బాబుపై ఆరాటం..పార్టీ కోసం పోరాటం

ఒకప్పుడు మీడియాలో ప్రచురించే ఎడిటోరియల్ వ్యాసాలకు ఓ విలువ అంటూ వుండేది. ఇప్పుడు అది గాలికి ఎగిరిపోయింది. రాజకీయ నాయకులు 'రాయించి' ఇచ్చే వ్యాసాలు వారి పేరిట ఎప్పుడయితే ఎడిటోరియల్ పేజీల్లోకి వచ్చాయో, ఎప్పుడయితే…

ఒకప్పుడు మీడియాలో ప్రచురించే ఎడిటోరియల్ వ్యాసాలకు ఓ విలువ అంటూ వుండేది. ఇప్పుడు అది గాలికి ఎగిరిపోయింది. రాజకీయ నాయకులు 'రాయించి' ఇచ్చే వ్యాసాలు వారి పేరిట ఎప్పుడయితే ఎడిటోరియల్ పేజీల్లోకి వచ్చాయో, ఎప్పుడయితే మీడియాకు పార్టీల బంధాలు, సామాజిక అనుబంధాలు ఏర్పడ్డాయో అప్పటి నుంచే విలువల వలువలు ఊడిపోయాయి. 

కలియుగ ధర్మాలు ఆదివారం తెల్లవారుతూనే ఏకరవు పెట్టిన జర్నలిస్ట్ ఆర్కే, ఆ కలియుగ ధర్మాల్లో మీడియా వలవలు ఇలా ఊడిపోవడం కూడా ఒకటి అని రాసుకోవాల్సి వుంటుంది. ఒక్కప్పుడు యాజమాన్యాలు విలువలతో నడిపి, నష్టాలు భరించలేక అమ్మేసిన మీడియా సంస్థలకు వందలు, వేల కోట్ల లాభాలు ఎలా వస్తాయి అన్న దాని వెనుక ఈ కలియుగ ధరమ్మే దాగి వుంది.

ఘనత వహించిన జర్నలిస్ట్ కమ్ పత్రికాధిపతి ఆర్కే ఈవారం వండిన వ్యాసం కూడా ఇలాంటి వ్యవహారానికి అతీతం కాదు. ఈవారం రాసిన వ్యాసం అక్షరం అక్షరంలో రెండే విషయాలు అడుగు అడుగునా తొంగి చూస్తున్నాయి. వైకాపాను విశాఖ జనాల దృష్టిలో దోషిగా నిలబెట్టడం. రెండు విశాఖలో తెదేపాను గెలిపించడం కోసం తన వంతు కృష్టి తాను చేయడం. ఇందుకోసం తన కలాన్ని ఎలా కావాలంటే అలా తిప్పి తిప్పి తన రచనా చమకృతిని ప్రదర్శించారు. 

''విశాఖపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓడిపోతే మంత్రులు వాళ్ల ముఖాలను కూడా తనకు చూపించాల్సిన అవసరం లేదని, అక్కడి నుంచే రాజీనామాలు చేయాలని జగన్మోహన్‌ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారట!..''

ఈ 'ట' వ్యవహారం ఏమటి? ఏ ప్రధాని, లేదా ముఖ్యమంత్రి తన మంత్రులను ఆ విధంగా ఆదేశించరు అన్నది ఆర్కే చెప్పాలి. గతంలో నంద్యాలలో జస్ట్ ఓ ఉపఎన్నిక జరిగితే రాయలసీమతో సంబంధం లేని ఆంధ్ర మంత్రులను అందరినీ కులాల వారీగా అక్కడకు తరలించిన చంద్రబాబు వైనం ఆర్కేకు గుర్తుకురాలేదా? ఆనాడెందుకు ఇలాంటి వార్తలు వండి వార్చలేదు?

''అభివృద్ధి నమూనానే నమ్ముకున్న చంద్రబాబు 2004లో ఒకసారి, 2019లో మరోసారి ఘోరంగా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలను తనవైపు తిప్పుకొనే మెళకువలను ఆకళింపు చేసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును బీజేపీ నుంచి దూరం చేయడంలో సఫలమయ్యారు. 

జగన్‌ రెడ్డి విసిరిన ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం తన పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులతో రాజీనామా చేయించారు. దీంతో భారతీయ జనతాపార్టీకి జగన్‌ రెడ్డి సన్నిహితమయ్యారు. ఎన్నికలలో గెలుపొందడానికి అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేశారు. చంద్రబాబు ఒంటరిగా మిగిలిపోయారు…'' 

చంద్రబాబు ఓటిమి మీద ఎంత బాధ..ఎంత ఆవేదన ఈ వ్యాసంలో దాగివుందో ఈ పది లైన్లు చదివితే అర్థం అయిపోతుంది. బాబుగారు పాపం కేవలం అభివృద్ది మంత్రాన్నే నమ్ముకున్నారట. నవ్విపోవడానికి కూడా ఓ లిమిట్ వుంటుంది. డబ్బును పప్పు బెల్లాల్లా బాబు పంచిపెట్టలేదా? 70 రూపాయల భోజనాన్ని అయిదు రూపాయలకు జనాలకు ఇచ్చేసి, కాంట్రాక్టర్లకు మేలు చేయలేదా? ప్రతి పండుగకు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. సరుకులు ఇచ్చేయలేదా? పసుపు కుంకుమ అంటూ నేరుగా పదివేలు వేసే కార్యక్రమానికి తెరతీసింది బాబు కాదా?

అక్కడికి బాబు అయితే అభివృద్ది చేస్తారు. జగన్ అయితే అభివృద్ది చేయరు. అంటూ కబుర్లు చెప్పడం తప్పు కదా? పల్లెల్లోకి వెళ్లి చూడండి. ప్రతి స్కూలు ఎలా కళకళలాడుతోందో. ప్రతి ఆసుపత్రి ఎలా కొత్త సొగసులు అద్దుకుంటోందో? ఇది అభివృద్ది కాదా? ఇది ఆర్కేకు కనిపించలేదా? కేవలం సంక్షమ పథకాలు మాత్రమే కనిపించాయా? 

ఈ విషయం అలా వుంచితే జగన్ పన్నిన ఉచ్చులో పడిపోయి బాబు భాజపాకు దూరం అయ్యారట. వారెవ్వా…ఏం జోక్. చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఇదేనా? జగన్ పన్నిన ఉచ్చులో పడిపోయి తన ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించారా?  సరే మరి అదే టైమ్ లో ఇదే మీడియా వండి వార్చిన వ్యాసాలు, వార్తలు అన్నీ ఓసారి బయటకు తీయండి..మీరు ఎవరి ఉచ్చులో పడిపోయి అలాంటి వార్తలు, వ్యాసాలు వండి వార్చారు. 

తెలుగుదేశం జనాలు అంతా భాజపాకు బాబు దూరం కావడం వెనుక ఈ మీడియా వుందని, దాని వల్లే ఇలాంటి అధోగతి పట్టిందని అంటున్నది మరి ఎందుకనో? సరే, భాజపాను, మోడీని మట్టి కరిపిస్తా అని దేశం అంతా కాలికి స్పెషల్ ఫ్లయిట్ కట్టుకుని తిరిగింది బాబుగారు కదా? అది ఎవరి ఉచ్చులో పడి చేసిన పని? యుపి, బెంగాల్, బెంగళూరు, ఇలా ప్రతి స్టేట్ కు వెళ్లి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయమని జగన్ చెప్పారా?

సరే ఆ వైనం అలా వుంచుదాం. అంటే భాజపా అండ లేక బాబుగారు ఓడిపోయారన్నమాట. అంటే అంతకు ముందు గెల్చింది భాజాపా అండ తో అన్నమాట. అంటే ఎవరి అండా లేకుండా బాబుగారు గెలవలేరని అన్యాపదేశంగా ఈ వ్యాసంలో స్పష్టం చేస్తున్నారన్నమాట. 

''…చంద్రబాబు ఒంటరిగా మిగిలిపోయారు. ఫలితం ఏమిటో మనం చూశాం….'' అని వ్యాసంలో క్లియర్ గా రాసారు. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పొత్తులు లేని ఒంటరి పోరు చంద్రబాబు సాగించలేదు. ఆయనది కేవలం స్వంత బలం కాదు. మంది బలం అని జనాలు అంటుంటారు. ఇప్పుడు ఈ వ్యాసం కూడా అదే స్పష్టం చేస్తోంది. బహుశా అందుకే కావచ్చు. భాజపా అండ కోసమేనా బాబు గారు ఇప్పుడు పెరుగుతున్నపెట్రోలు ధరలు, గ్యాస్ ధరల గురించి అస్సలు మాట్లాడడం మానేసారు అని అనుకోవాలా?

ఇక వ్యాసంలోని మిగిలిన అంశాల సంగతి చూద్దాం…అవినీతికి కొత్త దారులను ప్రస్తావిస్తూ…''..లంచాలను నేరుగా తీసుకోకుండా ‘ఇందిరా ప్రతిభా ప్రతిష్ఠాన్‌’ అనే ట్రస్టును ఏర్పాటు చేసి దాని కోసం విరాళాలు సేకరించిన అంతూలే, ఆ తర్వాత పదవిని కోల్పోయారు…'' అని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆంధ్రలో కూడా మహామహులకు చెందిన ఇలాంటి ట్రస్ట్ లు వున్నాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటి వైనం కూడా రాసి వుండొచ్చుగా. ట్రస్ట్ లను వారసులకు వారసత్వంగా ఇచ్చి తాము ధ్యానం చేసుకుంటున్న పెద్దవాళ్ల గురించి ప్రస్తావించవచ్చు కదా.

అలాగే ఓ ఏరియాను ఎంచుకుని, అక్కడ తమ వాళ్ల చేత ఇబ్బడి ముబ్బడిగా కారు చౌక ధరలకు భూములు కొనిపించి, ఆ తరువాత అక్కడ అభివృద్ది అనే మంత్రాన్ని జపించి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగించి, లాభాలు చేసుకునే అనే మంత్రాన్ని కనిపెట్టిన వైనం కూడా ప్రస్తావించవచ్చు కదా..కేవలం జగన్ మీదనే గురిపెట్టడంలోనే ఈ మీడియా వ్యాసపు ఉద్దేశం తెలిసిపోతోంది. 

''దక్షిణాది రాష్ట్ర‌ల‌లో‌ ప్రభుత్వాలకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుంటుంది. దీంతో పాలకులు అవినీతికి పాల్పడటమే కాకుండా ప్రజల దృష్టి మరల్చడానికి విపరీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ మోడల్లో ఇప్పుడు దక్షిణాదిలోనే టాప్‌ ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఉన్నాడని చెప్పవచ్చు. అలవికాని సంక్షేమం కారణంగా రాష్ట్రం అప్పులపాలు అవుతున్నప్పటికీ పథకాల లబ్ధిదారులకు అవేమీ పట్టడంలేదు. ఒక వైపు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతూ మరోవైపు అప్పులు చేసి ప్రజలకు పంచి పెట్టడాన్నే మజ్జిగ మీకు మీగడ మాకు అంటారు…''

ఒకే పేరాలో ఎన్ని డబుల్ స్టేట్ మెంట్లు? ఆదాయం ఇబ్బడి ముబ్బడి అంట..కానీ రాష్ట్రం అప్పుల పాలు అవుతోందట. రాష్ట్రం అప్పుల పాలు అవుతోంది. అప్పులు చేస్తున్నారు. కానీ రాష్ట్ర సంపద కొల్ల గొడుతున్నారు. ..ఇది ఎలా సాధ్యం? ఏదో ఒకటే కదా నిజమయ్యేది. 

ఇలాంటిదే మరో డబుల్ స్టేట్ మెంట్ చూద్దాం.

''… నిజానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అధికార పార్టీకి అంత అనుకూలంగా ఏమీ లేవు. ..అధికారంతోపాటు డబ్బు కూడా పుష్కలంగా ఉన్నందున ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. అప్పులు చేసి పంచుతున్న సొమ్మును ఆయాచితంగా పొందుతున్న వారిలో అత్యధికులు మాత్రం జగన్‌కు ఇప్పటికీ అనుకూలంగానే ఉన్నారు..''

అనుకూలంగా లేవు అంటారు. కానీ వున్నాయంటారు…పరిస్థితులు బాలేవు అంటారు..కానీ జనం అనుకూలంగా వున్నారంటారు? ఏమిటీ ద్వైదీ భావన. అసలు ఎందుకీ డబుల్ స్టేట్ మెంట్లు? ఎందుకంటే జగన్ ను జనం ముందు దోషిగా నిలబెట్టడం కోసం.

చివరాఖరికి ఆర్కే నిర్వేదం చూద్దాం….''అవినీతిపరులకు అందలం లభించడమే కలియుగ ధర్మమని సర్దిచెప్పుకుందామా!!..'' అంటే జగన్ అవినీతిపరుడు అని ఓ బలమైన సర్టిఫికెట్ ను ఆర్కే జారీ చేసేసారు. జగన్ తప్ప ఈ రాష్ట్రంలో మరెవరూ అవినీతి పరులు కారు. బాబుగారు సచ్ఛీలురు. పాపం అమాయకంగా జగన్ ఉచ్చులో పడిపోయారు. ఒంటరి అయిపోయారు. ఇప్పుడు ఎలాగైనా ఆయనను మళ్లీ గద్దె ఎక్కించాలి. కానీ జనం సంక్షేమం అనే మత్తు మందుకు అలవాటు పడిపోయారు. జగన్ చూస్తే నానా దౌర్జన్యాలు చేస్తున్నారు. కింకర్తవ్యమ్…ఇదే ఈవారం ఆర్కే ఆవేదన.

ఆర్వీ

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే