లెక్కప్రకారం మే 4న థియేటర్లలోకి రావాలి నా పేరు సూర్య సినిమా. గతంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఒక్క పాట మాత్రం పెండింగ్. ఆ పాటను కూడా రీసెంట్ గా అమెరికా షెడ్యూల్ లో కూడా పూర్తిచేశారు. ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ కూడా వచ్చేశాడు బన్నీ. అంతా ఓకే.
కానీ సినిమా మాత్రం చెప్పిన టైమ్ కు రాదంటున్నారు బన్నీ జనాలు. సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినప్పటికీ, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ సాఫీగా సాగుతున్నప్పటికీ.. మే 4న రావడానికి బన్నీకి ఇష్టంలేదట. దీనికి కారణం రీషూట్స్ అని తెలుస్తోంది.
ఈ సినిమాతో వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు బన్నీ. మామూలుగానే మేకింగ్ లో వేలు పెట్టే బన్నీ, వక్కంతం లాంటి కొత్త దర్శకుడికి ప్రాజెక్టు మొత్తం అప్పగించేస్తాడని అనుకోలేం. ఇప్పుడూ అదే జరుగుతోంది. సినిమాకు సంబంధించి ఫ్రెష్ గా మరో 2వారాల పాటు రీషూట్లు ప్లాన్ చేస్తున్నారట. టోటల్ రష్ చూసిన బన్నీ, ఏ ఏ సన్నివేశాలు రీషూట్ చేయాలో సూచించాడట. త్వరలోనే ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.
మరోవైపు మూవీపై బజ్ తగ్గకుండా ఉండేందుకు, ఎన్నడూ లేని విధంగా ఆడియో రిలీజ్ జరపాలని నిర్ణయించారు. బన్నీ సినిమాలకు ఆడియో రిలీజ్ లు ఉండవు, విడుదలకు 3రోజుల ముందు ప్రీ-రిలీజ్ లు మాత్రమే ఉంటాయి.
కానీ ఈసారి సినిమా లేట్ అవుతుండడంతో.. ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. ఈనెల 15న నా పేరు సూర్య ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ గ్యాప్ లో రీషూట్స్ కానిచ్చేసి, ఓ వారం ఆలస్యంగా.. మే రెండో వారంలో నా పేరు సూర్య సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే మే నెలలో రావాల్సిన మిగతా సినిమాలు గందరగోళంలో పడడం ఖాయం.