ఈ మధ్య కాలంలో ఓ పాట గురించి ఫ్యాన్స్ ఇంతలా ఎదురు చూడడం ఇదేనేమో? మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ సినిమాలో పాటలు బాగుంటాయి. అలాగే మహేష్ సినిమా అంటే ఫ్యాన్స్ మామూలు ఆత్రంగా వుండరు. అందువల్లే కావచ్చు. ఆ సినిమాలో పాట కోసం ఆగస్టు నుంచి ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు మేకర్లు. నవంబర్ ఫస్ట్ వీక్ అన్నారు. అది కూడా ఏమీ కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యలో ఓ అడియో క్లిప్ లీక్ అయింది. సోషల్ మీడియాలో యధేచ్ఛగా తిరిగేస్తోంది.
‘ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..’ అంటూ ప్రారంభమైన ఈ బిట్ లో బిరియానీ, అరకోడి..మసాలా లాంటి మాస్ పదాలు చోటు చేసుకున్నాయి. పాటలో ప్రారంభంలో వచ్చే చిన్న బిట్ కాబట్టి, అది కూడా జస్ట్ ట్రాక్ అయి వుంటుంది కాబట్టి థమన్ ఎలా చేసారు అనేది జడ్జ్ చేయలేము. గతంలో త్రివిక్రమ్ నుంచి వచ్చిన అ..ఆ సినిమాలో పాట సౌండింగ్, అలాగే ‘ధూమ్మచారే..ధూమ్మచారే’ అనే బిట్ సౌండింగ్ అనిపిస్తాయి. దాని తరువాత వచ్చే ఇనుస్ట్రుమెంటేషన్ కూడా గతంలో థమన్ పాటల్లో విన్నదే.
అయితే యూనిట్ వర్గాలు ఇది చాలా రఫ్ అని, పాతది అని, సినిమాలో వుండేదానికి దీనికి వెయ్యింతలు తేడా వుంటుందని, టోటల్ గా డిఫరెంట్ క్వాలిటీతో వుంటుందని అంటున్నారు. ఇది చాలా రోజుల కిందటే లీక్ అయిందని, సెట్ లో నగారాలో ప్లే చేసినపుడు ఎవరో ఫోన్ లో రికార్డు చేసి వుండొచ్చని అనుమానం వ్యక్తం చేసాయి. అది జస్ట్ ఎలా వుందో ఒపీనియన్ తెలుసుకోవడానికి చేసిన ట్రాక్ బిట్ తప్ప వేరు కాదన్నారు.
ఏమైనా గుంటూరు కారం యూనిట్ త్వరగా ఏదో ఒకట అడియో సాంగ్ వదిలితే తప్ప ఫ్యాన్స్ సంతృప్తి చెందరు.