తొమ్మిదేళ్లు.. తొమ్మిది కోట్లు

అష్టా చెమ్మా విడుదలైన రోజులు. ఎవ్వరూ కాస్త కూడా అంచనా వేసి వుండరు. ఆ సినిమాలో ఓ హీరోగా నటించిన కొత్త కుర్రాడు జస్ట్ తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే స్థాయికి…

అష్టా చెమ్మా విడుదలైన రోజులు. ఎవ్వరూ కాస్త కూడా అంచనా వేసి వుండరు. ఆ సినిమాలో ఓ హీరోగా నటించిన కొత్త కుర్రాడు జస్ట్ తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే స్థాయికి ఎదుగుతాడని. ఎందుకంటే ఆ హీరోకి ఇండస్ట్రీ బ్యాక్ గ్రవుండ్ లేదు. జస్ట్ పరిచయాలు మాత్రమే వున్నాయి. అదికూడా డైరక్షన్ విభాగంలో పని చేయడం ద్వారా సంపాదించుకున్నవి.

నిజానికి 2008లో అష్టా చెమ్మా విడుదలయినపుడు నాని కన్నా ఎక్కువ మంది అవసరాల శ్రీనివాస్ నే లైక్ చేసారు. ఎందుకంటే అతగాడి కామెడీ టైమింగ్, ఆ పాత్ర, ఆ డైలాగులు అన్నీ అలా సెట్ అయ్యాయి. కానీ సీన్ మాత్రం రివర్స్ అయింది.

అవసరాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డైరక్టర్ గా సెటిలయ్యారు. నాని హీరో అయ్యాడు. అప్పటికే స్టార్ హీరో అయిన మహేష్ బాబు పేరు చుట్టూ అల్లిన కథ అది. కానీ ఆ పాత్ర వేసిన హీరో పేరు మాత్రం నాని. గతంలో మహేష్ కూడా నాని పేరుతో ఓ సినిమా చేయడం భలే కో ఇన్సిడెంట్.

అలా స్టార్ట్ అయిన హీరో నాని ప్రస్థానం తొమ్మిదేళ్లు దాటేసరికి తొమ్మిది మంది ప్రొడ్యూసర్లు లైన్లో వుండేంత లెవెల్ కు చేరింది. కెరీర్ ప్రారంభించిన మూడేళ్లలో అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ సినిమాలు నాని ని హీరోగా ఫిక్స్ చేసేసాయి.

మరో మూడేళ్లకు వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్ సినిమాను నానిని నూటికి నూరు శాతం నమ్ముకోదగిన హీరోను చేసాయి. మధ్యలో నాని వేసిన మాస్ తప్పటడుగులు కాస్త దెబ్బ తీసినా, భలేభలే మగాడివోయ్ అతని కెరీర్ నే మలుపుతిప్పేసింది.

గత ఏడాది చేసిన నేను లోకల్, నిన్నుకోరి, ఎంసిఎ సినిమాలు నాని స్టామినా ఏమిటో చెప్పేసాయి. ఇంకేముంది. నాని ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. నాని మీద యాభై కోట్లకు పైగా పెట్టకపోవచ్చు. కానీ వంద కోట్ల సినిమాలు తీసుకురాని లాభాలు నాని సినిమాలు తీసుకువస్తున్నాయి.

సాధారణంగా టాలీవుడ్ లో ఇంటిపేర్లు, వంశాలు, చరిత్రలు, రక్తాలు చెప్పుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ కు వారసత్వపు హక్కుగా సంపాదించుకుంటూ వస్తున్నారు తప్ప, తమంతట తాము ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరోలు తక్కువ. ఇప్పుడు నాని అలాంటి హీరో గా మారాడు.

చకచకా సినిమాలు చేయడం, కోట్లకు కోట్లు అడ్వాన్స్ లు తీసుకుని, నిర్మాతలను అయోమయంలో వుంచకుండా సినిమా స్టార్ట్ చేసినపుడే తీసుకోవడం, మూడు నెలలకు మించి ఏ సినిమాను పెండింగ్ లో వుంచకపోవడం, కథ, స్క్రిప్ట్ సరిగ్గా కుదరకపోతే బ్యానర్ ను, డైరక్టర్ ను సైతం వదులుకోవడం, వీలయినంత ఒదిగి వుండడం, ఇండస్ట్రీలో అందరివాడు అనిపించుకోవడం వంటి లక్షణాలతో నాని ఓ హీరోగా ఎదిగాడు. మామూలు హీరోగా కాదు స్టార్ హీరోగా.

ముఫై నాలుగేళ్ల వయసులో ఇప్పుడు నాని స్టార్ హీరో కనీసం హీరోగా మరో ఆరేళ్లయినా చేసే వయసు వుంది. సరైన సినిమాలు చేసుకుంటూ వెళ్లే, సూపర్ స్టార్ కావడం పెద్ద కష్టం కాదు. అది కూడా వారసత్వంగా కాకుండా స్వంతంగా సంపాదించుకోవడం. గ్రేట్ నే.