cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఏ మంత్రం వేసావె

సినిమా రివ్యూ: ఏ మంత్రం వేసావె

రివ్యూ: ఏ మంత్రం వేసావె
రేటింగ్‌: 1/5
బ్యానర్‌: గోలిసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్‌
తారాగణం: విజయ్‌ దేవరకొండ, శివాని సింగ్‌ తదితరులు
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
సంగీతం: అబ్దుస్‌ సమద్‌
ఛాయాగ్రహణం: భూపేష్‌ ఆర్‌. భూపతి
కథ, కథనం, నిర్మాత, దర్శకత్వం: శ్రీధర్‌ మర్రి
విడుదల తేదీ: మార్చి 9, 2018

టెక్నాలజీకి మనిషి దాసోహమైపోయి జీవితాన్ని ఎంత మిస్‌ అవుతున్నాడో, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఫోన్‌, లాప్‌టాప్‌ స్క్రీన్లకి ఎంతగా అతుక్కుపోతున్నాడో, దాని వల్ల ఏమి కోల్పోతున్నాడో తెలియజెప్పడం ఈ సినిమా ముఖ్యోద్దేశం. వీడియో గేమ్స్‌కి అడిక్ట్‌ అయిపోయి యువత జీవితాన్ని కోల్పోతున్నారనేది ఈ చిత్రం ఇవ్వాలనుకున్న సందేశం. కాకపోతే ఈ సినిమా చూస్తున్నంతసేపు మొబైల్‌లో ఏదైనా గేమ్‌ ఆడుకోవాలని లేదా సోషల్‌ మీడియా బ్రౌజ్‌ చేయాలని అనిపించడం దురదృష్టకరం. 

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డితో స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండ నటుడిగా తప్పటడుగులు వేస్తోన్న సమయంలో టేకప్‌ చేసిన చిత్రమిది. సమాజానికి చిన్న సందేశం ఇద్దామనే దర్శకుడి ఆలోచన మంచిదే కానీ... 'మెసేజ్‌ ఇవ్వాలంటే ఎస్‌ఎంఎస్‌ పంపుకో' అంటూ ఇందులోనే ఒక డైలాగ్‌ వుండడం దర్శకుడే గుర్తించని ఐరనీ! ప్రతి ఫ్రేమ్‌లోను బడ్జెట్‌ లోటు లో క్వాలిటీ రూపంలో ఇబ్బంది పెడుతుంటే, విజయ్‌ మినహా నటన రాని సహ నటీనటులు క్లోజప్‌ షాట్స్‌లో తెల్లమొహాలు వేస్తుంటే... మొబైల్స్‌కి అతుక్కుపోకండి అంటూ దర్శకుడు ఇస్తోన్న సందేశాన్ని ఎలా సీరియస్‌గా తీసుకోగలం. తీసుకుని అంతసేపు ఈ నస ఎలా భరించగలం?

కథలోకి వెళితే.. నిఖిల్‌ (విజయ్‌) ఓ వీడియో గేమ్‌ అడిక్ట్‌. గంటల కొద్దీ గేమ్స్‌ ఆడుతూ అదే ప్రపంచంగా బతికేస్తుంటాడు. ఇంటర్నెట్‌లో అతనికి రాగ్స్‌ (శివాని) అనే యువతి తారసపడుతుంది. వీడియో గేమ్‌ డిజైనర్‌ అయిన రాగ్స్‌ తనని కలవడం కోసం నిఖిల్‌కి ఒక పరీక్ష పెడుతుంది. ఒక గేమ్‌ ఆడి తనని కనుక్కోమంటుంది. ఈ ప్రాసెస్‌లో ఆమె ఒక ప్రమాదంలో వుందని నిఖిల్‌కి తెలుస్తుంది. మరి ఆమెని అతను ఎలా కాపాడతాడు? తన అడిక్షన్‌ పోగొట్టుకుని మామూలు మనిషి ఎలా అవుతాడు?

వీడియో గేమ్స్‌, సోషల్‌ నెట్‌వర్క్‌, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వగైరా అంశాలతో సెట్టింగ్‌ అయితే ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. చెప్పాలనుకున్న మేటర్‌లోను స్టఫ్‌ వుంది. కాకపోతే కథని నడిపించిన విధానం గానీ, ఆలోచనలని తెరకెక్కించిన తీరుగానీ ఈ చిత్రం ఇంతకాలం వెలుగు చూడకపోవడానికి కారణాలేమిటనేది అనుక్షణం సుస్పష్టం చేస్తుంటాయి. సన్నివేశానికీ, సన్నివేశానికీ మధ్య సమన్వయం లేక, ఏ సందర్భంలో ఏ విధంగా రియాక్ట్‌ అవ్వాలనేది పాత్రధారులకి అంతు చిక్కక, పొంతన లేకుండా సమాంతరంగా సాగుతున్న మూడు త్రెడ్స్‌తో దేనికీ కనక్ట్‌ కాలేక ఓ విధంగా ఇది ప్రేక్షకులతో గేమ్‌ ఆడుకున్నట్టుగా తయారైంది.

బిగినర్స్‌ మిస్టేక్‌గా భావించి విజయ్‌ దేవరకొండ ఈ చిత్రం చేయడాన్ని అతని అభిమానులు ఓవర్‌ లుక్‌ చేసేయాల్సిందే. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని యువ హీరోలకి ఇలాంటి 'బ్యాక్‌లాగ్స్‌' వుండడం మామూలే. ఎప్పుడో అయిదేళ్ల క్రితం చేసిన ఈ సినిమా తర్వాత విజయ్‌ రైట్‌ ట్రాక్‌లోకి వచ్చేసాడు. ఎప్పుడో చేసిన మిస్టేక్‌ అతను ఎదుగుతోన్న దశలో ఎదురొచ్చి పరీక్ష పెట్టింది. అయితే కథల ఎంపికలో తనకంటూ ప్రత్యేకమైన అభిరుచి వుందనేది ఈ చిత్రంతోను ప్రూవ్‌ అయింది. స్ట్రాంగ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌, రైట్‌ డైరెక్టర్‌ వుంటే ఈ కాన్సెప్ట్‌ని ఆకర్షణీయంగా తెరకెక్కించే అవకాశముండేది.

నటుడిగా విజయ్‌ ఈ చిత్రంలోను బాగానే చేసాడు. తనతోటి యువ నటీనటులు అందరిలోను అంతో ఇంతో మెప్పించగలిగింది అతనొక్కడే. నటనలో ఓనమాలు రావన్నట్టు బేల చూపులతో హీరోయిన్‌ శివాని ప్రదర్శన చూస్తే విసుగొస్తుంది. టెక్నికల్‌గా ఈ చిత్రంలో ఏదీ మెప్పించేట్టు లేదు. లో బడ్జెట్‌ కారణంగా ప్రతి ఫ్రేమ్‌లోను వనరుల లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరీ అమెచ్యూర్స్‌ తీసిన షార్ట్‌ ఫిలిం తరహా క్వాలిటీతో వెలవెలబోయింది. సమాజానికి స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఇవ్వాలనే దర్శకుడి ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ తన ఆలోచనలకి తెర రూపం ఇవ్వగలిగే నైపుణ్యం, తను అనుకున్నది ఆసక్తికరంగా చెప్పగలిగే ప్రావీణ్యం కొరవడ్డాయి.

విజయ్‌ స్టార్‌ అయ్యాడు కనుక ఎప్పుడో మరుగున పడిన ఈ సినిమా ఇలా వెలుగు చూసిందని అనుకోవాలే తప్ప లేదంటే ఈ తరహా చిత్రీకరణతో అగమ్యగోచరంగా సాగిన చిత్రం వెలుగు చూడకుండా మిగిలిపోయిన ఎన్నో సినిమాలతో పాటు అలా చీకట్లో వుండిపోయేదే. నేషనల్‌ గేమింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రైజ్‌ గెలుచుకునే గేమ్‌ అసలు ఎలా వుండాలి? హీరోయిన్‌ కోసం హీరో అన్వేషిస్తుంటే అతనికి ఇచ్చే క్లూస్‌ కానీ, అతను వాటిని చేరుకునే విధానంగానీ ఆరంభంలో ఆమె డిజైన్‌ చేసిన గేమ్‌ చూసి ఎందుకూ పనికి రాని గేమ్‌ అంటూ తిట్టిన బాస్‌ మాటలు నిజమనేట్టే వున్నాయి. సినిమా కనుక, హీరోయిన్‌ గెలుస్తుంది కనుక ఈ గేమ్‌కి అవార్డ్‌ వస్తుంది కానీ లేదంటే ఇదే గేమ్‌ నిజంగా డిజైన్‌ చేసి ఏదైనా స్మార్ట్‌ ఫోన్‌కి ఎక్స్‌క్లూజివ్‌ రైట్స్‌ ఇచ్చినట్టయితే దెబ్బకి సేల్స్‌ నేలమట్టానికి పడిపోతాయి.

సినిమా అంతా ఒక ఎత్తు అయితే పతాక సన్నివేశాలు అర్థంలేనితనంలో ఒక మెట్టు పైనే వున్నాయి. ఆమాత్రం ప్రిడిక్ట్‌ చేయలేరని దర్శకుడు భావించి వున్నట్టయితే కనుక గ్రౌండ్‌ మధ్యలో నిలబడి హైడ్‌ అండ్‌ సీక్‌ ఆడినట్టే అనాలి. ఈ చిత్రానికి వెళ్లిన ప్రేక్షకులకి ఎదురయ్యే తలనొప్పి ఒక రేంజ్‌ అయితే, ఈ టైమ్‌లో ఇలాంటి పరీక్ష ఎదుర్కొనాల్సిన విజయ్‌ని తలచుకుని తన బాధతో పోలిస్తే మనదొక లెక్క కాదులెమ్మని సరిపెట్టుకోవాలి.

బాటమ్‌ లైన్‌: ఆడియన్స్‌తో వీడియో గేమ్‌!

- గణేష్‌ రావూరి