రజనీకాంత్ పై ఫ్యాన్స్ ఫైర్!

ఆఖరికి అభిమానుల ఆగ్రహాన్నే ఎదుర్కొంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. రాజకీయాల్లోకి రావడం విషయంలో రజనీకాంత్ నాన్చుడు ధోరణి ఇప్పటికే బయట వాళ్లను బాగా విసిగిస్తోంది. ఈ విషయంలో రజనీకాంత్ ను కమేడియన్ లా చూస్తున్నారు…

ఆఖరికి అభిమానుల ఆగ్రహాన్నే ఎదుర్కొంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. రాజకీయాల్లోకి రావడం విషయంలో రజనీకాంత్ నాన్చుడు ధోరణి ఇప్పటికే బయట వాళ్లను బాగా విసిగిస్తోంది. ఈ విషయంలో రజనీకాంత్ ను కమేడియన్ లా చూస్తున్నారు బయటి జనాలు. మరీ ఇంతలా ఆలోచించడమా? అయితే అవుతుందనాలి, లేకపోతే లేదనాలి కానీ, మరీ ఇంత ప్రహసనం ఏమిటి? అని బయటి వాళ్లు అడుగుతూ వస్తున్నారు.

అయితే రజనీకాంత్ మాత్రం తన ధోరణిని వీడటం లేదు. వాయిదాలతో రాజకీయ ప్రవేశాన్ని సీరియల్ గా మార్చేశాడు. రాజకీయాల్లోకి వస్తా.. అని మాత్రం రజనీ ప్రకటించాడు. అంతటితో దేవుడు ఆదేశించడమే అనకుంటే.. ఆచరించడంలో మాత్రం రజనీకాంత్ ఇంకా తర్జనభర్జనల్లోనే ఉన్నాడు. అవతల రజనీ అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేని కమల్.. పార్టీని ప్రకటించేశాడు.

అయితే రజనీ మాత్రం నాన్చుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభిమానులకే కోపం వచ్చేసింది. రజనీ అభిమాన సంఘాలకు కొన్ని చోట్ల రాజీనామాలు జరగడమే ఇందుకు సాక్ష్యం. తమిళ సంవత్సరాది సందర్భంగా రజనీకాంత్ కొత్త పార్టీని ప్రకటించనున్నాడని రెండు మూడు రోజులుగా మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది. ఇప్పటి వరకూ చాలా ముహూర్తాలు దాటిపోగా.. తమిళ ఉగాది సందర్భంగా పార్టీ ప్రకటన అనే వార్త వచ్చింది.

అయితే ఈ ప్రకటన పట్ల రజనీకాంత్ కు కోపం వచ్చిందట. ఈ ప్రకటన చేసిన తన అభిమాన సంఘం నేతను రజనీ సస్పెండ్ చేసేశాడట! అతడు అభిమాన సంఘంలో ఒక జిల్లా స్థాయి నేత కావడం విశేషం. తన అనుమతి లేకుండా నూతన సంవత్సరం సందర్భంగా నూతన పార్టీ.. అని ప్రకటన చేసిన అభిమాన సంఘం నేతపై రజనీ ఆ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశాడట.

ఆ సస్పెన్షన్ పట్ల ఆ స్థానిక అభిమానగణం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అభిమాన సంఘానికి రాజీనామాలు సమర్పించినట్టుగా తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అభిమాన సంఘం జిల్లా స్థాయి నేతను సస్పెండ్ చేయడంతో.. వందల మంది అభిమానులు సంఘానికే గుడ్ బై చెప్పారట. మొత్తానికి తలైవా రాజకీయ ఎంట్రీ చివరకు అభిమానుల్లోనే అసహనాన్ని రేపుతోంది. నాన్చుడు ధోరణితో అభిమానులను కూడా రజనీ విసిగిస్తున్నట్టుగా ఉన్నాడు!