నేనే రాజు నేనే మంత్రి సినిమా ఓకె అనిపించేసుకోవడంతో దర్శకుడు తేజ మళ్లీ ట్రాక్ మీదకు వచ్చేసారు. ఏణ్ణర్థం కాలంగా చెక్కుతున్న స్క్రిప్ట్ ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది. షూటింగ్ ఇంకా ఫ్రారంభం కాలేదు. వెంకీ-శ్రియల కాంబినేషన్ మాత్రం సెట్ అయింది. మరో కొద్ది రోజుల్లో షూట్ ప్రారంభం అవుతందనగా వెంకీ లుక్ బయటకు వచ్చేసింది.
లుక్ ఎలా వుందన్న సంగతి పక్కన పెడితే, వెంకీ స్టయిలింగ్ అంతా ఓ మలయాళ సినిమాలో మోహన్ లాల్ స్టయిలింగ్ నుంచి ఎత్తుకొచ్చేసినట్లుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భుజాన బ్యాగ్, ఆ బియర్డ్, ఓవర్ కోట్ అంతా. ఒక్క కళ్లజోడు మాత్రం తేడా.
సరే, ఈ పోలికల సంగతి అలా వుంచితే, షూటింగ్ ప్రారంభించి, ఫస్ట్ లుక్ పేరిట సర్ప్రయిజ్ చేద్దామనుకుంటే, ఫోటోషూట్ నుంచి ఎవరో లీక్ చేసారని తెలిసి తేజ నిరుత్సాహానికి గురయ్యారట. ఎవరు, ఎలా లీక్ చేసారు అంటూ తన యూనిట్ మీద బుస్సమన్నారని టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో అసలు విషయం అది కాదు, తేజనే తన సన్నిహితులకు ఒపీనీయన్ కోసం పంపిస్తే, అక్కడ నుంచి ఫార్వార్డ్ అయిపోయిందని మరో గుసగుస వినిపిస్తోంది. అయినా ఇదిగో షూటింగ్.. అదిగో షూటింగ్ అంటూ నెలల తరబడి, అలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే వున్న సినిమాకు లీక్ అయితే మాత్రం వచ్చిన నష్టమేమిటి?