తండ్రి బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేశాడు బాలయ్య. ఈ విషయంలో విమర్శలూ ఉన్నాయి, ప్రశంసలూ ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌ను తీస్తున్నాడని నందమూరి అభిమానులు, టీడీపీ వీరాభిమానులు బాలయ్య పట్ల కొత్త అభిమానంతో పొంగిపోతున్నారు. అయితే.. చరమాంకంలో ఎన్టీఆర్ ఆక్రోశించినప్పుడు ఆయనకు సాయంగా ముందుకు రాని తనయులు ఇప్పుడు తండ్రి జీవితంపై సినిమా చేయడం కామెడీ అని మరికొందరు అంటున్నారు. తనవాళ్లే తనకు చేసిన ద్రోహంపై ఎన్టీఆర్ తీవ్ర ఆవేధన భరితుడు అయ్యాడు.
మీడియా పరిమిత స్థాయిలో ఉన్నప్పుడే ఎన్టీఆర్ ఆవేదన వెలుగులోకి వచ్చింది. వీడియోల రూపంలో నేటికీ ఎన్టీఆర్ బాధంతా సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌ను రూపొందిస్తూ ఉన్నాడు. బాలయ్య ఈ సినిమాను రూపొందించడం పట్ల ఉన్న మిశ్రమ స్పందన అలా ఉంటే.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి లీకులే రాజ్యమేలుతూ ఉండటం గమనార్హం. పెద్దగా క్లారిటీ లేకుండానే ఈ సినిమాను బాలయ్య పట్టాలెక్కించాడని స్పష్టం అవుతోంది.
ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఉన్న లీకులు అన్నీఇన్నీ కావు. అందులో ప్రధానమైనది.. ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందనేది. ఎన్టీఆర్ సినిమా పార్ట్‌వన్, పార్ట్‌టూగా విడుదల అవుతుందని.. అంటున్నారు. అయితే ఇది అధికారిక ప్రకటన కాదు. కేవలం లీక్ మాత్రమే. లీక్‌గా మాత్రమే ఈ వార్త హల్చల్ చేస్తోంది. ఫస్ట్ పార్టులో ఎన్టీఆర్ సీఎం కావడం వరకే ఉంటుందని, రెండో పార్టులో అనంతర పరిణామాలుంటాయని అంటున్నారు. అయితే అనంతర పరిణామాల్లో నందమూరి వారు గర్వించదగ్గ ఎపిసోడ్లు ఏమీలేవు.
ఎన్టీఆర్‌ను నాదెండ్ల దించడం, తర్వాత ఎన్నికలను ఎదుర్కొని ఎన్టీఆర్ సీఎం కావడం వరకూ ఆయన చరిత్రను ఘనంగా చెప్పాలి. అయితే ఆ తర్వాత ఐదేళ్లకు వచ్చిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రజల తిరస్కరణకు గురి అయ్యింది. ఎన్నికల్లో ఓటమిపాలైంది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఐదేళ్లపాటు కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి, ఎన్టీఆర్ సీఎం అయ్యాడు. అప్పుడు ఎన్టీఆర్‌ను సొంత అల్లుడే దించేశాడు. సొంతవాళ్లే ఆయన పతనంలో ముఖ్యపాత్ర పోషించారు.
ఈ ఎపిసోడ్లను నందమూరి వారు గర్విస్తూ సినిమా తెరకెక్కించలేరు కదా. అందుకే తొలిసారి ఎన్టీఆర్ సీఎం అయ్యేంత వరకే సినిమా తీయవచ్చు. కాబట్టి రెండోపార్టు సీన్ లేదనే అనుకోవాలి. అయితే ఈ విషయంలో లీకులు అయితే రాజ్యమేలుతున్నాయి. వాటి సంగతలా ఉంటే.. ఇక ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ల పేర్లపై కూడా లీకులు నడుస్తున్నాయి. దీంట్లో విద్యాబాలన్ నటిస్తుందని కొన్నాళ్లు ప్రచారం చేశారు. ఎన్టీఆర్ భార్య పాత్రలో ఆమె కనిపిస్తుందన్నారు. అయితే అది కూడా ధ్రువీకరణ లేని అంశమే.
ఇక ఇప్పుడు మరో పేరుగా దీపికా పదుకునే పేరును తెరపైకి తెచ్చారు. ఆమె కూడా ఈ సినిమాలో నటిస్తుందని, ఎన్టీఆర్‌తో బోలెడన్ని సినిమాల్లో నటించిన శ్రీదేవి పాత్రలో దీపిక నటిస్తుందని అంటున్నారు. అయితే విద్యాబాలన్, దీపికల రెమ్యూనరేషన్లు చాలు.. వాళ్లు ఈ సినిమాలో నటించే ఛాన్సులు లేవని చెప్పడానికి. విద్యాబాలన్ తీసుకునే పారితోషకం బాలయ్య వేరే సినిమాలకు తీసుకునే మొత్తంతో సమానంగా ఉంటుంది.
ఇక దీపికకు ఇచ్చే డబ్బుతో ఈ సినిమా మేకింగ్ ఖర్చులకు సమానంగా ఉంటుంది. కాబట్టి.. దీపిక, విద్యలు ఈ సినిమాలు నటిస్తారనేవి ఉత్తుత్తి లీకులే అని చెప్పాలి.