Advertisement

Advertisement


Home > Movies - Reviews

Maa Oori Polimar 2 Review: మూవీ రివ్యూ: మా ఊరి పొలిమేర 2

Maa Oori Polimar 2 Review: మూవీ రివ్యూ: మా ఊరి పొలిమేర 2

చిత్రం: మా ఊరి పొలిమేర 2
రేటింగ్: 2.5/5
తారాగణం:
సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందుమౌళి, గెటప్ శీను, సాహితి దాసరి తదితరులు 
కెమెరా: కుషేందర్ రమేష్ రెడ్డి 
సంగీతం: జ్ఞాని 
నిర్మాత: గౌరీ కృష్ణ
దర్శకత్వం: అనిల్ విశ్వనాథ్
విడుదల: 3 నవంబర్ 2023

ఆమధ్యన ఓటీటీలో వచ్చి ప్రశంసలందుకున్న చిత్రం "మా ఊరి పొలిమేర". క్రైం-సస్పెన్స్-సూపరిస్టిషన్ నేపథ్యంలో నడిచే ఆ కథకి కొనసాగింపే ఈ "మా ఊరి పొలిమేర2". 

కొమురయ్య (సత్య రాజేష్) ఒక ఊరిలో ఆటో డ్రైవర్. చేతబడులు చేయిస్తున్నాడని అతనిని అనుమానంతో కొందరు చంపేసారని అంతా అనుకుంటారు. కానీ అతను చావడు. కుటుంబాన్ని వదిలి దూరంగా కేరళలో కొమిరి పేరుతో జీవిస్తుంటాడు. 

అతని లక్ష్యమేంటి? చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి విద్యలకి అతని జీవితానికి ఏమిటి సంబంధం?

ఇదిలా ఉంటే కొమురయ్యకి కవిత అనే అమ్మాయితో గతంలో లింకుంటుంది. అదేమిటి?

అలాగే కొమురయ్య పక్కింట్లో బలిజ (గెటప్ శీను), అతని భార్య (సాహితి) నివసిస్తుంటారు. వాళ్లెవరు?

తన అన్నయ్య మిస్సింగ్ కేసుని ఛేదించడానికి రంగంలోకి దిగిన కొమురయ్య తమ్ముడు జంగయ్య (బాలాదిత్య) ఏమౌతాడు?

ఊళ్లోకి కొత్త ఎస్సైగా వచ్చిన రవీంద్ర నాయక్ (రాకేందుమౌళి) తన నేర పరిశోధనలో ఎటువంటి విస్తుపోయే నిజాలు తెలుసుకుంటాడు? ఇదే కథంతా. చివరికి ఎవరి చేతుల్లో ఎవరు చస్తారు. కథకి కామా పడుతుందా, ఫుల్ స్టాపా అనేది క్లైమాక్స్. 

సాధారణ పాత్రల్లా పరిచయమయ్యే ప్రతి పాత్రకి ఒక బ్యాక్ స్టోరీ, ఒక భావోద్వేగం, ఒక లక్ష్యం ఉంటాయిందులో. కథలో ప్రతి పాత్రకి అలా డెప్త్ ఉన్నప్పుడే నాటకీయత బలంగా ఉండడానికి స్కోపుంటుంది. ఎంచుకున్న నేపథ్యం చేతబడులు వగైరాలన్నప్పుడు సహజంగా ఈ మధ్యన వచ్చిన "విరూపాక్ష" వంటివి గుర్తొస్తాయి. కానీ ప్రధాన కథ పూర్తి భిన్నంగా ఉండడంతో అలాంటి సినిమానే ఇంకోటి చూస్తున్నామనే భావన కలుగదు. 

సైంటిఫిక్ గా చేతబడులనేవి లేవని ఇప్పుడు దాదాపు సమాజమంతా నమ్ముతోంది. జనవిజ్ఞానవేదికల నుంచి, సోషల్ మీడియా వరకు దీనిపై ఎప్పటికప్పుడు జనానికి అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న అక్షరాశ్యత కూడా కనువిప్పు కలిగిస్తోంది. 

అయితే ఇప్పటికీ అడపా దడపా చేతబడి పేరుతో ఎక్కడో ఏదో జరిగిందన్న వార్తలు వింటూనే ఉన్నాం. దానికి కారణం నిరక్షరాశ్యత, ఆశ, నిర్దయ, మూర్ఖత్వం అని ఈ సినిమా చెప్పదలచుకుంది. అయితే ఆ క్రమంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చూస్తే నిజంగానే ఈ క్షుద్రపూజల్లో ఎంతో కొంత నిజముందేమో అనే అనుమానాలొస్తాయి. 

ఉదాహరణకి నాగబంధనానికి సంబంధించిన ఒక ప్రక్రియని ఈ చిత్రంలో చూపించినప్పుడు పాములన్నీ పాక్కుంటూ వచ్చేయడం వంటివి అన్-సైంటిఫిక్ గా అనిపిస్తూ అసలీ చిత్రం చేతబడులు ఉన్నాయని చెబుతోందా, లేవని వక్కాణిస్తోందా అనే సందిగ్ధంలో సగటు ప్రేక్షకుడు ఉండే అవకాశముంది. 

అందుకే కథలో లాజిక్కుల్లోకి వెళ్లి చిక్కుకోకుండా కథనం, ఎమోషన్, ట్విస్టులు, ముగింపు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. వాటి గురించి అడిగితే అక్కడక్కడ కొన్ని ఎత్తుపల్లాలున్నా దాదాపు అన్నీ బాగున్నాయనే చెప్పొచ్చు. 

లో బడ్జెట్టులో స్టార్ వేల్యూ లేని నటీనటులతో తీసినా కూడా ఎవరి స్థాయిలో వాళ్లు పక్కాగా నటించడం, కథనంలో గ్రిప్, సాంకేతికతలో రాజీలేని తనం..మొదలైనవాటి వల్ల ఎక్కడా కూడా బోర్ కొట్టదు.

సత్యం రాజేష్ తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. డబుల్ షేడ్ ఉన్న పాత్రలో సింకయ్యాడు.

రాకేందుమౌళిలో మంచి ఈజ్ ఉంది. అయితే ఎస్సై పాత్రకి  కొంచెం లేతగా ఉన్నాడు. కనీసం ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టినా ఈ పాత్రలో మరింత బాగా సూటయ్యేవాడు.

గెటప్ శీను పాత్ర పర్వాలేదు. అతని భార్యగా కనిపించిన నటి కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తుంది.

కామాక్షి ప్రధాన స్త్రీపాత్రలో ఒదిగిపోయింది. 

కవిత పాత్రధారి రమ్య పొందూరి చూడడానికి మంచి ఫొటోజెనిక్ గా ఉంది.

కొమురయ్యకి పెదనాన్నగా కనిపించిన నటుడు కూడా పాత్రకి సరిపోయాడు. 

పాటల పరంగా చూస్తే "ఏ కొండ సాటునో జాబిల్లి కూలిపాయనే..." ఒక తత్వంలాగ మంచి సాహిత్య విలువలు కలిగి ఉంది.  ఇతర సాంకేతిక విలువలు ఓకే. 

"మంచి" అనే భ్రమలో చేస్తున్న "చెడు"పై చివరికి ఒక పాత్ర సర్ప్రైజింగ్ గా తిరుగుబాటు చేస్తుంది. అప్పటివరకు డొసైల్ గా ఉన్న పాత్ర రిబెలవుతుంది. అదే క్లైమాక్స్ ట్విస్ట్. ఓవరాల్ గా ప్రధామార్ధం కంటే ద్వితీయార్ధం బాగుంది. 

అంతే కాదు, "పుష్ప" లో చివర్లో కనిపించే ఫహద్ ఫాజిల్ లాగ, అంతకంటే తక్కువ నిడివిలో కనిపించిన నటుడు పృథ్వి ఒక పాత్రను చంపడంతో ఎంటరవుతాడు. "మా ఊరి పొలిమేర-3" కూడా ప్రకటించడం జరిగింది. 

మొత్తానికి ఈ పొలిమేర ఫ్రాంచైజ్ ని ఇప్పట్లో వదిలేలా లేరు దర్శకనిర్మాతలు. అయితే ఇక్కడ చాలెంజ్ ఏమిటంటే ఒక భాగానికంటే మరొక భాగం చాలా బలంగా ఉండాలి. అప్పుడే ఏ ఫ్రాంచైజ్ కైనా మనుగడ, కొనసాగింపు ఉంటాయి. ఎప్పుడైతే మునుపటి భాగానికంటే తక్కువ స్థాయిలో అనిపిస్తుందో అక్కడే ఫుల్-స్టాప్ పెట్టేయాల్సి వస్తుంది. ఆ జాగ్రత్త వహిస్తూ తదుపరి భాగంతో వస్తారని ఆశిద్దాం. 

ప్రస్తుతానికి ఈ సినిమా క్రైం-సస్పెన్స్ ని ఇష్టపడే వాళ్లు చూడొచ్చు. ఎటువంటి అంచనాలూ లేకుండా చూస్తే బాగానే ఉందనిపించొచ్చు. ఇందులో హారర్ పాళ్లు పెద్దేమీ లేవు. ఈ చిత్రం అర్ధం కావడానికి "మా ఊరి పొలిమేర" చూసినా, చూడకపోయినా పర్లేదు. 

బాటం లైన్: ఆగని సీక్వెల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?