మొత్తానికి తాత అక్కినేని నాగేశ్వర రావు పాత్రను పోషించడానికి మనవడు నాగచైతన్యను ఒప్పించగలిగారు మహానటి నిర్మాతలు. చిరకాలంగా ఇదే సమస్యగా వుంది. ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ ను, ఎఎన్నార్ గా చైతన్యను తీసుకురావాలన్నది మహానటి నిర్మాతల కోరిక. కానీ జూనియర్ ఎన్టీఆర్ ససేమిరా అనేసాడు.
ఆ విషయంలో మార్పు లేదన్నాడు. కానీ చైతన్య మాత్రం, తాను రెడీనే కానీ ఎన్టీఆర్ ఓకె అంటేనే అని కండిషన్ పెట్టాడు. కానీ అది జరిగే పనిలా కనిపించలేదు. అందుకే చాలా ఆలోచనలు చేసారు. నాని, సూర్య ఇలా చాలా పేర్లు వినిపించాయి ఎన్టీఆర్ పాత్రకు.
ఆఖరికి డిజిటల్ చేద్దామని కూడా అనుకున్నారు. ఆఖరికి ఇప్పుడు చైతూ ఊ కొట్టాడని, మరో హీరో నాని కూడా ఎన్టీఆర్ గా కనిపించడానికి ఒకె అన్నాడని వార్తలు బయటకు వచ్చాయి. చిత్రమేమిటంటే, ఈ వార్తలు చూసి యూనిట్ వర్గాలే ఖంగుతినడం. ఎలా బయటకు వచ్చాయంటూ ఎదురు ఆరా తీయడం ప్రారంభమైంది.
అసలు మహానటికి సంబంధించిన వార్తలు అన్నీ అదే యూనిట్ కు చెందిన ఓ కీలక వ్యక్తే, తరచు తన మీడియా పరిచయాలతోనో, పరిచయాల కోసమో లీక్ చేస్తున్నారని గుసగుసలు వున్నాయి. ఆరంభంలో అంతా వదిలేసి, ఇప్పుడు చివర్న ఈ వార్త బయటకు వచ్చిందని హడావుడి చేయడం ప్రారంభించారట మహానటి నిర్మాతలు.