శ్రీరెడ్డి తప్పు చేసింది. 'మా' సంఘ కార్యాలయ ప్రాంతంలో అర్థనగ్న ప్రదర్ళన చేసింది. అందువల్ల ఆమెకు మెంబర్ షిప్ ఇవ్వము గాక ఇవ్వము అని తెగేసి చెప్పారు 'మా' సంఘ పెద్దలు. అక్కడితో ఆగలేదు. ఎవరైనా ఆమెకు చాన్స్ ఇచ్చినా, ఆమెతో నటించినా తాము, తమ సంఘం వెలి వేస్తాం అన్నట్లుమాట్లాడారు. అంటే ఏమనుకోవాలి? కక్షసాధింపు అనుకోవాలా? ఓ వ్యక్తిని నటించకుండా, ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆడ్డుకోవడం అన్నది ఎంతవరకు సబబు? ఎంతవరకు న్యాయం? ఈ బెదిరింపు రాజ్యాంగ రీత్యా సరైనదేనా?
శ్రీరెడ్డి తొక్కిన దారి తప్పు కావచ్చు. లేదా శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకుని కొన్ని చానెళ్లు తమ టీఆర్పీ కోసం చేస్తున్న రాద్దాంతం సరైనది కాకపోవచ్చు. అంత మాత్రం చేత శ్రీరెడ్డికి అన్యాయం లేదా మోసం జరగలేదని అనడానికి లేదు. ఇండస్ట్రీలో ఎన్నో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆదరాబాదరాగా దర్ళకుడు తేజ ఎంక్వయిరీ చేయించి, శ్రీరెడ్డి ఫోన్ నెంబర్ సంపాదించి, కబురు చేసి, రెండు ఆఫర్లు ఇచ్చి, ఆపై మిగిలిన వారు కూడా ఇవ్వాలంటూ వీడియో బైట్ వదలడం వెనుక, ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద తలకాయ ప్రమేయం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పెద్ద మనిషికి చెందిన వారు ఒకరి గుట్టు శ్రీ రెడ్డి దగ్గర వుందని, అది తెలిసే, పైకి రానివ్వకుండా వుండడం కోసం రెండు ఆపర్లు ఎర వేసారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరి ఇప్పుడు తేజ ఈ ఆపర్లు ఇస్తే, 'మా' ఏం చేస్తుంది. బాలయ్య సినిమాలో వేస్తే బాలయ్యను వెలేయగలదా? వెంకీ సినిమాలో వేస్తే, ఆయనను పక్కన పెట్టగలదా? 'మా'కు అంత సీను వుంటుందా? అన్నది అనుమానం.
ఇదిలా వుంటే శ్రీరెడ్డి దగ్గర చాలా మంది పెద్ద తలకాయల సమాచారం వుందని, ఓ చిన్నబక్క కమెడియన్ వీడియో వుందని. దాన్ని ఆమె కొందరు మధ్యవర్తులకు చూపిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే మరి కొందరి గుట్టు మట్టలు వున్నాయని టాక్. ఇప్పటికే తెర వెనుక ఎవరికి వారు తమ తమ యవ్వారాలు బయటకు రాకుండా, ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
కొందరు మధ్యవర్తులతో శ్రీరెడ్డి ఒక మాట చెప్పినట్లు తెలుస్తోంది. తప్పని సరి పరిస్థితుల్లో తాను కాస్టింగ్ కౌచ్ కు తలవంచినపుడు, చాన్స్ ఇవ్వకపోయినా, డబ్బులు ఇచ్చిన వారి గురించి తాను అస్సలు మాట్లాడడం లేదని, అలా కాకుండా చాన్స్ ల కోసం తనను మోసం చేసిన వారి గురించే మాట్లాడుతున్నాని అన్నట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్లకు పైగా చాన్స్ ల కోసం పిచ్చిదానిలా ఎవరు ఏది పడితే అది చేసి, ఏం చూపించమంటే అది చూపించి, శ్రీరెడ్డి ఇప్పుడు నిజంగానే ప్రస్టేషన్ తో ఇలా తయారైందని ఇండస్ట్ర్రీలో కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఇలాంటి వ్యక్తులను నలుగురు పిలిచి, కూర్చోపెట్టి, కౌన్సిలింగ్ చేసి, అవకాశాలు ఇవ్వడమో, లేదా ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించడమో చేయాలి కానీ రెచ్చ గొట్టడం కాదు. ఇప్పుడేం అవుతుంది.
శ్రీరెడ్డి తన దగ్గర ఆధారాలు అమాంతం బయటపడేస్తే, ఇవ్వాళ మాట్లాడిన పెద్దలు ఏం అంటారు? ఒక వేళ 'మా'లో సభ్యుల సంగతి ఎవరిదైనా శ్రీ రెడ్డి ఆధారాలతో బయటపెడితే, వాళ్లను సభ్యత్వం నుంచి తొలగించి, వెలేయగలదా?
అయినా ముందు అసలు దరఖాస్తు నింపలేదని ఒకరు, దరఖాస్తుతో వెయ్యి రూపాయలే ఇచ్చిందని, కొంత అమౌంట్ కట్టాలి కట్టలేదని కొందరు, ఇలా రకరకాలుగా చెబుతున్నారు. 'మా' సభ్యత్వం ఇచ్చినంత మాత్రాన అవకాశాలు వచ్చేస్తాయా? ఇచ్చేస్తే 'మా'కు వచ్చిన కష్టం ఏమిటో? చాలా మంది 'మా'లో సభ్యత్వం కోసం చిన్న చితక పాత్రలు తమ పలుకుబడితో నటించి సంపాదించుకున్నారని వదంతులు వున్నాయి. ఒకటి రెండు సినిమాల్లో పలుకుబడితో డైరక్షన్ శాఖలో పేర్లు వేయించుకుని, ఆ అసోసియేషన్ లో సభ్యత్వం సంపాదించుకున్న వారు వున్నారని గతంలో విమర్శలు వచ్చాయి.
ఇలాంటి లొసుగులు ఎన్నో వున్నరంగం టాలీవుడ్. అలాంటిది ఒక్క శ్రీరెడ్డి విషయంలోనే నీతి, నిజాయతీ వంటి పదాలు వల్లెవేయడం ఏమిటో? ఇండస్ట్రీలో సరైన తలకాయ ఎవరైనా ఒక్క ఫోన్ కొడితే, ఇదే 'మా' జనాలు, సానుభూతితో పరిశీలించాం, ఆడకూతరు అని ఆలోచించాం, అంటూ మళ్లీ కొత్తరాగం అందుకుని, సభ్యత్వం చేతిలో పెట్టకుండా వుంటారా?
ఇక్కడంతా కనపడని చెయ్యేదో ఆడిస్తోంది నాటకం అన్నట్లు వుంటుంది వ్యవహారం. శ్రీ రెడ్డి విషయంలో ఇన్ని మాట్లాడుతున్న 'మా' జనాలు, సినిమా రంగంలో '……' లేరా? అన్న వ్యవహారంపై ఎందుకు గప్ చుప్ అయిపోయారు?