సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీ లేవనెత్తి పాపులర్ అవడం ఇప్పుడు కొందరికి పాపులారిటీకి మార్గంగా మారింది. యూట్యూబ్లో ఎక్కడో చిన్న వీడియోనో లేదా ఇంటర్వ్యూతోనో రచ్చ స్టార్ట్ చేస్తే, వారిని తీసుకొచ్చి ప్రైమ్ టైమ్లో కూర్చోబెట్టి చర్చాగోష్టితో గంటలు గంటలు వాళ్లు చెప్పే సోది వింటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్లని సెలబ్రిటీలని చేస్తోంది.
ఈ మార్గంలో పాపులర్ అయిన వారిని చూసి మరింత మంది టాప్ సెలబ్రిటీలపై బురద జల్లడాన్నే పనిగా పెట్టుకున్నారు. నిరాధారిత ఆరోపణలతో సంచలన వ్యాఖ్యలు చేయడం, దాంట్లో నిజానిజాలు తెలుసుకోకుండా డైరెక్టుగా టెలికాస్ట్ చేసేస్తున్నారు. వాళ్లూ, వీళ్లూ అని లేక సాఫ్ట్ టార్గెట్గా భావించిన ఎవరిపై అయినా వీళ్లు బురద జల్లుతారు.
మీడియా ఛానళ్లు టీఆర్పీల కోసం ఇలాంటి వాళ్లని ఎంకరేజ్ చేస్తూ వుండడంతో ఇలాంటి వాళ్లు ఇంకా ఇంకా పుట్టుకొస్తున్నారు. ఒక ఛానల్ దీనిని ప్రోత్సహించి రేటింగ్ కొట్టేసిందని పోటీలు పడి మరీ వీరికి గంటల కొద్దీ టీవీ టైమ్ ఇచ్చేస్తూ వుండడం వల్ల నోటికొచ్చింది వాగేసి ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చేసుకోవడానికి పనీ పాటా లేని చాలా మంది తయారైపోయారు. ప్రతి జాఢ్యానికీ ఏదో ఒక చోట ఫుల్స్టాప్ పడాల్సిందే. మరి దీనికెప్పుడు పడుతుందో ఏమో?