ఇదేనా మీడియా?

మీడియా అంటే సేవారంగం. కానీ, ఆ పదాలకు ఇవాళ నిర్వచనం పూర్తిగా మారిపోయింది. మీడియా అంటే 'సామాజిక సేవ' అనే నిర్వచనం నుంచి 'వ్యక్తిసేవ' అనే నిర్వచనంలోకి మారిపోయింది. Advertisement మీడియా అంటే ఒపీనియన్‌! …

మీడియా అంటే సేవారంగం.
కానీ, ఆ పదాలకు ఇవాళ నిర్వచనం పూర్తిగా మారిపోయింది. మీడియా అంటే 'సామాజిక సేవ' అనే నిర్వచనం నుంచి 'వ్యక్తిసేవ' అనే నిర్వచనంలోకి మారిపోయింది.

మీడియా అంటే ఒపీనియన్‌! 

సహజ నిర్వచనాల ప్రకారం మీడియా అంటే ఒపీనియన్‌ మేకింగ్‌ వ్యవస్థ.! కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి ఉపయోగపడే ఒక ఒపీనియన్‌ను ప్రజల్లో నిర్మించేలా, అభిప్రాయాన్ని ప్రోదిచేసేలా మీడియా లేదు. ప్రజల ఒపీనియన్‌ ఎలా ఉంటే అలా నడిచేలా మారిపోయింది. 
మీడియా పాత్రికేయ విలువలు అంటే.. ఉండే సహజ నిర్వచనాలు అన్నీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి. 
మీడియా అంటే ఒక మాఫియా లాగా తయారైంది. బ్లాక్‌ మెయిలింగ్‌ వారికి ఒక సహజమైన అలవాటులాగా మారింది. సాధారణంగా మీడియాలో ఒక నిత్యసత్యమైన సూత్రం వినిపిస్తూ ఉంటుంది. 'రైజింగ్‌ టూ దీ అకేషన్‌' అని అంటూ ఉంటారు. సందర్భాన్ని బట్టి విజ్రుభించి పనిచేయాలనేది దాని నీతి. ఇవాళ దాని నిర్వచనం మార్చేసి.. సందర్భాన్ని బట్టి దొరికినంత దండుకోవడం అనేది నిత్యకృత్యంగా మార్చేశారు. 

ఎందుకిలా జరుగుతోంది.

సమాజంలో జరుగుతున్న దానిని ప్రతిబింబించడం.. అందులోని మంచి చెడులను తర్కించడం అనే మీడియా లక్ష్యాలు మంటగలిసిపోయాయి. సమాజం దేనివెంట పరుగెడుతోంటే.. దానివెంట పడడం మాత్రమే మీడియా చేస్తున్న పని. ఒకప్పట్లో సినిమాల గురించి ప్రధానమైన విమర్శ ఒకటుండేది. సినిమాలు జనాన్ని చెడగొడుతున్నాయి… బూతు, నేరం, హింస అనే దుర్లక్షణాలను సినిమా ప్రచారం చేస్తూ సమాజాన్ని చెడగొడుతోందని అందరూ అంటుండేవారు. అయితే సినిమా ప్రపంచం నుంచి దీనిని ఖండించేవారు. ప్రజలు ఏది చూస్తున్నారో.. అదేచేస్తున్నాం.. అని సినిమా రంగం అనడమూ, సినిమాల్లో ఏది చేస్తున్నారో అదే చూస్తున్నాం అని ప్రజలు అనడమూ.. రెగ్యులర్‌గా మారిపోయింది.

ఇప్పుడు అదే పరిస్థితి మీడియా రంగానికి అంటుకుంది. పత్రికలు విలువలు ఇలాంటివేమీ నిమిత్తంలేదు. అచ్చంగా… వ్యాపారం ఒక్కటే పరమావధి అయిపోయింది. వ్యాపారం లేకుండా.. మీడియా పనిచేయాలన్నది మన ఉద్దేశం కాదు. కానీ.. వ్యాపారం కోసం.. సమస్త సామాజిక విలువలకు పాతర వేసేయడం.. ప్రజల ఆలోచనలను విషతుల్యం చేసేలాగా… సమాజపు బుద్ధులను (పరి)మార్చేసేలాగా మీడియా పనిచేస్తున్నది. పాత్రికేయరంగం అనేది ఇప్పుడు రెండు ముక్కలుగా విడిపోయింది. ముద్రణ, టీవీ మాధ్యమాలు కాగా…. మీడియా అనేపదం.. టీవీ ఛానెళ్లకు ప్రత్యేకించిన పరిభాషలాగా చెలామణీ అవుతున్నది. ఆ రంగం.. రాను రాను బ్లాక్‌ మెయిలింగ్‌కు, దందాలకు నెలవుగా మారుతున్నదనే విమర్శలు పెచ్చు మీరుతున్నాయి.

బహుముఖ ప్రవేశం…

మీడియా యాజమాన్యాల్లోకి ఇప్పుడు బహుముఖ ప్రవేశం జరిగింది. మీడియా అంటే సమాచార ప్రపంచం మాత్రమే అనుకునే రోజులు పోయాయి. మీడియా అంటే.. తమ ఇతర వ్యాపారాలకు ఇది రక్షణ కవచం అనీ… తమ రాజకీయ కార్యకలాపాలకు ఇది ప్రచార వేదిక అనీ.. భోగలాలసత నిపుణులకు నిత్యం రాసక్రీడల భాగ్యాన్ని ప్రసాదించగల రసపుష్టి ఉన్న రంగం అనీ.. రకరకాల మూల కారణాలతో 'మీడియా'లోకి చాలామంది ప్రవేశిస్తున్నారు. ఇందుకు ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. మీడియాలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కానీ.. ఒక్క తెలుగులో మాత్రమే.. దాదాపు పాతికకు పైగా న్యూస్‌ ఛానెళ్లు ఎందుకున్నాయి.

ఇక్కడ ప్రలోభాలు ఎక్కువ… ఇక్కడ అత్యాశ ఎక్కువ… మీడియాలో ప్రముఖులుగా ఉంటేచాలు.. ఏదో అయిపోతాం అనే దురాశ… ఇలా చెలరేగిపోయే వాళ్లంతా టీవీ ఛానెళ్లు పెట్టేస్తున్నారు. అపరిపక్వ జ్ఞానం ఉంటే చాలు.. తక్షణ ఫలితాలు కోరుకునే ఏ ఎన్నారై పెట్టుబడి దారులనో.. రాజకీయ దురాశ ఉన్న వారినో బుట్టలో పెట్టగలిగితే చాలు… ఒక కొత్త టీవీ ఛానెల్‌ ప్రారంభం అయిపోతోంది. తమ వక్ర ప్రయోజనాలను ఈడేర్చుకోవడానికి మీడియాను అడ్డదారిగా వాడుకోవాలనే వారు పెరగడంతోనే.. ఇలాంటి పరిస్థితి దాపురించిందని అనుకోవాలి.

జర్నలిజం అనేది జనసామాన్యంపై ప్రభావం చూపించే వ్యవస్థ. తెలుగులోనే ఈ పరిస్థితి రావడానికి రామోజీరావు ఒక కారణం అనుకోవాలి. జనాలను బాగా ప్రభావితం చేయగల ఒక పత్రిక ఉంటే చాలు… ముఖ్యమంత్రుల్ని దించేయడం, ముఖ్యమంత్రుల్ని గద్దె ఎక్కించడం వంటి కింగ్‌ మేకర్‌ హోదా, రాజగురువు పాత్ర తమకు కూడా దక్కుతుందనే దురాశ ఆయనను చూసి చాలామంది డబ్బున్న వాళ్లకు కలగడం.. తెలుగులో ఇన్ని మీడియా ఛానెళ్లు రావడానికి మూలకారణం.

ఎందుకు దారితప్పాయి..

కింగ్‌మేకర్‌ కావాలని డబ్బున్న ప్రతి ఒక్కడూ కోరుకోవడం తప్పేమీకాదు. అది అసభ్యమైన పని కూడా కాదు. కాకపోతే.. కాలక్రమంలో ఈ చానెళ్లు దారి తప్పుతున్నాయి. కింగ్‌మేకర్‌ హోదా అందరికీ దక్కగల అవకాశం ఉండదు. ఆ క్రమంలో… ఆ ఆశతో వందల కోట్లరూపాయలు తగలేసిన వాళ్లకు క్రమంగా ఆ డబ్బును తిరిగి సంపాదించుకోవడం ఒక్కటే లక్ష్యం అవుతోంది.

అసలే తాము మీడియా ద్వారా ఎలాంటి వక్ర ప్రయోజనాలను ఆశించారో అవి నెరవేరడం లేదనే ఫ్రస్టేషన్‌, పైగా డబ్బు పోతోందే తప్ప.. రావడంలేదనే చింత.. ఈ రెండూ కలిసి దాదాపుగా ప్రతి మీడియా సంస్థనూ దారి తప్పిస్తున్నాయి. మీడియా ముసుగులో దందాలు చేయడమే చాలామందికి జీవనోపాధి అయిపోయింది. ''నియోజకవర్గాల్లో మనం నియమించే రిపోర్టర్లకు జీతం కూడా ఇవ్వాలా.. వాళ్లే సంపాదించుకుంటారు కదా… వాళ్లనే మనకు వాటాలు ఇవ్వమంటే సరి.. చానెల్‌ లాభాల్లో నడుస్తుంది'' అని ఆలోచించే ధూర్త శిఖామణులు కొన్ని న్యూస్‌ చానెళ్లకు అధిపతులు కావడం మన తెలుగుజాతి చేసుకున్న ఖర్మం.

ఆర్థిక కారణాలు బలమైనవి…

ఇంతకూ ఒక ఛానెల్‌ నడపాలంటే ఎంత ఖర్చు. ప్రాథమిక పెట్టుబడి ఎంత? నిర్వహణకు నెలవారీ ఖర్చు ఎంత? 
తతిమ్మా ఏ ఇతర వ్యాపారాల్లోనైనా ఉండే మాదిరిగానే ఇందులో కూడా రకరకాలుగా పెట్టుబడులు ఉంటాయి. కనీసం 200కోట్ల రూపాయల పెట్టుబడులతో ఛానెల్‌ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న వారు.. ఆ పిమ్మట ప్రతినెల కనీసం 80లక్షల నుంచి 2కోట్ల వరకు చానెల్‌ స్థాయిని బట్టి.. వేతనాలు, నిర్వహణ కర్చులకు పెడుతున్నారు. ఇందులో.. పెట్టుబడిని, నెలసరి ఖర్చులను తమ ఆదాయం రూపేణా.. నికరంగా రాబట్టుకోగలుగుతున్నది.. దాదాపు నాలుగైదు టీవీ ఛానెళ్లు మాత్రమే.

అంటే సుమారు పాతిక ఛానెళ్ల వరకు నష్టాల్లోనే నడుస్తున్నాయి. నష్టాల్లో ఉంటే.. వారు ఛానెల్‌ను ఎందుకు నడుపుతారు.. అనే సందేహం మనకురావచ్చు. కానీ.. విషయం ఏంటంటే.. అధికారికంగా రసీదుల రూపంలో వచ్చే ఆదాయం తక్కువే.. కానీ అనధికారికంగా దందాల రూపంలో దాదాపుగా ప్రతి ఛానెల్‌ కూడా.. సంపాదిస్తున్నాయి.

టీఆర్పీ మాయాజాలం

టీఆర్పీ అనేది ఒక పెద్ద మాయ. కానీ ఏ చానెల్‌కు ఎంత ఆదరణ ఉన్నదో.. చానెళ్లలో ఏ కార్యక్రమానికి ఎంత ఆదరణ ఉన్నదో తెలుసుకోవడానికి ప్రస్తుతానికి ఉన్న ఏకైక ప్రాతిపదిక అదే. కానీ దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. అది నికరమైనదని అనుకోవడానికి ఎలాంటి నమ్మకమూలేదు. అయినా సరే… మార్కెట్‌ మాయాజాలంలో చానెళ్లకు ప్రకటనలు సంపాదించడానికి అదొక్కటే ప్రచారం చేస్తుంటారు. కేవలం ఆ టీఆర్పీని సంపాదించడానికి టీవీ ఛానెళ్లు నానా గడ్డీ కరుస్తుంటాయి. 

ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజల సమస్యలు, ప్రభుత్వాలు ప్రజలకోసం చేస్తున్న పనులు, చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇలాంటి వాటి మీద టీవీ ఛానెళ్లు కథనాలు చేయడం మానేశాయి.

ఎవరైనా అక్రమ సంబంధం వ్యవహారం వెలుగుచూస్తే చాలు, రంకు భాగోతాలు బయటికొస్తే చాలు, క్రైం కథనాలు దొరికితే చాలు, నీతి నియమమూ, నిజమూ ఏదీ ఉండాల్సిన అవసరం లేదు. ఒక రంకు వ్యవహారం గురించి ఒకరు మాట్లాడితే చాలు.. గంటలు గంటలు ఆ ప్రసారాలు దాని మీద డిస్కషన్లు ఇదంతా నడిపించడం.. టీవీ ఛానెళ్లకు నిత్యకృత్యం అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. మార్కెట్‌ మభ్యపెట్టడానికే ఇదంతా జరుగుతుంటుంది.

ఇవాళ శ్రీరెడ్డి వ్యవహారం ఇంత హాట్‌ టాపిక్‌గా ప్రజల్లో చెలామణీ అవుతున్నా.. ఇది కేవలం తాజా ఉదాహరణ మాత్రమే. అంతేతప్ప… టీవీ ఛానెళ్లు ఎప్పుడూ దారితప్పే వ్యవహరిస్తున్నాయి. తాము దారితప్పడానికి అందమైన ముసుగులు వేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలు.. సెక్స్‌ స్కాండల్స్‌ను టీవీ ఛానెళ్లలో చూపించడంలో తాము అగ్రగామి ఛానెల్స్‌ అని పేరు తెచ్చుకోవడానికి తపించిపోతున్న మీడియా అధిపతులు కూడా ఉన్నారు.

అలాగే… అలాంటి ముద్రవస్తే.. సెక్స్‌ బాగోతాల వీడియోలు.. లీక్‌చేసే వారు ముందుగా తమకే తెచ్చిస్తారని ఒకఆశ. అలాంటి వీడియోలు తమకు దక్కితే.. అందులో సెలబ్రిటీలు గనుక ఉంటే.. వారి పంట పండినట్టే. ఆ వీడియోలను చూపించి… సదరు సెలబ్రిటీల దగ్గరినుంచి కోట్లకు కోట్లు పిండుకునే దందాలు కూడా నడుస్తున్నాయి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే..

ఇదివరకు పోలీసుల అక్రమ దందాలు ఈ తరహాలో ఉండేవి. పేకాట క్లబ్బులో, వ్యభిచార నిలయాల్లో, డ్రగ్స్‌ కేసుల్లో  ప్రముఖులు సెలబ్రిటీలు దొరికితే… వారికి పంట పండినట్టే. ఇప్పుడు మీడియా చానెళ్లు అదే పనిచేస్తున్నాయి. ఒక ప్రముఖుడు ఒక సెక్స్‌ స్కాండల్‌లో ఉన్నట్లు దొరికితే చాలు.. అక్కడితో పంటపండించుకుంటున్నారు.

ఉన్న ఛానెళ్లను వదిలేసి.. నిత్యమూ కొత్త చానెళ్లను పుట్టించడమూ.. ఆ తర్వాత వాటిని ముంచడమూ అలవాటుగా మార్చుకున్న ఒక టీవీ ఛానెల్‌ ప్రముఖుడు… శ్రీరెడ్డిని అడ్డుపెట్టుకుని 80 లక్షల రూపాయలు దందా చేశారని.. వీడియో క్లిప్పింగులతో బ్లాక్‌ మెయిల్‌ చేసి.. ఆ మొత్తాన్ని రాజమండ్రిలోని తన సంబంధికులకు అందేలా తెప్పించుకున్నారని మీడియా ప్రపంచంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

శోకించాల్సిన సంగతి ఏంటంటే.. ఈ దందా ఒక్క మీడియా వాడిది మాత్రమేకాదు. నాలుగైదు ఛానెళ్లు తప్ప.. అన్ని ఛానెళ్లదీ అదేబాట.

ఈ ప్రస్థానం ఎటు సాగుతోంది?
ఏ చీకట్లలో ఇది అంతరించబోతోంది?
తెలుగుజాతికి పట్టిన ఖర్మ నుంచి  ఎప్పటికి విముక్తి లభిస్తుంది? 
అన్నీ జాతికి ప్రశ్నలే…

– కపిలముని

[email protected]