పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. కానీ సినిమా చేయడానికి కాదు, తన కోసం తయారుచేసుకున్న కథను వేరేవాళ్లతో వాడేసుకోవడానికి. అలాగే తన కోసం అలా వేచి వున్న దర్శకుడు వేరే సినిమా చేసుకోవడానికి. ఈ మేరకు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు ఏడాది కాలంగా సంతోష్ శ్రీనివాస్ చేత మాంచి స్క్రిప్ట్ తయారుచేయించారు. కానీ తీరా చూస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇప్పట్లో సినిమా చేసే ఆలోచనలో లేరు. అందువల్ల ఇటు దర్శకుడికి, అటు నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేసారట.
డైరక్టర్ ను వేరే వాళ్లతో సినిమా చేసుకోమని, మళ్లీ తాను సినిమాలు చేసేటపుడు చూద్దామని వివరించినట్లు బోగట్టా. స్క్రిప్ట్ మీద హక్కులు మైత్రీ మూవీ మేకర్స్ వి. అందువల్ల వాళ్లకు కూడా అలాగే చెప్పాడట. ఆ స్క్రిప్ట్ పవన్, రవితేజకు మాత్రమే సూటవుతుంది. కానీ ఇప్పుడు రవితేజతో శ్రీనువైట్ల కాంబోలో సినిమా చేస్తున్నారు. అందువల్ల ఇమ్మీడియట్ గా మరోటి చేయలేరు.
సంతోష్ శ్రీనివాస్ ఓ సినిమాను గోపీచంద్ తో చేయాలనుకుంటున్నారు. గోపీచంద్ కు బొగవిల్లి ప్రసాద్ తో అగ్రిమెంట్ వుందని తెలుస్తోంది. అందువల్ల ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వుంటుంది.
పవన్ మళ్లీ సినిమా ఆలోచన చేస్తే, మైత్రీ మూవీస్ సంస్థ అప్పుడు డైరక్టర్ కోసం, కథ కోసం ప్రయత్నిస్తుందన్నమాట.