మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పులివెందుల పర్యటనపై టెన్షన్ నెలకుంది. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఇవాళ ఆయన వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గండికోట, చిత్రావతి ప్రాజెక్టుల సందర్శన ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం పులివెందులలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం పోలీసుల అనుమతి కోరింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పులివెందుల నడిబొడ్డున పూల అంగళ్ల వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తే, వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయ్యే పరిస్థితి వుంది. గతంలో 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తరపున పులివెందులలో ఎన్నికల ప్రచారానికి వెళ్లగా, ఆయనపై కోడిగుడ్ల దాడి జరిగింది.
గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని పులివెందులలో చంద్రబాబు పర్యటన రాజకీయ రచ్చకు దారి తీస్తుందనే ఆందోళనను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇంత వరకూ చంద్రబాబు పర్యటనకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లభించలేదు. అనుమతి నిరాకరించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పులివెందులలో చంద్రబాబును తిప్పాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు పులివెందులకు చెందిన ఆ పార్టీ నాయకులు పట్టుదలతో ఉన్నారు.
నువ్వా, నేనా అన్నట్టు రాజకీయంగా తలపడుతున్న వైసీపీ, టీడీపీ నేతలు… పులివెందులలో బాబు పర్యటనను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఒకవేళ బాబు పర్యటనకు అనుమతి ఇవ్వకపోతే …అధికార పార్టీ భయపడిందనే ప్రచారాన్ని చేసేందుకు టీడీపీ సిద్ధంగా వుంది.