కాంబినేషన్ లేకుండా జనాలు థియేటర్ కు రావడం తక్కువయింది. ఎక్కడో రేర్ గా నాన్ కాంబినేషన్ సినిమాలు ఆడుతున్నాయి. అలాగే ఎక్కడో రేర్ గా కాంబినేషన్ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. అందుకే హీరోల కోసం డైరక్టర్లు, డైరక్టర్ల కోసం హీరోలు ఛూజీగా వుంటున్నారు. అలాగే ఈ ఇద్దరి కాంబోలు సెట్ చేయాలని నిర్మాతలు కిందామీదా అవుతున్నారు.
కానీ బన్నీ మాత్రం ఈ వ్వవహారం ఇష్టంపడడం లేదని తెలుస్తోంది. తాను ఇలా డైరక్టర్ల కాంబినేషన్ చూసి చేసిన సినిమాలు మరీ అద్భుతమైన ఫలితాలు ఏవీ ఇవ్వలేదన్నది బన్నీ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే అతగాడు వక్కంతం వంశీతో సినిమా చేస్తున్నాడు. ఇదిలా వుంటే మైత్రీ మూవీస్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమాను బన్నీ మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.
ఎందుకుంటే మైత్రీ మూవీస్ కు బన్నీతో సినిమా చేయాలనే వుంది. కానీ బన్నీనే వారిని ఎందుకో దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హవుస్ ల్లో ఒకటి. కానీ చిరకాలంగా అడుగుతున్నా బన్నీ చేయడం లేదని తెలుస్తోంది. ఆఖరికి రంగస్థలం విడుదల ముందు కూడా అల్లు అరవింద్ ను మైత్రీ నిర్మాతలు అడిగితే, బన్నీతో మాట్లాడమనే సలహా వచ్చింది తప్ప, అలాగే అని కాదు.
అసలే పెద్ద దర్శకులు ఖాళీగా లేరు. అలాంటి టైమ్ లో సుకుమార్ లాంటి డైరక్టర్, అది కూడా రంగస్థలం హిట్ కొట్టిన తరువాత, మైత్రీ లాంటి బ్యానర్ రెడీగా వున్నపుడు బన్నీనే ముందుకు వెళ్లాల్సి వుంది. ఎందుకంటే ఇప్పుటికిప్పుడు బన్నీ చేతిలో సినిమా అన్నది లేదు. అయినా బన్నీ చొరవ చూపించినట్లు లేదు. దాంతో ఆ కాంబినేషన్ అలా మహేష్ దగ్గరకు వెళ్లిపోయింది. ఇప్పటి వరకు వంశీ పైడిపల్లి తరువాత ఎవరు? అన్న క్వశన్ వుంటే, ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది.
ప్రతి హీరో రెండు మూడు సినిమాలు సెట్ చేసుకుని రెడీగా వుంటే, బన్నీ మాత్రం ఒక్క సినిమా కూడా సెట్ చేసుకోకపోవడం ఆశ్చర్యం. ఈ లెక్కన చూసుకుంటే మళ్లీ సమ్మర్ దాకా బన్నీ సినిమా వుండకపోవచ్చు. స్క్రిప్ట్ ఒకంతట లాక్ అవ్వదని, స్క్రిప్ట్ లాక్ చేయడానికే నెలలు పట్టేస్తుందని, బన్నీ మీద డైరక్టర్ల సర్కిళ్లలో అభిప్రాయాలు వున్నాయి.
ఇక ప్రొడక్షన్ హవుస్ ల విషయంలో కూడా బన్నీ సెలక్టివ్ గా వుంటున్నారు. హారిక హాసినిని వదిలేసినట్లే కనిపిస్తోంది. మైత్రీని వద్దనుకున్నట్లు తెలుస్తోంది. మరి బన్నీ స్ట్రాటజీ ఏమిటో?