పట్టిందల్లా బంగారం అనే టైపులో చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవ్వడంతో నాని ఆగలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. సక్సెస్ లు కూడా అలానే వచ్చాయి. ఎట్టకేలకు ఇతడి స్పీడ్ కు కృష్ణార్జున యుద్ధం బ్రేకులు వేసింది. తను ఏం చేసినా జనాలు చూస్తారనే నాని భ్రమల్ని పటాపంచలు చేసింది కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.
ఈ సినిమాలో నాని చేసిన కృష్ణ పాత్ర బాగా క్లిక్ అయింది. కానీ అదే సినిమాలో చేసిన అర్జున్ పాత్ర మాత్రం ఎవ్వరికీ కనెక్ట్ కాలేదు. దీంతో కథల ఎంపికలో తను తడబడిన విషయాన్ని గ్రహించాడు నాని. దీంతో తన అప్ కమింగ్ మూవీస్ పై ఇప్పటివరకు వింటున్న కథలపై మరోసారి దృష్టిపెట్టాడు.
ఒకేసారి 2-3 సినిమాల్ని ఎనౌన్స్ చేయడం నాని స్టయిల్. గడిచిన 8 సినిమాల నుంచి ఇదే పనిచేస్తూ వచ్చాడు. కానీ కృష్ణార్జున యుద్ధం ఫెయిల్యూర్ తో తన ప్లాన్స్ అన్నీ ఆపేశాడు. ప్రస్తుతం నాగార్జునతో చేస్తున్న మల్టీస్టారర్ మూవీ మినహా మరో ప్రాజెక్టు ప్రకటించలేదు. పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ అలానే వదిలేశాడు.
నిజానికి నాని చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి. అవన్నీ చర్చల దశలో ఉన్నాయని, ఏది ముందు సెట్స్ పైకి వస్తుందో చెప్పలేనని నానినే స్వయంగా చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఆ కథలన్నీ పక్కనపెట్టే ఉద్దేశంతో ఉన్నాడట ఈ హీరో. ఎందుకంటే పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలు, మాస్ సబ్జెక్టులు తన ప్రొఫైల్ కు సరిపడవనే విషయాన్ని తెలుసుకున్నాడు ఈ హీరో.
సో.. నాని నెక్ట్స్ ఎలాంటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.