ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న నా పేరు సూర్య ట్రయిలర్ బయటకు వచ్చింది. ఇటు దేశభక్తి, అటు ప్రేమ, మరోపక్క కుటుంబం సరదాలు అన్నీ వుండేలా జాగ్రత్త పడి ట్రయిలర్ కట్ చేసినా, టోటల్ గా ట్రయిలర్ లో కనిపిస్తున్నది ఎక్కువగా అల్లు అర్జున్ ఆగ్రహమే.
ట్రయిలర్ మొత్తం అదే జోనర్ లో అదే స్పీడ్ లో కట్ చేసినట్లు కనిపిస్తోంది. దేశభక్తి, టెర్రరిజం, దేశంపట్ల ప్రేమ, అణువణువునా ఆవేశం వున్న సైనికుడిగా బన్నీ కనిపించాడు.
హీరో తండ్రి అంటే ఏజ్ ఓల్డ్ గెటప్ అన్న ట్రెండ్ ఇప్పడు మారింది. అది ఈ సినిమాలో కూడా సీనియర్ అర్జున్ ను చూస్తే తెలుస్తోంది. టోటల్ గా సినిమా రిచ్ లుక్ వుండేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. లోకేషన్లు సెట్ లు, అన్నీ డిఫరెంట్ గా, కాంటెంపరరీ రిచ్ లుక్ వుండేలా చూసుకోవడంతో ట్రయిలర్ కు మాంచి కలర్ వచ్చింది.
బన్నీ ట్రయిలర్ మొత్తం మీద అంతటాతానై కనిపించాడు. ఇలాంటి ఎమోషన్, యాంగ్రీ రేసీ యాక్షన్ సీన్లు గతంలో జులాయి, రేసుగుర్రం వంటి సినిమాల్లో కూడా చూసాం. మళ్లీ ఆ జోనర్ లో తన పట్టు తనదే అన్నట్లు కనిపించాడు బన్నీ.
వాస్తవానికి ఇప్పటివరకు నా పేరు సూర్య సినిమాకు అంతగా బజ్ రాలేదు. పబ్లిసిటీ కూడా వీక్ గానే వుంది. ఇప్పుడు ఈ ట్రయిలర్ తో అది ఊపందుకునే అవకాశం వుంది. ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేయాలి. ఎందుకుంటే, ఇప్పటికే థియేటర్లలో వున్న రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలతో ఈ సినిమా పోటీ పడాల్సి వుంది.