నిషేధాన్ని మెగా క్యాంప్ లోకి తోసే కుట్ర?

మీడియా నిషేధంపై ఇంకా నిర్ణయం లేదు, ప్రకటన లేదు కానీ ఇప్పటికే దీనిపై రకరకాల కథనాలు వచ్చేసాయి. ఈ కథనాల్లో చాలా వరకు దీని వెనుక మెగా క్యాంప్ వుందని, దాని ప్రోద్బలమే ఎక్కువగా…

మీడియా నిషేధంపై ఇంకా నిర్ణయం లేదు, ప్రకటన లేదు కానీ ఇప్పటికే దీనిపై రకరకాల కథనాలు వచ్చేసాయి. ఈ కథనాల్లో చాలా వరకు దీని వెనుక మెగా క్యాంప్ వుందని, దాని ప్రోద్బలమే ఎక్కువగా వుందని, అలాగే అల్లు అరవింద్ దీనికి చొరవ చూపిస్తున్నారని అనిపించేలా వున్నాయి.

ఇండస్ట్రీలో జరుగుతున్న సమావేశాలు క్లోజ్డ్ డోర్స్ లో జరుగుతుండడం, ఎప్పటికప్పుడు సమావేశం వివరాలు ఎవ్వరూ బయటకు వెల్లడించకపోవడంతో, ఎవరి కథనాలు వాళ్లు వండి వారుస్తున్నారు. ఇటీవల న్యూస్ చానెళ్ల డిస్కషన్లలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వల్ల, ఆ నేపథ్యంలో ఈ చర్యలకు ఇండస్ట్రీ పూను కోవడం వల్ల ఇదంతా మెగా క్యాంప్ నడిపిస్తున్న వ్యవహారం అని టాక్ బయలుదేరింది.

అయితే సమావేశాల్లో జరుగుతున్నది, మాట్లాడతున్నది వేరు అని తెలుస్తోంది. తన కొడుకుపై అభియోగాలు, విమర్శలు రావడంతో ఓ నిర్మాత కమ్ స్టూడియో ఓనర్ తెరవెనుక నుంచి తాను అనుకున్నవిధంగా వ్యవహారం నడిపిస్తున్నారన్న గుసగుసలు వున్నాయి. ఆయనకు సన్నిహితుడైన ఓ వ్యక్తి ఇటీవల తనంతట తాను హీరోలు ఏర్పాటు చేసుకున్న సమావేశంలోకి కూడా వచ్చారని తెలుస్తోంది.

ఎప్పుడో సినిమాలు నిర్మించడం, దర్శకత్వం చేసిన ఈయన ఇప్పుడు కేవలం యూట్యూబ్ లో, చానెళ్లలో కాలక్షేపం చేస్తున్నారు. ఈయన తనంతట తాను హీరోల సమావేశంలోకి వస్తూనే వెబ్ మీడియా మీద విరుచుకుపడినట్లు తెలుస్తోంది. అసలు ఈ వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని, వాటికి ఒక్క ప్రకటన కూడా ఇవ్వకూడదని ఆయన ఆవేశంగా మాట్లాడేసారని తెలుస్తోంది.

అయితే వెబ్ మీడియా బ్యాన్ పై మొదటి నుంచీ అరవింద్ విముఖతతో వున్నారని తెలుస్తోంది. ఓవర్ సీస్ లో ఇరవై కోట్ల మేరకు వ్యాపారం జరిపే రేంజ్ కు వచ్చారని, అక్కడి డిస్ట్రిబ్యూటర్ల పబ్లిసిటీని మనం ఎలా డిసైడ్ చేస్తామని ఆయన వాదిస్తూ వస్తున్నారు. కానీ ఓ స్టూడియోలో ఎక్కువగా కనిపించే, ఆ ఆసామీ మాత్రం ఈ విషయంలో చాలా పట్టుదలగా వున్నారని వినికిడి. దీని వెనుక ఆ స్టూడియో అధినేత ప్రోద్బలం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

టోటల్ గా ఇండస్ట్రీలో అందరూ బ్యాన్ మీద కొద్దో గొప్పో సుముఖంగా వున్నా, ఇండస్ట్రీలోని ఒక వర్గం తెలివిగా ఈ మొత్తం వ్యవహారాన్ని మెగా క్యాంప్ లోకి తోసేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు కథనాలు, గ్యాసిప్ లు బయటకు వదులుతున్నారు.

ఈ విషయాన్ని పసిగట్టిన అరవింద్ వర్గం దీనిపై ఆచి తూచి వ్యవహరించాలని చూస్తోంది. హీరోలు సమావేశం అవుతున్నారని తెలిసి, ఆ మాజీ నిర్మాత, దర్శకుడు ఎందుకు హడావుడిగా సమావేశంలోకి వచ్చారని? ఆయన వెనుక ఎవరు వున్నారో అందరికీ తెలిసిందే అని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద మీడియా ప్రకటనలపై నిషేధం విధించాలని, ఇండస్ట్రీలో అందరూ అభిప్రాయపడుతున్నా, ఆ పాపాన్ని మాత్రం మెగా క్యాంప్ లోకి తోసేయాలన్న వ్యవహారం ఒకటి తెరవెనుక నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.