జనసేనతో పొత్తు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజకీయ చావుకొచ్చింది. తెనాలి నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెనాలి టికెట్‌తో పాటు గెలుపు మనదే అని అన్నారు. ప్రత్యేకంగా టికెట్ మనదే అని పవన్ నొక్కి చెప్పడం వెనుక కారణాలపై చర్చ నడుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తెనాలిలో జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తాడని పవన్‌కల్యాణ్ సంకేతాలు పంపారు. అదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఆయన ఆశలపై పవన్‌కల్యాణ్ నీళ్లు చల్లారు. జనసేనలో కీలక నాయకుడైన నాదెండ్ల కోరుకుంటున్న సీటు కోసం పవన్ పట్టు పడతారు. ఒకవేళ కాదు, కూడదంటే… పొత్తు కుదరదు.
రాజకీయంగా తన అవసరం చంద్రబాబుకు ఎక్కువ వుండడంతో పవన్‌కల్యాణ్ మొహమాటం లేకుండా తనకు కావాల్సిన వారికి టికెట్లను తనకు తానే ప్రకటిస్తుండడం గమనార్హం. జనసేనతో పొత్తు వల్ల తమ సీట్లకు ఎసరు వస్తుందని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నాయకులు కలవరపడుతున్నారు. ఈ క్రమంలో తెనాలిలో ఆలపాటి సీటు కిందికి నీళ్లు వచ్చినట్టే. అయితే ఇవన్నీ పొత్తు కుదిరితే చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు.
ఇటీవల తెనాలి నుంచి తాను పోటీ చేస్తానని ఆలపాటి ప్రకటించారు. అయితే పవన్‌కల్యాణ్ తాజా కామెంట్స్‌తో ఆలపాటి రాజకీయ భవిష్యత్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఆలపాటికి నామినేటెడ్ పదవి తప్ప, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే భాగ్యం లభించకపోవచ్చని ఆయన అభిమానులు వాపోతున్నారు.
జనసేనతో పొత్తు వల్ల ఒక్క ఆలపాటికే కాదు, చాలా మంది సీనియర్ నాయకుల భవిష్యత్ అంధకారంలో పడనుంది. ఈ పరిణామాలు టీడీపీని మనశ్శాంతిగా ఉండనిస్తాయా? అనేది ప్రశ్న. కాలమే అన్నింటికి సమాధానాలు చెప్పాలి.