ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. దీపావళి కానుకగా జైలర్ సినిమా టీవీల్లోకి రాబోతోంది. తెలుగులో ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. కాబట్టి అదే సక్సెస్ బుల్లితెరపై కూడా కొనసాగుతుందని, టీఆర్పీల్లో జైలర్ సినిమా రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.
రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్. తెలుగులో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమాను దీపావళి కానుకగా టెలికాస్ట్ చేస్తోంది జెమినీ టీవీ. ఆల్రెడీ ప్రమోషన్ కూడా మొదలుపెట్టింది. థియేటర్లలో హిట్టయిన ఈ సినిమా టీవీల్లో కూడా మంచి రేటింగ్ తెచ్చిపెడుతుందని ఆశ పడుతోంది.
కానీ టీఆర్పీలు భారీగా వచ్చే రోజులు పోయాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతోనే టీఆర్పీల హవా ముగిసింది. మరో సినిమాకు ఆ స్థాయిలో 20, 23 టీఆర్పీలు వచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడంతా ఓటీటీ యుగం నడుస్తోంది. పల్లెలకు కూడా ఓటీటీ పాకిన నేపథ్యంలో, సూపర్ హిట్ సినిమాను టీవీల్లో చూసేందుకు ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, తాజాగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా. థియేటర్లలో ఈ సినిమా పెద్ద హిట్టయింది. మొన్న టీవీల్లో వేస్తే మాత్రం అరకొరగా రేటింగ్ వచ్చింది. పైగా అదే జెమినీ టీవీలో. చిరంజీవి-రవితేజ కలిసి నటించిన ఈ సినిమా రేటింగ్స్ విషయంలో పూర్తిగా నిరాశపరిచింది.
కేవలం వాల్తేరు వీరయ్య మాత్రమే కాదు.. చాలా హిట్ సినిమాలకు రేటింగ్స్ ఇప్పుడు పెద్దగా రావడం లేదు. జనాల్ని బీభత్సంగా కదిలించిన బలగం లాంటి సినిమాకే 10 టీఆర్పీ వచ్చిందంటే, బుల్లితెర వీక్షకుల సంఖ్య ఏ స్థాయిలో తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆర్ఆర్ఆర్ కూడా పైన చెప్పిన 2 సినిమాల స్థాయిని అందుకోలేకపోయింది.
సో.. జైలర్ సినిమా టీఆర్పీల్లో రికార్డులు సృష్టిస్తుందనే వాదన కేవలం హైప్ మాత్రమే. పైగా వయొలెన్స్ కాస్త ఎక్కువగా ఉన్న ఈ సినిమాను టీవీ వీక్షకులు ఆదరిస్తారా..?