాట్‌ సినిమాని సాయిపల్లవి టాలెంట్‌ కూడా గట్టెక్కించలేకపోయింది.

బాటమ్‌ లైన్‌: అన్నీ సగం సగం!
– గణేష్‌ రావూరి