ప్రముఖ నిర్మాత , స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం ‘కిడ’ తెలుగులో దీపావళి పేరుతో అనువదించారు. ఆర్.ఎ.వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. దీపావళి పండగ సందర్బoగా నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ మీడియాతో మాట్లాడారు.
నాది మధురై జిల్లాలోని రామనాథపురం అనే గ్రామం. పుట్టి పెరిగిందంతా అక్కడే. సినిమాపై ఉన్న ఆసక్తితో 2003లో చెన్నై నగరంలోకి అడుగు పెట్టాను. డైరెక్టర్ ఎళిల్ దగ్గర ఆఫీస్ బాయ్‌గా చేరాను. అక్కడి నుంచే నా సినీ ప్రయాణం ఆరంభమైంది. నాలుగైదేళ్లు వర్క్ చేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాను. అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగాను.
సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉన్నప్పటికీ అందులో ఎమోషన్స్‌కే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనే విషయాన్ని నేను నమ్ముతాను. ఓసారి స్నేహితులతో కలిసి సినిమా చూస్తున్న క్రమంలో నా మైండ్‌లో ‘దీపావళి’ కథకు సంబంధించిన ఆలోచన పుట్టింది. పల్లెటూరు, అందులో మేకలు పెంచుకునే ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్ చేస్తూ ఎమోషనల్‌గా ఓ కథను రాసుకున్నాను.
దీపావళి కథను రాసుకున్నప్పుడు ఎవరి ద్వారానో రవికిషోర్ కు తెలిసింది. వెంటనే ఆయన నాకు టచ్‌లోకి వచ్చి.. పూర్తి కథను ఆడియో రూపంలో వివరించి పంపమన్నారు. ఆ మరుసటి రోజే ఆయన్నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఈ సినిమా మనం చేస్తున్నామని ఆయన అన్నారు. ఓ పెద్ద ప్రొడ్యూసర్ అలా చెప్పగానే నాకు నిజంగా షాకింగ్‌గా అనిపించింది.
నేను దర్శకుడిగా తొలి సినిమా చేస్తున్నాననే భావన రాలేదు. స్రవంతి రవికిశోర్‌గారు డైరెక్షన్‌తో పాటు మరో పెద్ద బాధ్యతను అప్పగించారు. అదే ప్రొడక్షన్ బాధ్యతలను చూడటం. సినిమాలో నటీనటులు, టెక్నీషియన్స్‌ను మాట్లాడటం నుంచి వారికి రెమ్యునరేషన్స్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీని అప్పగించారు.
‘దీపావళి’ సినిమాను చేసిన తర్వాత గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కి పంపాను. అక్కడ ఆడియెన్స్ నుంచి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. తర్వాత చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూవీని స్క్రీనింగ్ చేశాం. అక్కడ సినిమాకు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి. తర్వాత మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ స్క్రీనింగ్ చేస్తే స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది.
స్క్రీనింగ్ జరిగిన తర్వాత ఒక మహిళ వచ్చి ‘మీరు సినిమాను గొప్పగా తీశారు. నాకు నా తాతయ్య, అవ్వ వాళ్లు గుర్తుకొచ్చారు’ అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. అలాంటి అపూరమైన క్షణాలను ఎన్నింటినో ఫేస్ చేశాను. ఇది నా రియల్ లైఫ్ కథ కాదు.. కానీ అందులోమా తాత, అవ్వల పాత్రలను బేస్ చేసుకునే తాతయ్య పాత్రలో నటించిన పూ రాము, అవ్వ పాత్రలను రాసుకున్నాను. మనం పల్లెటూర్లకు వెళ్లినప్పుడు ఇలాంటి ఎమోషన్స్‌ను దగ్గరగా చూస్తాం. దాన్ని చాలా మంది అనుభవించి కూడా ఉంటారు. అలాంటి అనుభవం నుంచే ఈ కథ పుట్టింది.
ఎమోషనల్ పాయింట్‌తోనే ఓ కథను సిద్ధం చేస్తున్నాను. స్రవంతి రవికిశోర్‌గారికి లైన్ చెప్పాను. ఆయనకు నచ్చింది. పూర్తి కథను సిద్ధం చేయమన్నారు. దాన్నొక స్టార్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం. అయితే కథంతా పూర్తయిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. ఆ వివరాలను తర్వాత తెలియజేస్తాం… అంటూ ముగించారు ‘దీపావళి’ మూవీ డైరెక్టర్ ఆర్.ఎ.వెంకట్