రంగస్థలం సినిమా బాగుంది, ప్రయోగాత్మకం, అభినందనీయం, కలెక్షన్లు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని రావడానికి బాటలు వేస్తోంది. ఈ విషయాలను ఎవరూ కాదనలేం. తమ ఇంటి కుర్రాడు ఇలాంటి సినిమా చేసినందుకు పవన్ కల్యాణ్‌కు కూడా ఆనందం మరింత ఎక్కువగా కలిగితే కలిగిఉండవచ్చు.
ఆ మేరకు అభినందించి ఉంటే అంత వరకూ బాగుండేది. అయితే, పవన్ మాత్రం కొంచెం ఎక్కువ చేశారు. అదేమంటే ‘రంగస్థలం’ సినిమాను ఆస్కార్‌కు పంపాలి, మన దేశం తరఫున ఆస్కార్స్‌కు పంపించాలి, అని పవన్ పిలుపునిచ్చాడు. ఇదే కొంచెం ఎక్కువైందేమో అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. రంగస్థలం సినిమా తెలుగు ఇండస్ట్రీకి గొప్పదే.
కానీ.. పవన్ గమనించాడో లేదో ఇండియాలోని ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనే ఇంతకన్నా ప్రయోగాత్మక, సాహసోపేతమైన కాన్సెప్టులతో అనేక సినిమాలు వస్తున్నాయి. తెలుగు కమర్షియల్ హీరోలకు, మాస్ ఇమేజ్ హీరోలకు రంగస్థలంలాంటి సినిమా చేయడం అపురూపం అయితే కావొచ్చు కానీ పక్కనే ఉన్న తమిళ హీరోలు తమ ఇమేజ్‌లను పక్కన పెట్టి ఎన్నో ప్రయోగాత్మక సినిమాలను చేస్తున్నారు. ‘రంగస్థలం’ మనకు ఇప్పుడొచ్చింది.
సినిమా ఆసాంతం హీరో పంచెతో కనిపిస్తే ఇదో విచిత్రం మనకు. ఈ హాశ్చర్యాలు అన్నీ టాలీవుడ్‌కే గొప్ప. దశాబ్దంన్నర కిందటే తమిళనాట ఇద్దరు హీరోల కాంబినేషన్లలో ‘శివపుత్రుడు’లాంటి సినిమా వచ్చింది. తమిళంలో రూరల్ బ్యాక్‌గ్రౌండ్ తో విక్రమ్, ధనుష్, సూర్య, కార్తీ వంటి హీరోలు బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. వాళ్లు దశాబ్దంన్నర కిందట చేస్తే మనోళ్లు ఇప్పుడు చేస్తున్నారు.
ఈ మాత్రందానికే ‘ఆస్కార్స్’కి పంపించేయాలి అనడం కామెడీ. ఇక్కడ రంగస్థలం సినిమాను తక్కువ చేయడం లేదు. కానీ ఇదే ఎక్కువ అనుకోవడం మాత్రం నిస్సందేహంగా పొరపాటే. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ‘రంగస్థలం’ సినిమాను రాజకీయాలను పక్కన పెట్టి చూడాలన్నట్టుగా పవన్ మాట్లాడాడు. ఇంత వరకూ ఎవరూ మెగాఫ్యామిలీ సినిమాలను రాజకీయల లెక్కలతో చూడటం లేదు. అయినా పవన్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నట్టో!