అర్జున్ రెడ్డి, రంగస్థలం, భరత్ అనే నేను, త్వరలో రాబోతున్న నా పేరు సూర్య. ఈ నాలుగు సినిమాలకు కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి విడుదలైన అర్జున్ రెడ్డి, రంగస్థలం, భరత్ అనే నేను మూడు సినిమాలు కూడా హీరోల ఫెర్ ఫార్మెన్స్ కు ప్రాధాన్యత వున్న సినిమాలు. అలాగే ఎమోషన్స్ కు ఎక్కువ చాన్స్ వున్న చిత్రాలు. అన్నింటికి మించి దాదాపు మూడు గంటల నిడివి వున్న సినిమాలు.
ఒకప్పుడు మన దగ్గర మూడు గంటల సినిమాలు వుండేవి.18 నుంచి 20రీళ్ల సినిమాలు. ఆ తరువాత తరువాత 16రీళ్లకు ఫిక్సయిపోయాయి. రెండు గంటల 15నిమషాలు అన్నది చాలా కాలం నడిచింది. ఆ తరువాత తరువాత రెండుగంటల సినిమాలు వచ్చాయి. రెండు గంటలకు కాస్త దాటితేనే అమ్మో అనే పరిస్థితి వచ్చింది.
అలాంటి టైమ్ లో అర్జున్ రెడ్డి లాంటి చిన్న సినిమా, ఆఫ్ బీట్ సినిమా మూడు గంటల నిడివితో వచ్చింది. ఎంత ధైర్యం అనుకున్నారంతా. కానీ కదలకుండా చూసేసారు. ఆ తరువాత సుకుమార్ తన స్టయిల్ లో ఎప్పటిలా రంగస్థలం సినిమాను మూడుగంటల మేరకు తీసారు. జనం కళ్లార్పకుండా చూసేసారు. సినిమా విడుదలకు ముందు మాత్రం అంత సినిమానా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆ అనుమానాలు అన్నీ పటాపంచలైపోయాయి.
లేటెస్ట్ గా భరత్ అనే నేను విడుదలయింది. అది కూడా దాదాపు మూడు గంటల సినిమా. పైగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్. అయినా జనం సూపర్ అంటున్నారు.
అర్జున్ రెడ్డి, రంగస్థలం, భరత్ అనే నేను మూడింటిలోనూ హీరోలకు మంచి పేరు వచ్చింది. అద్భుతమైన ఫెర్మార్మెన్స్ చేసారని.
కట్ చేస్తే,
త్వరలో నా పేరు సూర్య రాబోతోంది. అది కూడా దాదాపు మూడు గంటల సినిమానే. ఓ సైనికుడి ఎమోషన్ జర్నీ. బన్నీకి నటుడిగా మాంచి పేరు వస్తుందని ఇప్పటికే బజ్ వుంది. మరి ఈ సినిమా కూడా జనాల ఆదరణకు నోచుకుంటే, హీరోలు, డైరక్టర్లు మంచి కథలు, మంచి ఎమోషన్లు, పెర్ ఫార్మెన్స్ కు చాన్స్ వున్న సినిమాల కేసి దృష్టి సారిస్తారు.