సుకుమార్ సినిమాలంటే స్టయిలిష్‌గా, యాక్షన్ ప్రధానంగా వుంటాయనే పేరుంది. క్రియేటివ్ ఆలోచనలతో సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే సుకుమార్ చిత్రాలు సాధారణ మాస్‌కి అర్థమయ్యేలా వుండవనే కంప్లయింట్ కూడా వుంది. ఎన్టీఆర్‌లాంటి మాస్ హీరోతో కూడా 'నాన్నకు ప్రేమతో' అనే స్టయిలిష్ సినిమా తీసిన సుక్కూ దాంతో తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించలేకపోయాడు.
తనపై వున్న కంప్లయింట్ తెలిసి కరక్ట్ చేసుకున్నాడో లేక తనకీ మాస్ సినిమా తీయడం వచ్చని చూపిస్తున్నాడో కానీ 'రంగస్థలం' మాత్రం పూర్తి మాస్ సినిమాలా కనిపిస్తోంది. ఇంతవరకు విడుదలైన ప్రతి పాట మాస్‌ని టార్గెట్ చేసినట్టే వుంది. హీరో హీరోయిన్ల గెటప్‌లు, వారి మాటలు అన్నీ కూడా మాస్ రిలేట్ అయ్యేలా వున్నారు.
ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ చాలా ఎక్కువే వుంటుందని, ఫైట్లు చాలా నాటుగా మాస్ మెచ్చుకునేలా వుంటాయనే టాక్ వినిపిస్తోంది. బ్రదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ సరికొత్త సుకుమార్‌ని ఆవిష్కరిస్తుందట. కాకపోతే హీరోని చెవిటివాడిగా చూపిస్తూ తన మార్కు ప్రయోగాన్ని అయితే సుకుమార్ విడిచిపెట్టలేదు. మరి సుకుమార్ మాస్ మంత్రం రంగస్థలంని విజయ తీరం చేరుస్తుందా లేదా అనేది చూడాలి.