Advertisement

Advertisement


Home > Movies - Reviews

Keedaa Cola Review: మూవీ రివ్యూ: కీడా కోలా

Keedaa Cola Review: మూవీ రివ్యూ: కీడా కోలా

చిత్రం: కీడా కోలా
రేటింగ్: 2.5/5
నటీనటులు:
చైతన్య మదాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్. జీవన్ కుమార్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురాం
కెమెరా: ఎ.జె.ఆరన్
సంగీతం: వివేక్ సాగర్
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
విడుదల తేదీ: 3 నవంబర్ 2023

ఈ మధ్యన మంచి పబ్లిసిటీ జరుపుకుని, యువ ప్రేక్షకుల దృష్టిని అకర్షించిన చిత్రమిది. ట్రైలర్, తరుణ్ భాస్కర్ చేసిన ప్రచారం దీనిపై ఆసక్తి పెంచాయి. పెద్ద హీరోల సినిమాల పోటీ లేని తరుణంలో తరుణ్ భాస్కర్ ఈ చిత్రంతో మన ముందుకు రావడం వల్ల ఇదే పెద్ద సినిమాలాగ అనిపించింది టార్గెట్ ఆడియన్స్ కి. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం. 

సింగిల్ లైన్లో చెప్పాలంటే, కూల్డ్రింక్ బాటిల్లో ఇరుక్కున్న బొద్దింకను చూపించి ఆ కూల్డ్రింక్ కంపెనీ సీయీవోని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు కొట్టేయాలని రంగంలోకి దిగిన రెండు వర్గాల కథ ఇది. 

వాస్తు (చైతన్య రావు), లంచం (రాగ్ మయూర్) స్నేహితులు. వాస్తు తాత వరదరాజు (బ్రహ్మానందం) వీల్ చెయిర్ కి పరిమితమైన పేషెంట్. తాము కొన్న కీడా కోలా కంపెనీకి చెందిన కూల్డ్రింక్ సీసాలో బొద్దింక కనపడిందని ఆ కంపెనీపై నష్టపరిహారం దావా వెయ్యాలని సిద్ధమవుతాడు ఆల్రెడీ లాయరైన లంచం.

మరో పక్క నాయుడు (తరుణ్ భాస్కర్) జైల్లోంచి విదుదలవుతాడు. అతని తమ్ముడు జీవన్ (జీవన్) కి ఉన్న కార్పొరేటర్ ని లేపేసి తాను ఆ కుర్చీ ఎక్కాలని కోరిక. ఇక్కడ ట్విస్టేంటంటే ఇదే బొద్దింకను అడ్డం పెట్టుకుని నాయుడు కూడా ఆ కూల్డ్రింక్ కంపెనీ నుంచి డబ్బు లాగాలనుకుంటాడు. ఒక దశలో ఈ రెండు గ్రూపులూ కలుస్తాయి.

అక్కడ నుంచి ఆ కీడా కోలా సీయీవో (రవీంద్ర విజయ్) ని ఎలా వాడుకుంటారనేది కథ. 

ఈ ఉల్లిపొరలాంటి కథతో రెండు గంటల కథనం నడపాలంటే నిజానికి పెద్ద కష్టం కాదు. ఆద్యంతం ఆసక్తి గొలిపే కామెడీతో అద్భుతంగా రాసుకోవచ్చు. ఇక్కడ దర్శక రచయిత ప్రయత్నం కూడా అదే. అయితే ఎక్కడో కొన్ని సీన్లలో తప్ప ఆద్యంతం కామెడీ పండిన పరిస్థితి లేదు. కారణం..రచన ఆ స్థాయిలో లేదు. 

ఫార్స్ కామెడీకి దగ్గరగా ఉండి బలమైన కామెడీకి దూరంగా నడిచే జానర్ ఇది. అప్పట్లో ఆర్జీవీ తీసిన "కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు" తరహాలో ప్రతి చిన్న పాత్రకి బిల్డప్ ఇంట్రడక్షన్, పెద్దగా డెప్త్ లేని సన్నివేశాలు, కథ అక్కడక్కడే తిరుగుతూ వేగంగా ముందుకు వెళ్లని వైనం.. ఇవన్నీ ఫస్టాఫులో కనిపిస్తాయి. 

కొంత వల్గారిటీ, కాస్తంత జుగుప్స, కావాలిసినంత నీరసం కథనంలో తొణికిసలాడాయి. 

ఫార్స్ కామెడీ అని చెప్పుకున్నాం కాబాట్టి ఇందులో లాజిక్కులు, మేజిక్కులు ఉండవు... ఈ జానర్లో తింగరితనమే ఉంటుంది. అన్ని పాత్రలూ ఇంచుమించు గజిబిజిగానే ప్రవర్తిస్తుంటాయి. అది కామెడీ అనిపించిన వాళ్లు నవ్వుతారు. తక్కిన వాళ్లు నవ్వుతున్న వాళ్ల మొహాలు చూసి జాలి పడుతూ ఉంటారు. ఈ సినిమా కూడా అలాంటిదే. 

అయితే ఒకటి రెండు సీన్లు, డయలాగ్స్ అందర్నీ నవ్వించేలా ఉన్నాయి. వాటిల్లో సెకండాఫులో వచ్చే చెప్పుల సీన్ ఒకటి. అలాగే "సరండర్ ద బాటిల్" డైలాగ్. ఈ రెండూ రచయిత ప్రతిభకి తార్కాణాలు. స్క్రిప్ట్ మొత్తంలో ఈ స్థాయి రైటింగ్ ఉండేలా చూసుకునుంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడో ఉండేది. 

బ్రహ్మానందానికి ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ వినిపిస్తాయి. ఔట్ డోర్ సీన్లో మాత్రం అతనికి చెవుడని చెప్తారు. ఈ గందరగోళమేంటో అర్ధమవ్వదు.

ఇందులో బార్బీ డాల్ ఎపిసోడ్ ఒకటి... అసలు దానిని ఏ విధంగా కామెడీ అనుకోవాలో! అంతేలే..పైన చెప్పుకున్నట్టు, ఆ సీన్లకి నవ్వురాకపోతే "ఈ జానర్ లో అంతే" అనుకుని సర్దుకోవాలి. 

నటీనటులంతా బాగానే చేసారు కానీ ఒక్క బ్రహ్మానందమే నాన్-సింక్ అనిపించాడు. ఆ పాత్ర అవసరం కూడా పెద్దగా లేదు- క్లైమాక్సులో మూత్రం ప్యాకెట్టుతో నడిచే జుగుప్సాకరమైన కామెడీ తప్ప. ఈ కొత్తతరం నటుల మధ్య ఆయన హాస్యం, హావభావాలు అన్నీ ఔట్-డేటెడ్ గా, రొటీన్ గా అనిపించాయి. 

వాస్తు పాత్ర చేసిన చైతన్యరావు తన నత్తి మ్యానరిజంతో బాగానే చేసాడు.

రాగ్ మయూర్ కూడా మంచి టైమింగుతో డైలాగ్స్ చెప్పాడు. 

తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి హీరో అనుకోవాలి. చాలా ఈజ్ తో చేసాడు.

జీవన్ పాత్ర కూడా ఆసక్తికరంగానే ఉంది.

విష్ణు కామెడీ ఒకటి రెండు చోట్ల బాగుంది. 

ఈ సినిమాలో అందరూ మగపాత్రలే. హీరోయిన్ కాదు కదా అసలు ఆడ పాత్రే లేదు. అది చెప్పుకోదగ్గ అంశం. 

టెక్నికల్గా నేపథ్య సంగీతం బాగానే ఉన్నా, పాటలు చాలా బోరింగ్ గా ఉన్నాయి.

ప్రధానంగా పాయింట్ బలంగా లేకపోవడం వల్ల పెద్దగా సస్పెన్స్ వంటివి వర్కౌట్ చేయడానికి లేకపోయింది.

కథనంలో సంఘర్షణ కూడా గ్రిప్పింగ్ గా లేదు. 

మొత్తమీద ప్రధామార్ధం కంటే ద్వితీయార్థం నయమనిపించే సినిమా ఇది. 

ఎటువంటి ఫార్ములాలికి లొంగకుండా పూర్తి స్వేచ్ఛగా రాసుకున్న ఫార్స్ కామెడీ చిత్రమిది. అందుకే వినోదం అందుకునే విషయంలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, ఓవరాల్ గా కొత్తగా అనిపిస్తుంది. 

చివర్లో సినిమా అంతా అయ్యాక "ఫ్రీడం జేబులో ఉండదు- జేబు వెనుకున్న దిల్ లో ఉంటది" అని క్యాప్షన్ వేసారు. అదే విధంగా "కొత్తదనం అనేది ఫార్ములాలో ఉండదు- స్వేచ్ఛగా రాసుకున్నప్పుడే ఉంటది" అని నిరూపించిన సినిమా ఇది.  

అన్ని వర్గాల ప్రేక్షకులకి కాకపోయినా యువ ప్రేక్షకుల్లో ఎక్కువమందికి నచ్చే విధంగా సాగింది ఇది. మరింత శ్రద్ధగా రాసుకుని ఉంటే ఫలితం మరింత బాగుండేది. 

బాటం లైన్: ఇంకా చల్లగా ఉండాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?