రాజకీయాల్లో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికార మార్పిడి ఆ రెండు కులాల మధ్య జరుగుతూ వుంటుంది. జనాభా రీత్యా తక్కువగా ఉండే ఆ రెండు కులాలే అధికారాన్ని తమ గుప్పిట పెట్టుకోవడం ఏంటనే ప్రశ్న అణగారిన వర్గాల నుంచి వస్తూ వుంటుంది. అంతెందుకు, జనసేనాని పవన్‌కల్యాణ్ గత ఎన్నికల్లో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించి, ప్రత్యామ్నాయంగా వచ్చిన తనను ఆదరించాలని కోరడాన్ని మరిచిపోవద్దు. ఆ తర్వాత ఆయన ఎవరి కొమ్ము కాస్తున్నారో చెప్పనవసరం లేదు.
కమ్మ వారికి టీడీపీ, రెడ్లకు ఏపీలో వైసీపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలను ప్రాతినిథ్యం పార్టీలుగా చెబుతుంటారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా ఈ దఫా 42 మంది రెడ్డి సామాజిక వర్గ నాయకులకు సీట్లు ఇచ్చింది. కేవలం ఐదుగురు కమ్మ నేతలకు మాత్రమే ఆ పార్టీ సీట్లు కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్లకు గణనీయమైన సీట్లే ఇచ్చింది. ఇక మిగిలిన సీట్లలో కూడా ఎన్నోకొన్ని రెడ్లకు ఇచ్చే అవకాశం వుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తూ వచ్చిన కమ్మ సామాజిక వర్గం, ఇప్పుడు అదే పార్టీకి అండగా నిలిచేందుకు ఉత్సాహం చూపడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదే సందర్భంలో మెజార్టీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న పరిస్థితిని తెలంగాణలో చూడొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణలో గతంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయ పరిస్థితిని చూసి ఉండరనే చర్చకు తెరలేచింది.
చంద్రబాబును రాజకీయంగా తెలంగాణ సీఎం కేసీఆర్, అలాగే బీజేపీ జాతీయ నేతలు ఇబ్బంది పెట్టారనే అక్కసు కమ్మ వర్గంలో వుంది. అందుకే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పడానికైనా కాంగ్రెస్‌కు ఓట్లు వేసి తీరాలనే పట్టుదలతో కమ్మ సామాజిక వర్గం వుంది. కమ్మ వర్గీయుల మద్దతు ఇవ్వడాన్ని రెడ్లు స్వాగతిస్తున్నారు. రెడ్లు, కమ్మల మధ్య రాజకీయ వైరమే తప్ప, వ్యక్తిగతంగా ఏమీ లేదనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా చంద్రబాబు శిష్యుడైన రేవంత్‌రెడ్డి వుండడంతో కమ్మ సామాజిక వర్గం మద్దతు ఇవ్వడానికి మరో ఆలోచనే చేయడం లేదు. అవసరమైతే కాంగ్రెస్‌కు ఫండింగ్ ఇవ్వడానికి కూడా కమ్మ సంఘం నేతలు వెనుకాడడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ అత్యధికంగా రెడ్లకు టికెట్లు కేటాయించినా, వైఎస్ జగన్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు గుప్పిస్తుండడం, రెచ్చగొట్టేలా మాట్లాడ్డాన్ని రెడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
బీఆర్ఎస్ నేతలు దొరతనంతో వ్యవహరిస్తున్నారని, వారి పొగరు అణచడానికైనా కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలనే అభిప్రాయం రెడ్లలో బలంగా వుందని అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలను ఏకం చేస్తున్నాయని చెప్పక తప్పదు.