కొరటాల మనసులో మాట

కొరటాల శివ ఇప్పుడు టాప్ డైరక్టర్ నెంబర్ 2 అనుకోవాలి. ఎందుకంటే ఆయన ముందు రాజమౌళి వున్నాడు. కొరటాలతో పోటీ పడాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పరమ భయంకర డిజాస్టర్ అందించి, అలాగే ఓ…

కొరటాల శివ ఇప్పుడు టాప్ డైరక్టర్ నెంబర్ 2 అనుకోవాలి. ఎందుకంటే ఆయన ముందు రాజమౌళి వున్నాడు. కొరటాలతో పోటీ పడాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పరమ భయంకర డిజాస్టర్ అందించి, అలాగే ఓ ఫ్లాప్ సినిమాకు కథ ఇచ్చి, నాలుగు అయిదు అంకెల వెనక్కు వెళ్లిపోయారు.

సో అందువల్ల ఎలా చూసుకున్నా కొరటాలది ఇప్పుడు టాప్ 2 ప్లేస్. సుకుమార్, బోయపాటి ఇలా చాలా మంది ట్రాక్ రికార్డు రీత్యా, కొరటాల తరువాతే అనుకోవాలి.  వరుస హిట్ లు ఇచ్చి, ఫెయిల్యూర్స్ లేని రికార్డు కొరటాలది.

ఇలాంటి ట్రాక్ రికార్డు వున్న వ్యక్తి వరుసగా ఓ పదేళ్లకు ప్రణాళికలు వేసుకోవడం సహజం. వరుసగా నాలుగైదు టాప్ సినిమాలు చేయాలని అనుకోవడం అంతకన్నా సహజం.

కానీ కొరటాల శివకు చిరకాలం పాటు టాలీవుడ్ లో వుండాలని లేదట. ఏవో కొన్ని సినిమాలు, అవి కూడా తనకు నచ్చిన పాయింట్లు దొరికితే చేసి, ఆపైన టాలీవుడ్ కు గుడ్ బై చెప్పాలన్నది ఆయన మనసులో మాటగా తెలుస్తోంది. ఆయన ఈ విషయాన్ని తన సన్నిహితులతో షేర్ చేసుకున్నారట కూడా.

కొరటాల ఎంత కమర్షియల్ దర్శకుడు అయినా, భారీ సినిమాలు, భారీ మార్కెటింగ్, భారీ రెమ్యూనిరేషన్ తీసుకున్నా, ఆయనవి అన్నీ కమ్యూనిస్ట్ భావాలంట. అందుకే ఆయన తన సిద్దాంతాలతో ఏవేవో ఆలోచనలతో వుంటారట ఎప్పుడూ.

అందుకే ఎక్కువ సినిమాలు కూడా చేయరట. ఇవన్నీ సన్నిహితులు చెపుతున్నమాటలు. గతంలో ఎప్పుడో ఎమ్మెల్యే కావాలనుకున్నారు కూడా అని నిన్నటికి నిన్న హీరో మహేష్ బాబు వెల్లడించారు కూడా. కోంపదీసి, మంచి సందేశాత్మక సినిమాలు తీసిన ఇమేజ్ తో రాజకీయాల్లోకి వెళ్లిపోతారేమో?