టీడీపీ అధిష్టానంపై మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్‌రావు తనయుడు శివరామ్ ఫైర్ అయ్యారు. సత్తెనపల్లి టీడీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. సత్తెనపల్లి టికెట్‌ను కోడెల తనయుడు ఆశిస్తున్నారు. అలాగే మరికొందరు కూడా సత్తెనపల్లిపై ఆశలు పెంచుకున్నారు. వీరెవరినీ కాదని, బీజేపీ నుంచి చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. టీడీపీలో కన్నా చేరికే ఆలస్యం, ఆయన్ను సత్తెనపల్లి ఇన్చార్జ్గా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీన్ని కోడెల శివరామ్ జీర్ణించుకోలేకపోతున్నారు.
మరోవైపు కన్నాతో సుదీర్ఘ కాలం పోరాడామని, ఆయన వల్ల కేసులు పెట్టుకుని ఇబ్బందులపాలయ్యామని, అలాంటి నాయకుడిని తమ నెత్తిపై రుద్దడం ఏంటని కోడెల శివరామ్ నిలదీస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నా నాయకత్వాన్ని తాము ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా నాలుగేళ్లుగా చంద్రబాబును తనతో పాటు తన తల్లి కలిసేందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నా పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి కోడెల శివప్రసాద్‌రావు మాట పలకడానికి కూడా టీడీపీ అధిష్టానం ఇష్టపడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సొంతంగా ఆయన రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పల్లె నిద్ర పేరుతో జనంలోకి ఆయన వెళుతున్నారు. మరోవైపు పల్నాడులో లోకేశ్ పాదయాత్ర ప్రవేశించింది. దీంతో టీడీపీ అప్రమత్తమైంది. టీడీపీ కార్యకలాపాల్లో ఎందుకు పాల్గొనడం లేదో వివరణ ఇవ్వాలంటూ కోడెల శివరామ్‌తో పాటు 16 మందికి టీడీపీ నోటీసులు ఇచ్చింది.
ఈ నోటీసులపై బుధవారం కోడెల శివరామ్ సీరియస్‌గా స్పందించారు. దశాబ్దాలుగా టీడీపీ ఉన్నతి కోసం కష్టపడుతున్న వారికి నోటీసులు ఇవ్వడం ఏంటని శివరామ్ ప్రశ్నించారు. కనీసం టీడీపీ కార్యాలయంలో ఏనాడూ అడుగు పెట్టని కన్నా లక్ష్మీనారాయణకు నోటీసులు ఇవ్వరా అని ఆయన నిలదీశారు. పార్టీ కోసం పని చేసే తనలాంటి వాళ్లకు నోటీసులు ఇవ్వడంలో మతలబు ఏంటని ఆయన ఫైర్ అయ్యారు.
చిలకలూరిపేట, నర్సరావుపేట, గురజాలలో టీడీపీ తరపున చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారని, వాళ్లలో కొందరు లోకేశ్ ఎదుట కొట్టుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని, తనకెందుకు ఇచ్చారని టీడీపీ అధిష్టానానికి ఆయన చురకలు అంటించడం గమనార్హం. ధిక్కార స్వరం వినిపిస్తున్న కోడెల శివరామ్‌పై వేటు వేస్తారా? లేక మరెలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది.