పవన్ ఆప్షన్ ఇవ్వడు.. చంద్రబాబుకు గతి లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరూ ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. జగన్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అందుకోసం భారతీయ జనతా పార్టీని…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరూ ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. జగన్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అందుకోసం భారతీయ జనతా పార్టీని కూడా తెలుగుదేశం జట్టులోకి తీసుకు వస్తానని ఆయన ఇండైరెక్టుగా సంకేతాలు పంపారు. 

అయితే పొత్తులు అనేవి ప్రధానంగా జనసేన లేదా పవన్ కళ్యాణ్ కు అవసరమా లేదా చంద్రబాబు నాయుడుకు ఎక్కువ అవసరమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే సంగతి ఇరువురిలో ఏ ఒక్కరూ స్పష్టంగా, అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ మాత్రం తమ పార్టీకి దక్కే సీట్లను ఖరారు చేసుకుంటున్నారు! 

ఫలానా ఫలానా సీట్ల నుంచి పోటీ చేసేది మనమే.. విజయం కూడా మనదే.. అని ఆయన తగేసి చెబుతున్నారు. పొత్తుల్లో సీట్లను పార్టీల మధ్య పంచుకునే సమయంలో, ఎవరి బలం ఏ నియోజకవర్గంలో ఎంతెంత ఉన్నదో బేరీజు వేసుకుని వారికి రెండో పార్టీ సహకరించడం అనేది మంచి పద్ధతి. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి మంచి పద్ధతికి చెల్లు చీటీ ఇచ్చేస్తున్నారు.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సారధి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు. ఈ నియోజకవర్గంలో సీటు దక్కేది తమకే విజయం సాధించేది తామే అని ఆయన ప్రకటించారు. 

నిజానికి ఇది తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇక్కడి నుంచి తెలుగుదేశం తరఫున గతంలో ప్రాతినిధ్యం వహించారు. 2014లో జనసేన పొత్తులతో తెలుగుదేశం విజయం సాధించినప్పుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఏకంగా 93 వేల ఓట్లు వచ్చాయి. అదే 2019 ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశానికి వచ్చిన ఓట్లు 76వేలు. అదే సమయంలో జనసేన తరఫున బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్ సాధించిన ఓట్లు 30 వేలు మాత్రమే. అంటే స్పష్టంగా ఇది తెలుగుదేశం నియోజకవర్గం అని అర్థమవుతుంది. కానీ నాదెండ్ల మనోహర్ కోసం జనసేన ఈ నియోజకవర్గ కోసం పట్టుపడుతోంది. కాదు, తమదే అని ప్రకటించేసుకుంటోంది.

పవన్ కళ్యాణ్ తెనాలి గురించి చంద్రబాబు నాయుడుతో చెప్పారో లేదో గానీ ఈ సీటు మాదే అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఇది పొత్తు ధర్మానికి విరుద్ధం అవుతుంది. చూడబోతే సీట్ల ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడుకు అసలు ఆప్షన్ ఇచ్చేలాగా పవన్ కనిపించడం లేదు. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడుకు వేరే గతి లేదా? పవన్ ఏ సీట్లు కావాలంటే అవన్నీ ఆయనకు సమర్పించుకుని ఆయన వదిలిపెట్టిన సీట్లలో మాత్రమే తెలుగుదేశం పోటీ చేయాల్సిందేనా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి.

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబు మీద ఆగ్రహంతో ఉన్నారు. పొత్తులు లేకపోయినా తమ పార్టీ గెలిచే స్థితిలో ఉన్నదని, అనవసరంగా పవన్ కళ్యాణ్ ను దేబిరించి తాము గెలిచే సీట్లను కూడా వారికి కట్టబెట్టడం మంచి పద్ధతి కాదని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి నియోజకవర్గం- ఆ రూపంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు కలిసి తెలుగుదేశంలో ముసలం పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.