దాదాపు కులాల వారీగా తాయిలాలు ఇవ్వడం అన్నది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సర్వ సాధారణం అయిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా బిసిలు, కాపులు, అనేకానేక వెనుక బడిన తరగతులు, ఎస్ సిలు, ఎస్టీలు ఇలా కులాల వారీగా సహాయాలు, పథకాలు ప్రకటిస్తూ వస్తోంది. పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ వచ్చింది.
అలా ఏర్పాటయిందే బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా. కానీ చూస్తుంటే ఈ బడ్జెట్ లో ఆ కార్పొరేషన్ వ్యవహారం మరిచిపోయారేమో అనిపిస్తోంది. అందుబాటులో వున్న బడ్జెట్ పాఠం ఒకటికి రెండు సార్లు తిరగేసినా, ఎక్కడా బ్రాహ్మిణ్ కార్పొరేషన్ ఊసు కానీ, దానికి కేటాయింపుల ప్రస్తావన కానీ లేదు.
ఐవిఆర్ కృష్ణారావు ఆధ్వర్యంలో ఇది తొలిసారి ఏర్పాటయింది. కానీ ఆయనకు చంద్రబాబుకు, ముఖ్యంగా తెలుగుదేశం జనాలకు పొసగక, పక్కకు తప్పుకున్నారు. ఆ తరువాత వేమూరి ఆనంద సూర్య వచ్చారు. అప్పటి నుంచి కార్పొరేషన్ వ్యవహారాలు నత్త నడక నడుస్తున్నాయి.
ఇప్పటికే అర్చకులకు సంబంధించి పలు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి తోడు బడ్జెట్ లో బ్రాహ్మిన్ కార్పొరేషన్ కూడా విస్మరించినట్లు కనిపిస్తోంది. ప్రతి కులం ప్రస్తావని, నిధుల కేటాయింపు ఇంతో అంతో వుంది. ఆఖరికి హిజ్రాలకు కూడా కేటాయింపు కనిపించింది. కానీ బ్రాహ్మణులకు కేటాయింపు జాడ మాత్రం లేదు.
రెవెన్యూవ్యయం 1,50,270.99 కోట్లు
బడ్జెట్ టోటల్ స్వరూపం 1,91,063.61 కోట్లు అయితే అందులో రెవెన్యూ వ్యయమే 1,50,270.99 కోట్లు. అంటే ఇదంతా పాలనా పరమైన వ్యయమే. రెవెన్యూ వ్యయం 19.35 మేరకు పెరిగింది అంటే, ఖర్చులు ఏ రేంజ్ లో వున్నయో అర్థం అవుతుంది. ఇక మిగిలింది ఏమైనా వుందీ అంటే అది 28,678.49 కోట్లు మాత్రమే. ఇందులో సంక్షేమ పథకాలకే సింహభాగం పోతుంది.
అభివృద్ధి పథకాలకు దక్కేది అంతంత మాత్రమే. పైగా ఆర్థిక లోటు 24,205.21 కోట్లు వుంది. అదీ కాక కేంద్రం నుంచి ప్యాకేజ్ పరంగా వచ్చే నిధులను అంచనా వేసి ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి చెప్పకనే చెప్పారు. అంటే అక్కడ నుంచి నిధుల విడుదల తేడా వస్తే, ఆర్థిక లోటు పెరిగే అవకాశం వుంది. అప్పుడు కచ్చితంగా కత్తెర పడేది ఈ కేపిటల్ వ్యయం అనే ప్రణాళిక వ్యయం పైనే. సహజంగా ప్రతి బడ్జెట్ విషయంలో అది తెలుస్తూనే వుంటుంది.
ఆ విషయాలు ఏవీ?
సాధారణంగా బడ్జెట్ లో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం లాంటి పదాలు వాడతారు. కానీ ఈ బడ్జెట్ లో కేపిటల్ వ్యయం, రెవెన్యూ వ్యయం లాంటి పదాలు కనిపించాయి. పైగా సవరించిన అంచనాల బడ్జెట్ వివరాలు ఎక్కడా కానరావడం లేదు. సభ్యులకు సర్క్యులేట్ చేసారో లేదో కానీ, మీడియాలో వుంచిన పూర్తి పీడీఎఫ్ కాపీల, పూర్తి పాఠంలో ఎక్కడా సవరించిన అంచనాలు కనిపించలేదు. అవి వుంటే గత బడ్జెట్ సారాశం అనలైజ్ చేయడానికి అవకాశం వుండేది.
సందట్లో సడేమియా
ఓ పక్క కేంద్రమంత్రుల రాజీనామా, ప్రత్యేక హోదా హోరు, మరోపక్క అసెంబ్లీకి ప్రతిపక్షం డుమ్మా ఈ హోరు మధ్య బడ్జెట్ వచ్చేసింది. ఏదో డిస్కషన్ అంటూ వుంటుంది. పాస్ అయిపోతుంది. అంతే.