పవన్ కళ్యాణ్-మీడియా చానెళ్ల వివాదం నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులంతా ఈరోజు అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో సమావేశం అయ్యారు. అది వాస్తవం. కానీ సాయంత్రానికి ఓ ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. ఏమని, మా అసోసియేషన్ ఆంధ్రలో హోదా పోరుకు మద్దతు ఇస్తోందని. అంతే. మరే విషయం లేదు. మరి కేవలం మా అసోసియేషన్ ఇందుకోసమే సమావేశం అయితే, నిర్మాతలు, దర్శకులు, రచయితలు ఇలా అందరూ ఎందుకు ఎగేసుకుని, సమావేశానికి వచ్చినట్లు? వాళ్లకు మా కు ఏమి సంబందం? అసలు ఏం జరిగింది? అంటే..
వాస్తవానికి చానెళ్లు, ఇండస్ట్రీ పట్ల వాటి తీరును డిస్కస్ చేయడానికే ఇండస్ట్రీ జనాలు చాలా మంది సమావేశం అయింది. అయితే ఆ విషయాలు మాత్రం బయటకు చెప్పలేదు. ఈ సమావేశంలో ఆఖరికి తేల్చింది ఏమిటంటే, 25మందితో ఓ కమిటీ వేయడం అన్నది. అన్ని విభాగాలు కలిపి 25మందితో ఓ కమిటీ వేసారు.
ఆ కమిటీ సమూలంగా చర్చించి, చానెళ్లు, వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, వీటితో ఇండస్ట్రీకి వున్న ప్లస్ లు, మైనస్ లు, ఏం చేయాలి? అన్న దానిపై ఓ నివేదిక ఇస్తుంది. అంతే కానీ నిర్ణయం తీసుకోదు. ఆ కమిటీ నివేదిక మేరకు మళ్లీ ఇండస్ట్రీ పెద్దలు సమావేశమై, ఏం చేయాలో ఆలోచిస్తారు.
అయితే కమిటీ నిర్ణయం తీసుకోవడానికి ముందు కాస్త గట్టిగానే డిస్కషన్లు సాగినట్లు వినికిడి. ముఖ్యంగా సుప్రియ (నాగ్ మేనకోడలు), నందినీ రెడ్డి మరి ఒకరిద్దరు టివీ 5లో ఏంకర్ ఇండస్ట్రీలో లం..లు లేరా అని చేసిన కామెంట్ పై గట్టిగా మాట్లడినట్లు తెలిసింది. ఇండస్ట్రీలోని మహిళలను కించపరిచేలా అలా మాట్లాడినపుడు ఎవరూ గట్టిగా స్పందించలేదని, పిలచినా పెద్దగా ఎవ్వరూ రాలేదని, ఇప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారనే అర్థం వచ్చేలా వారు మాట్లాడారని తెలుస్తోంది.
అలాగే కొందరు నిర్మాతలు సినిమా విడుదలకు ముందు మీడియా నుంచి సమస్యలు వస్తున్నాయని, ప్రకటనలు, ఇతరత్రా ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఎవరికి ఏమి ఇవ్వకున్నా బ్లాక్ మెయిల్ తరహా సమస్యలు వస్తున్నాయని సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు ఈ తరహా ఖర్చులను దర్శకులు కూడా ఎంకరేజ్ చేన్తున్నారన్న రీతిలో మాట్లాడారని వినికిడి. దానికి తమ వైపు నుంచి అలాంటి వత్తిడి రాదని దర్శకుల సంఘం నుంచి సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్, టీవీ చానెళ్ల ఉదంతంలో ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోమని చెప్పడం లేదని అల్లు అరవింద్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
జెమిని కిరణ్ మాత్రం, కొన్ని చానెళ్లను బహిష్కరించడం, కొన్ని ఉంచడం సరికాదని, దాని వల్ల అదనపు తలకాయనొప్పులు వస్తాయని, అందువల్ల న్యూస్ చానెళ్లను ఇండస్ట్రీ టోటల్ గా వదిలేస్తే బెటర్ అనే అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇలా పలువురు, పలు రకాలుగా మాట్లాడడంతో ఆఖరికి కమిటీ వేసి వదిలేసారు. అదీ విషయం.