ఇటు అమరావతిలో అటు ఢిల్లీలో లాంఛనంగా రెండేసి రాజీనామాలు గురువారంనాడు చోటుచేసుకున్నాయి. మోడీ సర్కారులో ఉన్న తెలుగుదేశం మంత్రులు చంద్రబాబు సర్కారులో ఉన్న భారతీయ జనతా పార్టీ మంత్రులు మొత్తం నలుగురు ఒకేరోజు రాజీనామాలు సమర్పించారు.
అయితే తమాషా ఏంటంటే తెలుగుదేశం మంత్రులు మోడీని, భాజపా మంత్రులు చంద్రబాబును విపరీతంగా కీర్తించేశారు. తమకు అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాకపోతే ఇదంతా ఆయా ప్రభుత్వాల మీద నిరసనతోనే చేస్తున్నట్లుగా ఒక ప్రకటన కూడా చేశారు.
ఏదో ప్రజల ముందు తాము తగాదా పడుతున్నట్టుగా నటిస్తూ లోలోన మాత్రం భక్తి ప్రపత్తులు చూపిస్తున్నట్లుగా వారి వ్యవహారం కనిపిస్తోంది. ఇటు తెలుగుదేశానికి చెందిన కేంద్రమంత్రులు గానీ అటు భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు గానీ ఈ నాటకాలను ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు.
మంత్రి పదవులు వదులుకోవడమే తప్ప సంకీర్ణంలోంచి బయటకు రాకుండా ఎవరిని మోసం చేయదలచుకున్నారో తెలియడం లేదు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదనే అలకతో తెలుగుదేశం వారు రాజీనామాలు చేశారనుకుందాం… మరి చంద్రబాబు సర్కారు నుంచి కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు ఎందుకు తప్పుకున్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానం వారికైనా తెలుసో లేదో అంచనా వేయడం కష్టమే!
ఏదో తమ పార్టీ చెప్పింది కనుక రాజీనామా చేశాం అంటూ వారు అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికి వేస్తున్న ఎత్తుగడలుగా ఉన్నది తప్ప వారి చిత్తశుద్ధి మాత్రం తెలియడం లేదు. అందుకే వీరి ఆటలు చూసిన ప్రజలంతా… భలే రాజీనామాలు భజన కీర్తనారావాలు అన్నట్టుగా నవ్వుకుంటున్నారు.
ఇంతటి స్వామిభక్తిని ప్రదర్శిస్తూ తెలుగుదేశానికి చెందిన కేంద్రమంత్రులు రాజీనామాలు చేయడం చూస్తోంటే.. అసలు వీరికి మోడీ మీద పోరాడి రాష్ట్రానికి ఏమైనా సాధించగల సత్తా ఉన్నవారేనా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. వచ్చే ఎన్నికల దాకా ఇలా సాగదీసి.. మేం చేయగలిగిన త్యాగాలన్నీ చేశాం.. వారు ఇవ్వలే.. మేం ఏం చేయగలం? అంటూ ముక్తాయించే ఉద్దేశంతో ఉన్నారా? అని పలువురు సందేహిస్తున్నారు.
-కపిలముని