‘అర్జున్‌ రెడ్డి’ కావాలంటున్న బాలీవుడ్‌ హీరో!

'అర్జున్‌ రెడ్డి' లాంటి సినిమా కావాలని అంటున్నాడు వరుణ్‌ ధావన్‌. దక్షిణాది సినిమాలంటే తనకు చాలా మమకారం అని, ఇక్కడి సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన వరుణ్‌ అర్జున్‌ రెడ్డి లాంటి సినిమా…

'అర్జున్‌ రెడ్డి' లాంటి సినిమా కావాలని అంటున్నాడు వరుణ్‌ ధావన్‌. దక్షిణాది సినిమాలంటే తనకు చాలా మమకారం అని, ఇక్కడి సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన వరుణ్‌ అర్జున్‌ రెడ్డి లాంటి సినిమా చేయాలని ఉందని అంటున్నాడు. ఈ విధంగా సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీతో తన అనుబంధం ఉందని చెబుతున్నాడు. తను ఇక్కడి సినిమాలను చూస్తానని.. రాజమౌళి, శంకర్‌లు తనకు ఇష్టమైన దర్శకులని వరుణ్‌ చెప్పుకొచ్చాడు. అలాగే రామ్‌చరణ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని కూడా ఈ హీరో వివరించాడు.

వరుణ్‌ ధావన్‌ ఇలా దక్షిణాది సినిమాలపై తన మమకారం చాటాడు. ఇటీవలే ఇతడు 'జుద్వా 2' సినిమాలో నటించాడు. అది తెలుగు సినిమా 'హలోబ్రదర్‌'కు రీమేక్‌. వెనుకటికి హలోబ్రదర్‌ను 'జుద్వా' పేరుతో రీమేక్‌ చేశాడు వరుణ్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌. దాన్నే మళ్లీ జుద్వా 2 అంటూ తీశారు. వెనుకటికి డేవిడ్‌ ధావన్‌ బోలెడన్ని సౌతిండియన్‌ సినిమాలను హిందీలో తీసిన దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌ హిట్‌ అయిన వివిధ సినిమాలను అతడు బాలీవుడ్‌లో రీమేక్‌ చేశాడు. ప్రత్యేకించి లైటర్‌ వెయిన్‌, హాస్యభరిత సినిమాలను తీయడంలో, రీమేక్‌ చేయడంలో డేవిడ్‌ ధావన్‌ది అందెవేసిన చెయ్యి.

'చిన్న మాపిళ్లై(కూలీ నంబర్‌ వన్‌)' 'సతీ లీలావతి'(బీవీ నంబర్‌ వన్‌)'ఆ ఒక్కటీ అడక్కు(మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఖిలాడీ)', సాజన్‌ చలే ససురాల్‌(అల్లరి మొగుడు), లోఫర్‌(అసెంబ్లీ రౌడీ), ఇలా బోలెడన్ని సినిమాలను సౌత్‌ నుండి తీసుకెళ్లి హిందీలో రీమేక్‌ చేశాడు డేవిడ్‌ ధావన్‌. ఇప్పుడు తనయుడు కూడా సౌతిండియా సినిమాలంటే తనకు చాలా ఇష్టమని అంటున్నాడు. మరి ఇతడు కూడా సౌతిండియన్‌ సినిమాలను హిందీలో రీమేక్‌ చేసే పరంపరను కొనసాగిస్తాడేమో చూడాలి.