ఏమిటీ క్యూబ్? ఏమిటీ గొడవ?

టాలీవుడ్ బంద్. మార్చి 1నుంచి థియేటర్ల మూత. సినిమాలు వుండవు. ఈ విషయం నెల రోజుల నుంచి వినిపిస్తున్నా, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సినిమారంగం స్ట్రయిక్, బంద్ అన్నది గతంలో కూడా ఒకటి…

టాలీవుడ్ బంద్. మార్చి 1నుంచి థియేటర్ల మూత. సినిమాలు వుండవు. ఈ విషయం నెల రోజుల నుంచి వినిపిస్తున్నా, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సినిమారంగం స్ట్రయిక్, బంద్ అన్నది గతంలో కూడా ఒకటి రెండు సార్లు వినిపించినా, జరిగిన దాఖలాలు పెద్దగా లేవు. అందుకే అందరూ లైట్ తీసుకున్నారు.

కానీ నిన్న చర్చలు విఫలమయ్యాయి. బంద్ పక్కా అనగానే అందరి దృష్టి అటు మళ్లింది. అయితే ఇప్పటికీ అసలు సమస్య సాధారణ జనాలకు అంతగా తెలియదు. ఏదో చార్జీలు ఎక్కువ వున్నాయి. తగ్గించమని గొడవ చేస్తున్నారు అనుకుంటున్నారంతే. కానీ అసలు విషయం చాలా వుంది.

ప్రింట్ ప్లేస్ లో

ఒకప్పుడు ప్రింట్ లు వుండేవి. సినిమా హక్కులు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు ఇన్ని ప్రింట్ లు అని కొనుక్కుని, తమ తమ ఏరియాలో వేసుకునేవారు. తరువాత డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ప్రింట్ లు మాయం అయ్యాయి. అప్పుడు క్యూబ్, యుఎఫ్ఓ ఇలా పలువురు సర్వీస్ ప్రొవైడర్లు వచ్చారు. వీళ్లు థియేటర్లకు తమ సర్వీస్ అందించే విధంగా అగ్రిమెంట్ లు చేసుకున్నారు.

సో, ఇప్పుడు ఫిల్మ్ బదులు అప్ లోడ్, డౌన్ లోడ్ చార్జెస్, అడిషనల్ గా కాస్త సర్వీస్ చార్జెస్ మాత్రం వసూలు చేయాల్సి వుంది. విదేశాల్లో ఇదే విధానం వుంది. కానీ ఇక్కడే ఓ మతలబు జరిగిపోయింది. థియేటర్లు లీజు విధానంతో చేతిలో పెట్టుకున్న మాదిరిగానే డిజిటల్ విధానం అమలులోనే ఇద్దరు ముగ్గురు పెద్దలు థియేటర్లను తమ చేతుల్లో వుండేలా చేసుకున్నారు.

అదెలా అంటే డిజిటల్ సర్వీస్ కు అనుగుణంగా థియేటర్ల ప్రొజెక్షన్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సివుంది. అదెవరు చేసుకోవాలి. థియేటర్ల ఓనర్లు చేసుకోవాలి. దానికి కాస్త ఖర్చవుతుంది. అక్కడే అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు లాంటి వాళ్లు ఎంటర్ అయ్యారు. తమ డబ్బును థియేటర్లకు పెట్టుబడిగా పెట్టి, వాళ్ల ప్రొజెక్షన్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసారు. సో, ఆ డబ్బు రికవరీ కావాలి. అందుకోసం క్యూబ్ చార్జీల్లో కొంత మొత్తాన్ని అదనంగా చేర్చేలా చేసారు. అంటే అప్ లోడ్, డౌన్ లోడ్, సర్వీస్ చార్జీలతో పాటు ఈ థియేటర్ ఎక్విప్ మెంట్ అప్ గ్రేడ్ ఎక్స్ పెండిచర్ ఇన్ స్టాల్ మెంట్ అన్నమాట.

అంటే డిస్ట్రిబ్యూటర్ క్యూబ్ చార్జీల పేరిట చెల్లించే మొత్తంలో ఈ వాయిదా మొత్తం థియేటర్లకు వెళ్లి, అక్కడి నుంచి పెట్టుబడి పెట్టిన అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి వారికి చేరుతుంది. ఇదెలా తయారైంది అంటే, జాతీయ రహదారుల టోల్ గేట్ వ్యవహారం మాదిరిగా. అలా వసూలు చేస్తూనే వుంటారు. రోడ్లు వేసినందుకు అయిన ఖర్చు రికవరీ అయిపోయినా. ఇక్కడ కూడా అంతే. థియేటర్ల ప్రొజెక్షన్ ఎక్విప్ మెంట్ అప్ గ్రేడేషన్ ఖర్చు ఎంతో ఎవరికీ తెలియదు. అలా రికవరీ చేస్తూనే వుంటారు.

ఇది చాలా అన్యాయం కదా?

ఎందుకు అన్యాయం. థియేటర్లను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? థియేటర్ల వాళ్లది. కుర్చీలు, రంగులు, తెర, అన్నీ వాళ్ల బాధ్యత కదా? అలాగే ప్రొజెక్షన్ సిస్టమ్ అప్ గ్రేడేషన్. మరి దానికి అరవింద్, సురేష్ బాబు లాంటి వాళ్ల దగ్గర నుంచి సహాయం పొంది, వాళ్లకు కట్టడం వరకు ఒకె. కానీ దానిని ఎగ్జిబిటర్ ల దగ్గర నుంచి వసూలు చేయడం ఏమిటి? ఇదీ అసలు సమస్య. ఇక్కడే చర్చలు విఫలం అయింది.

సర్వీస్ ప్రొవైడర్లు ఏమంటున్నారు?

సర్వీస్ ప్రొవైడర్లు రకరకాల ప్యాకేజీల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు. వన్ వీక్ అయితే ఇంత. అడిషనల్ వీక్ అయితే ఇంత. ఫుల్ రన్ అంటే అన్ లిమిటెడ్ అయితే ఇంత? అలా అన్నమాట. ఆ చార్జీలను 8శాతం తగ్గించడానికి సర్వీస్ ప్రొవైడర్లు నిన్న బెంగళూరులో జరిగిన చర్చల్లో అంగీకరించారు. కానీ ఎగ్జిబిటర్లు అది అడగడం లేదు. అసలు ఎన్నాళ్లు ఇంకా ఈ థియేటర్ ప్రొజెక్షన్ ఎక్విప్ మెంట్ వాయిదాలు వసూలు చేస్తారు? అసలు అవి తామెందుకు భరించాలి అన్నది  అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు.

ఉద్యమానికి తూట్లు

అయిదు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణకు చెందిన చిత్ర పరిశ్రమలు ఒక తాటిపైకి వచ్చి బంద్ దిశగా నడవడం చాలా అరుదైన విషయం. ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చి, పెద్దల ఆదాయానికి తూట్లు పడే ప్రమాదం వస్తోంది. అలాగే థియేటర్లకు ఆదాయం పడిపోతుంది. వాయిదాలు వాళ్లు కట్టాల్సి వస్తుంది. ఉద్యమం విజయవంతం అయితే.

అందుకే ఏదో విధంగా ఎంతో కొంతశాతం డిస్కౌంట్ చూపించి, ఎలాగోలా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు తెరవెనుక అప్పుడే ప్రారంభమైనట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కానీ పట్టు వదిలితే, ఇక మళ్లీ ఇంతటి పరిస్థితి అయితే రావడం కష్టం. అందుకే ఉద్యమానికి తూట్లు పొడవాలని ప్రయత్నించేవారిని ఒక కంట కనిపెట్టాలని ఇండస్ట్రీలోని చిన్న నిర్మాతలు గట్టిగా కోరుతున్నారు.