జాతకప్రభావమే అంటారు సాటి నటీమణి భానుమతి. సావిత్రి కష్టాల్లో పడ్డాక ''వెండితెర విషాద రాగాలు'' అనే పుస్తకం రాసిన పసుపులేటి రామారావు పత్రికా విలేకరిగా ఆవిడతో మాట్లాడినప్పుడు ఆమె ''మీరంతా సావిత్రిది స్వయంక తాపరాధం అనుకుంటున్నారు కదా! కాదు, అదంతా ఆమె జాతక ప్రభావం. ఆమెది మహత్తరమైన జాతకం. కానీ చివరి రోజులు భయంకరంగా వుంటాయి.
ఆమె మరణం కూడా అంతే! సావిత్రి అప్పుడప్పుడు పూజలు చేసేది తప్ప తన జాతకం చూపించుకున్నది లేదు. ఎదుగుతున్న వ్యక్తులకు గండాలుంటాయి. గ్రహాలు మారుతూంటాయి. జ్యోతిష్కులను అడిగి గ్రహాలకు శాంతులు చేయించుకోవాలి. సినిమాలు చేయడం, డబ్బు సంపాదించుకోవడం సరిపోదు. తనకు తెలియకపోతే తెలిసిన వాళ్లనైనా అడగాలి. సావిత్రిపై కోపంతో యీ మాటలు అనడం లేదు. తన చుట్టూ అంతమందిని పెట్టుకుంటుంది. సమయానికి మంచి సలహా కూడా చెప్పనివాళ్లంతా ఎందుకంట? అసలు ఆమె చుట్టూ చేరిన వాళ్లంతా దొంగలే'' అన్నారు. ''పోనీ మీరైనా ఓ మాట చెప్పలేకపోయారా?'' అని ఆయన అడిగారు.
''అడగందే చెప్పకూడదు. అవి ఎప్పుడూ సిద్ధాంతులే చెప్పాలి. ఓ సారి మంచికి పోయి ఓ లైట్‌మ్యాన్‌కు సలహా చెపితే క్రియలో ఏదో వక్రీకరించింది. మా ఆయన రామక ష్ణగారు కొట్టినంత పని చేశారు. ఇంకెప్పుడూ నీ బోడిజాతకాలు, పూజలు చెప్పకు, చెప్పావంటే నీ నాలిక కత్తిరిస్తానన్నారు. అప్పణ్నుంచి నేను యిలాటి విషయాల్లో బయటపడడం లేదు.'' అని జవాబిచ్చింది ఆవిడ.
''కానీ మీరంటే ఆవిడకు చాలా గౌరవం. నేనడిగినప్పుడు 'భానుమతి గారు చేసే కారెక్టర్స్ కొన్ని మేమెవరం చేయలేం. ఆవిడ పాటంటే కూడా నాకు బాగా యిష్టం. ఇండస్ట్రీలో ఆవిడ ఒక ప్రత్యేకమైన మనిషి. ఎప్పుడో ''మిస్సమ్మ'' నాటి కోపం యింకా అవిడలో అలానే వుంది. మా యింటి గ హప్రవేశానికి, మా అబ్బాయి బారసాలకు ఇంటికెళ్లి పిలిచినా రాలేదు.' అన్నారు. మీ అంతట మీరేనా శాంతుల గురించి చెప్పాల్సింది.'' అన్నారు పసుపులేటి.
''సావిత్రి మంచిదే. కాదనను. కానీ తాను లేనిపోని ఆర్భాటాలకు పోయింది. తెలిసీ తప్పులు చేసింది. అలాంటప్పుడు నేను బాధపడిన సందర్భాలున్నాయి. 'మిస్సమ్మ' సంఘటన నుండి తనకీ నాకూ మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమే. మా మధ్య సఖ్యత లేదు. ముక్తసరిగా మాట్లాడుకునే వాళ్లం. తన పొరపాటు ఏమీ లేదన్న విషయం నాకు తెలుసు. దేవుని వ్రతం వల్ల షూటింగ్‌కు ఆలస్యమైంది.
తన అసిస్టెంటు పొరపాటు వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా చక్రపాణి ఒప్పుకోలేదు. తీసిన నాలుగురీళ్ల ఫిల్మ్ తగలబెట్టి, తనకు కావాల్సిన సావిత్రిని అప్పటికప్పుడు ఫిక్స్ చేసేసుకున్నాడు. ఈ విషయంలో సావిత్రిని తప్పుపట్టడం లేదు. కానీ తనతో స్నేహంగా వుండటానికి నాకు మనస్కరించడం లేదు. పోనీ సావిత్రయినా నోరు తెరిచి ఏమిటక్కయ్యా ఇలాగుంది పరిస్థితి ఏం చెయ్యమంటారు? అంటూ అడిగింది లేదు.'' అని వివరించింది.
ఈ విషయాన్ని పసుపులేటి సావిత్రికి చెప్పారు కూడా. ఆమె ''పూజలూ, శాంతులూ మనిషి జీవితాలను బాగు చేస్తాయా? పెద్దావిడ ఏదో అన్నారు. వదిలేయండి. నేను కర్మను నమ్ముతాను. దాని నుండి సంప్రాప్తమయ్యే ఫలాన్ని నమ్ముతాను. అంతా అయిపోయాక యిప్పుడు ఆకులు పట్టుకుంటే సుఖం ఏమిటి? కొడిగట్టి పోతోంది జీవితం. రేపో మాపో ఆరిపోతుంది. ఆ రోజు కోసం చూడ్డమే మన వంతు.'' అని వైరాగ్యం ప్రకటించింది సావిత్రి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]