మన దేశంలో హిందువులం ఎక్కువ. మనం ఆవును పూజిస్తాం. తల్లిలాటిది కాబట్టి గోమాతగా పిలుస్తాం. దానికి సంబంధించిన ప్రతి పదార్థాన్ని పవిత్రంగా భావిస్తాం. అది పాలిస్తూన్నంతవరకు అంతా బాగానే ఉంటుంది. అది వట్టిపోయిన తర్వాత యీ విషయాలన్నీ గుర్తుకు రావు. ముసలి తలిదండ్రులనే వదిలించుకుంటున్న యీ సమాజంలో వట్టిపోయిన ఆవుకి దండగ్గా మేత పెట్టడం భారమనిపించదా? అందుచేత అమ్మేస్తే దాని మాంసం, చర్మం వగైరాలు తక్కినవాళ్లకు ఉపయోగపడతాయి కదా అనుకుంటాడు రైతు.
కానీ ప్రస్తుత వాతావరణంలో అమ్మడం అసాధ్యమై పోయింది. చట్టాల్లో ఉన్నది కొంత అయితే, చట్టాలను అధిగమించి గోరక్షకుల పేరుతో అసాంఘిక శక్తులు చెలరేగుతున్నాయి. దాంతో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఉదాహరణకి రాజస్థాన్‌లోని 10 పశువుల సంతల్లో 2010-11లో 30 వేల పశువుల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదికి అవి 3 వేలకు తగ్గాయి. 2017 ఏప్రిల్‌లో పెహలూ ఖాన్ హత్య తర్వాత యిప్పటివరకు 460 అమ్మకాలు మాత్రమే అయ్యాయి. ఇలాటి పరిస్థితుల్లో వట్టిపోయిన ఆవులను యజమానులు అనాథలుగా వదిలేస్తున్నారు. అవి పొలాల్లో పడి పంటను మేసేస్తున్నాయి. దాంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆవులను ఎక్కడైనా కట్టిపడేయమని, లేదా చంపించివేయమని ఆందోళనలు చేపడుతున్నారు.
నాసిక్ నుంచి ముంబయికి 200 కి.మీ.ల యాత్ర నిర్వహించి విజయం సాధించిన ఆల్ ఇండియా కిసాన్ సభ యిప్పుడు దిల్లీలో రెండు రోజుల సమావేశం ఏర్పరచి అనాథ గోవుల సమస్యను పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరింది. గోశాలలను కట్టడంతో సరిపోదు. నిర్వహణకు, గోవుల ఆరోగ్యపరిరక్షణకు చాలా డబ్బు ఖర్చవుతుంది. అన్నదాతలను, గోమాతలను యిద్దరినీ సమన్వయపరిచే బాధ్యతను ప్రభుత్వం ప్రజలపై మోపి గోరక్షణ పేరుతో సెస్సులు విధిస్తోంది.
వట్టి పోయిన ఆవులను మేపే సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పాలంటే ఒక ఉదాహరణ చాలు – బుందేల్‌ఖండ్‌లో కరువు తాండవిస్తోంది. తమకే తిండి లేకుండా ఉంటే యిక వట్టిపోయిన ఆవులకు ఏం పెడతామనుకుని ప్రజలు వాటిని గాలికి వదిలేయసాగారు. ఇది చూసి అక్కడున్న ఓ కాలేజీ డైరక్టరు గత డిసెంబరులో తన ఫేస్బుక్ ద్వారా వట్టి పోయిన ఆవులకు మేత నిస్తానని ఆఫర్ యిచ్చాడు. ఏ మూడు వందల మంది రైతులో తమ ఆవుల్ని తెస్తారనుకున్నాడు. తీరా చూస్తే 7 వేల మంది వచ్చారు. ఇంకో 15 వేల మంది కూడా వచ్చారు కానీ పోలీసులు, కాలేజీ సిబ్బంది కలిసి వాళ్లను తరిమివేశారు.
మేత పెట్టలేక రైతులు వట్టిపోయిన ఆవులను వదుల్చుకోవడంతో అనాథ ఆవులు పెరిగిపోతున్నాయి. రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగే వాటిని పట్టుకుని శిక్షిద్దామంటే దాని సొంతదారు ఎవరో ఎవరికీ తెలియదు.యుపికి చెందిన ఒక బిజెపి ఎంపీ పార్లమెంటులో అనాథ గోవుల సమస్యపై ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. జాతీయ స్థాయిలో అనాథ గోవుల బోర్డు ఏర్పరచి, వదిలేసిన ఆవుల సమస్యను దానికి అప్పగించాలని ప్రతిపాదించాడు.
2012 నాటి లెక్కల ప్రకారం మన దేశంలో 53 లక్షల అనాథ గోవులున్నాయి.వాటిని పోషించడానికి ఏడాదికి రూ.11,607 కోట్లు ఖర్చవుతుంది. ఇటీవలి కాలంలో ఈ అంకె యింకా పెరిగి ఉంటుంది. ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా గోశాలలను నిర్మించి పోషించమంటోంది. వాళ్లు గోరక్షణ పేరుతో సెస్‌లు ద్వారా నిధులు సేకరిస్తూ, ప్రభుత్వపరంగా కొన్ని నిర్వహిస్తూ ప్రయివేటు గోశాలలు నిర్వహిస్తున్న సామాజిక సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారు. సంస్థల ఎంపికలో పక్షపాతం ఉందనీ, స్కాములు జరుగుతున్నాయనీ ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి.
రాజస్థాన్‌లో 1934 గోశాలలున్నాయి. వీటిలో 8 లక్షల ఆవులున్నాయి. ప్రతీ ఏటా 2 లక్షలు వచ్చి చేరుతున్నాయి. 2016-17లో వీటిపై రూ. 155.50 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బు రాబట్టడానికి స్టాంప్ డ్యూటీపై గోరక్షణ సెస్ పేరుతో అదనంగా 10% వసూలు చేస్తున్నారు. నందీ గోశాల పేర అనాథ మహిషాల కోసం శాలలు కడతామంటూ ఈ ఏడాది బజెట్‌లో రూ.16 కోట్లు కేటాయించారు. ఎందుకంటే మూడేళ్ల కంటె చిన్నవైన ఎద్దుల అమ్మకాన్ని నిషేధించారు. దాంతో వాటినీ గాలికి వదిలేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ కూడా తాజా బజెట్‌లో గోరక్షణ సెస్ ప్రతిపాదించింది. మద్యం అమ్మకాలపై సెస్ విధించి దాన్ని గోరక్షణకు మరిలిస్తారట. దేవాలయాలు, మతపరమైన ట్రస్టులు తమ ఆదాయంలో 15% గోశాలలపై ఖర్చు పెట్టాలని ఆదేశించింది. హరియాణాలో 410 ఉన్నాయి. 2017 జులైలో గో సేవా ఆయోగ్ పేరిట మరిన్ని గోశాలలు కడతామంటూ రూ.20 కోట్లు బజెట్‌లో కేటాయించింది.
మహారాష్ట్ర 2016లో 34 గోశాలలు కట్టడానికి రూ.34 కోట్లు కేటాయించింది కానీ యిప్పటిదాకా నిధులు విడుదల చేయలేదు. ఉత్తర ప్రదేశ్‌లో 486 గోశాలలు ఉన్నాయి. గోసంక్షేమం కోసం రూ.233 కోట్లు కేటాయించారు. 12 జైళ్లలో గోశాలలు నెలకొల్పడానికి రూ.2 కోట్లు అదనంగా కేటాయించారు. గుజరాత్ ప్రభుత్వం 667 గోశాలలో వసతులు పెంచడానికి రూ.44 కోట్లు కేటాయించింది. వాటికి విరాళాలు యిమ్మనమని కార్పోరేటు రంగాన్ని కోరింది. 2014కు ముందు అలాటి కార్యక్రమాలకు పైసా విదల్చని కార్పోరేట్లు యిప్పుడు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద కోట్లు కుమ్మరిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో 2012 లెక్కల ప్రకారం ఆవులు, ఎద్దులు కలిపి 20 లక్షల దాకా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లలో ధాన్యాల లావాదేవీలపై 2% సెస్ విధించి గోశాల నిర్వహణకు ఖర్చు పెడుతోంది. ప్రభుత్వం గుర్తింపు ఉన్న శాలలు 600. 472 హెక్టార్ల స్థలంలో 6 వేల ఆవులు పట్టే 'కామధేను కౌ శాంక్చువరీ' పేరుతో రూ.32 కోట్ల ఖర్చుతో ఏడేళ్ల పాటు కట్టిన 2017 సెప్టెంబరులో ప్రారంభమైంది. రైతులు 2 వేల వట్టిపోయిన ఆవుల్ని పట్టుకుని వచ్చి తీసుకోమని అడిగి భంగపడ్డారు.
రాజస్థాన్ రైతులు దానికి వట్టిపోయిన 15 వేల ఆవులను దానం (!) యివ్వడానికి సిద్ధపడ్డారు. దాంతో జిల్లా యంత్రాంగం ఎవరి నుంచి తీసుకోవాలో, తీసుకోకూడదో తేల్చడానికి ఓ స్క్రీనింగ్ కమిటీ వేసింది. ఈ లోపున మూణ్నెళ్లలో 100 ఆవులు చచ్చిపోయాయి. అనాథ గోసమస్యపై ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఆ కమిటీకి రాష్ట్ర 'కౌ ప్రమోషన్ బోర్డ్' నుంచి ఒక వింత ప్రతిపాదన వచ్చింది. ఆ అనాథ ఆవులను లాభదాయకంగా ఉపయోగించుకుంటే గోశాల నిర్వహణ ఖర్చు కలిసి వస్తుందని, దానికై ఆవుపేడతో ప్రతి గ్రామంలో హెలిపాడ్లు కట్టవచ్చని, గోమూత్రాన్ని ఔషధంగా అమ్మవచ్చని ప్రతిపాదించింది. ఇలాటి వింత ప్రయోగాలకు ఆ రాష్ట్రం పేరు తెచ్చుకుంటోంది.
ఆడ దూడలు కావాలంటే ఏ వేద మంత్రాలు చదవాలి, కోడెదూడలు కావాలంటే ఏ వేద మంత్రాలు చదవాలి వంటి ప్రయోగాలు కూడా కామధేనులో జరుగుతున్నాయి. గోమూత్రం, పేడలపై ప్రయోగాలు సరేసరి. ఓట్ల కోసం నర్మదా నదిని ఎడాపెడా వాడేసుకుంటున్న ముఖ్యమంత్రి నర్మద నది ఒడ్డున 108 గోశాలలు కడతామని కూడా ప్రకటించారు. ప్రయివేటు గోశాలలను మరిన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పటికే 900 ప్రయివేటు గోశాలలున్నాయి. అవన్నీ తమ పార్టీకి పరోక్షంగా నిధులు అందించడానికేనని ప్రతిపక్షాల ఆరోపణ. వట్టిపోయిన ఆవులు పాలివ్వకపోవచ్చు కానీ నిధులు పిండుకోవడానికి పాలకులకు పనికి వస్తాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]