ఇది రాజకీయ వలసల కాలం. రాజకీయాలంటే అంటీముట్టనట్టుగా ఉన్న వాళ్లంతా ఎన్నికల వేళ నిర్లక్ష్యాన్ని వీడుతున్నారు. ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో వైఎస్సార్ ప్రోత్సాహంతో కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ హీరోయిన్ జయసుధ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ అయ్యారు. గత కొంత కాలంగా మౌనంగా వుంటూ వచ్చిన ఆమె, అకస్మాత్తుగా బీజేపీలో చేరేందుకు రెడీ కావడం చర్చనీయాంశమైంది.
తెలంగాణలో మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జయసుధ కాషాయ కండువా కప్పుకునేందుకు బీజేపీ నేతలతో చర్చించారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ఆమె ఢిల్లీ వెళ్లడం విశేషం.
కాంగ్రెస్ తరపున 2009లో సికింద్రాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహించారామె. ఇప్పుడు బీజేపీ నుంచి సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్‌ను ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి నాయకుల అవసరం ఎంతో వుంది. ఇటీవల కాలంలో బీజేపీ బలహీనపడుతోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అనుకూల విధానాలను కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనుసరించడమే. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే విమర్శ బలంగా వుంది. దీంతో కాంగ్రెస్ బలపడుతోంది. కాంగ్రెస్‌లో చేరికలు పెరుగుతున్న పరిస్థితిలో బీజేపీలో జయసుధ ప్రస్థానం చర్చనీయాంశమైంది.