“తరాలు మారినా కొన్ని ఎప్పటికీ మారవు, అలానే ఉంటాయి. మన జీవితాల్లో భాగం అయిపోతాయి.” స్నేహం, ప్రేమ లాంటి పదాలు చెప్పడానికే ఇన్నాళ్లూ ఈ వాక్యం ఉపయోగించారు. కానీ వీటితో పాటు లంచానికి కూడా ఈ వాక్యాన్ని ఉపయోగించుకోవచ్చు. దేశం ఎంతో మారింది, ఎన్నో తరాలు మారాయి, నేతలూ మారారు. కానీ లంచం మాత్రం అప్పటికీ ఇప్పటికీ అంతే ఫ్రెష్ గా ఉంది. భారతీయుడు-2 సినిమాలో ఇదే చూపించారు.
లంచం.. భారతదేశంలో ఎవర్ గ్రీన్ ఐటెం. అప్పుడెప్పుడో 27 ఏళ్ల కిందట ఈ అంశం మీద భారతీయుడు అనే సినిమా తీశాడు శంకర్. అప్పుడు ఆ సినిమా కాన్సెప్ట్-కథ ఎంత కొత్తగా ఉందో.. ఇప్పుడు భారతీయుడు-2లో అదే కాన్సెప్ట్ ను రిపీట్ చేసినప్పుడు కూడా అంతే కొత్తగా ఉంది. భారతీయుడు సినిమాను ఎక్కడ ముగించాడో, సరిగ్గా అక్కడ్నుంచే పార్ట్-2ను ప్రారంభించాడు దర్శకుడు శంకర్.
భారతీయుడులో లంచంలోని ఓ పార్శ్వాన్ని మాత్రమే టచ్ చేసిన శంకర్, భారతీయుడు-2లో మాత్రం లంచంలో ఉన్న అన్ని కోణాల్ని కవర్ చేసినట్టు కనిపిస్తోంది. ఈరోజు రిలీజైన ఇంట్రో గ్లింప్స్ చూస్తే అలానే అనిపించింది.
దేశంలో లంచాలు పెరిగిపోయి, భారతీయుడు మళ్లీ ఇండియాకు రావాలంటూ రిక్వెస్టులు ఎక్కువవుతాయి. హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతాయి. సరిగ్గా అప్పుడే ఇండియాలో అడుగుపెడతాడు వీరశేఖరన్ సేనాపతి అలియాస్ ఇండియన్. భారతీయుడు అడుగుపెట్టడంతో ఇండియాలో లంచాలు తీసుకునేవారు తగ్గిపోతారు. ఆ వెంటనే మళ్లీ లంచాలు మొదలుపెడతారు, దీనికి కారణం ఏంటి.. సేనాపతి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపించాడనేది భారతీయుడు-2.
సేనాపతిగా కమల్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఇంట్రో గ్లింప్స్ ను కేవలం కమల్ హాసన్ కు మాత్రమే పరిమితం చేయలేదు దర్శకుడు. సినిమాలో కీలక పాత్రలు పోషించిన సిద్దార్థ్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్ జే సూర్య పాత్రలన్నింటినీ పరిచయం చేశాడు. గ్లింప్స్ లో శంకర్ మార్క్ స్పష్టంగా కనిపించింది.
అయితే గ్లింప్స్ లో 2 కీలకమైన అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. సినిమా రిలీజ్ డేట్ చెప్పలేదు. ఇక ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై కూడా గ్లింప్స్ లో స్పష్టత ఇవ్వలేదు.