ఏంటిది పవన్, చిన్నపిల్లాడిలా?

నాయకుడు అంటే నాయకుడిలా వుండాలి. అంతే కానీ చౌకబారుగా వుండకూడదు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు కాస్త నిదానంగా, వెల్ ప్లాన్డ్ అన్నట్లుగా కనిపించారు. అలాంటిది నిన్నటి నుంచి ఆయన చేస్తున్న…

నాయకుడు అంటే నాయకుడిలా వుండాలి. అంతే కానీ చౌకబారుగా వుండకూడదు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు కాస్త నిదానంగా, వెల్ ప్లాన్డ్ అన్నట్లుగా కనిపించారు. అలాంటిది నిన్నటి నుంచి ఆయన చేస్తున్న ట్వీట్లు వగైరా చూస్తుంటే. నాయకుడు అన్నవాడికి ఓ హుందాతనం వుండాలి. మాట్లాడే మాటకు ఓ పద్దతి వుండాలి. విలువ వుండాలి. రాజకీయాల్లో మాటలు దాటేయడం, కాస్త అబద్దాలు జోడించడం, ఆరోపణలు ఇవన్నీ మామూలే. అయినా అవి కూడా ఓ పద్దతిగా, నిండుగా వుండాలి కానీ చౌకబారుగా వుండకూడదు.

చంద్రబాబునాయుడు అధికారంలో వున్నారు. ఆయన సంగతి వదిలేద్దాం. జగన్ ప్రతిపక్షంలో వున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఆయన మద్దతు పార్టీ యేదీ అధికారంలో లేదు. కేసులు వున్నాయి. జైలుకు వెళ్లి వచ్చారు. అయినా పోరాడుతున్నారు. కానీ ఏనాడూ ట్విట్టర్ లో చౌకబారు ఆరోపణలు చేయలేదు. ఆఖరికి ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడినా, ‘మీకూ మాకూ నప్పదు’ అని ఎబిఎన్ రిపోర్టర్లను అన్నారు తప్ప మరో మాట అనలేదు. మనకు వాళ్లతో నప్పదు, మన కార్యక్రమాలకు వాళ్లను పిలవవద్దు అనేసి ఊరుకున్నారంతే. అంతే తప్ప, కుట్రలు, కుతంత్రాలు వగైరా పదాలు ఏనాడూ వాడలేదు.

అంబటి రాంబాబు, రోజా ఏమైనా మాట్లాడవచ్చు లేదా తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి నాయకులు ఎలాగైనా మాట్లాడ వచ్చు. కానీ జగన్, చంద్రబాబు లాంటి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. అలాగే పవన్ కూడా. తన మీద కుట్ర జరుగుతోంది అనొచ్చు. అంతే కానీ, శ్రీని రాజు లాంటి వాళ్ల ఫోటోలు పెట్టడం, తెల్లవారి బట్టలు విప్పి మాట్లాడుకుందాం, సినిమాటిక్ వాక్యాలు. ఇవన్నీ ఫ్యాన్స్ కు ఇంపుగా వుంటాయేమో కానీ, ఓ నాయకుడి స్థాయికి మాత్రం కాదు.

మీకు తిట్టాలని వున్నా, ఏదైనా చెప్పాలని వున్నా నేరుగా ప్రెస్ మీట్ పెట్టి దులిపేయవచ్చు. లేదా స్టేట్ మెంట్ ఇచ్చేయచ్చు. ట్విట్టర్ ను ఇలా వాడడం అంటే పవన్ కు గత కొంతకాలం ఆయన మీద యుద్ధం చేస్తున్న కత్తి మహేష్ కు ఏం తేడా వుంటుంది? ఇండస్ట్రీ మీద శ్రీరెడ్డి చేస్తున్న ట్వీట్ల, ఫేస్ బుక్ పోరాటానికి, దీనికి తేడా ఏముంటుంది? పవన్ కరెక్ట్ అయితే వాళ్లు కూడా కరెక్టే. అప్పుడు పవన్ అభిమానులు వాళ్లను ఏమీ అనడానికి లేదు.

ఏమైనా జనసేన పార్టీ అధిపతిగా పవన్ ట్విట్టర్ ను హ్యాండిల్ చేసే తీరు అయితే ఇది కాదు. గుంటూరు శేషేంద్ర, శ్రీశ్రీ, తిలక్ లను కోట్ చేస్తూ పవన్ చేసిన ప్రసంగాలు ఎక్కడ? ఇప్పుడు ఈ ట్వీట్ లు ఎక్కడ? అప్పుడు త్రివిక్రమ్ పక్కన వున్నందున? ఇప్పుడు లేనందున? వచ్చిన తేడా అనుకోవాలా? ఏమో?