పదేళ్లుగా జనసేనకు ప్రధాన అడ్డా హైదరాబాదే. కానీ ఏపీలో రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చడం చర్చనీయాంశమైంది. జనసేనాని ఏపీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకున్నారనేందుకు కార్యాలయ మార్పును ఆ పార్టీ నాయకులు ఉదహరిస్తున్నారు. పవన్‌కల్యాణ్ పార్టీ టైమ్ కాకుండా, ఫుల్ టైమ్ రాజకీయాలు చేయాలనేదే అందరి కోరిక.
ఈ నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చడాన్ని తప్పక అభినందించాలి. ఇకపై పవన్‌కల్యాణ్ మంగళగిరిలోనే వుంటారని, షూటింగ్‌లు వుంటేనే హైదరాబాద్ వెళ్తారని చెబుతున్నారు. సినిమాలపై చర్చించడానికి దర్శక నిర్మాతలు మంగళగిరికి వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా జనసేనకు సంబంధించి నాణేనికి ఒక వైపు. రెండో వైపు ప్రచారాన్ని కూడా తెలుసుకోవాలి.
జనసేనాని అసలు సిసలైన పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ అనేది ప్రత్యర్థుల ఆరోపణ. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే స్క్రిప్ట్‌లను పవన్ చదువుతున్నారనేది ప్రధాన విమర్శ. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప, పవన్ కల్యాణ్ ఏ పని చేయరనే విమర్శ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ టీడీపీ కార్యాలయం, చంద్రబాబుతో ఏ మాత్రం సంబంధం లేకుండా జనసేనతోనే సంసారం చేస్తే తప్ప ఆయనకు రాజకీయ భవిష్యత్ వుండదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి మంగళగిరికి జనసేన ప్రధాన కార్యాలయాన్ని మార్చడం వరకు బాగుందని, అయితే ఆయన మానసికంగా టీడీపీ నుంచి మకాం మారిస్తేనే జనం నమ్ముతారనే సెటైర్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
కేవలం పార్టీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తరలించినంత మాత్రాన రాజకీయంగా ఒరిగేదేమీ ఉండదని, టీడీపీతో సంబంధాలపైనే పవన్‌కల్యాణ్ భవిష్యత్ ఆధారపడి వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కావున చంద్రబాబు మనిషనే ముద్ర నుంచి పవన్ ఎంత త్వరగా బయటపడితే, అంత మంచి జరుగుతుందని పవన్‌కు తెలియదని అనుకోవాలా? చూద్దాం ఆయన పంథా మున్ముందు ఎలా వుంటుందో!