ఎమ్బీయస్‌: బిజెపి-టిడిపి-వైసిపి మూడుముక్కలాట

ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో పై మూడు పార్టీలు ఎందుకు విఫలమవుతున్నాయో నా కర్థమైనంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం దేశంలో ఇష్టారాజ్యం, మోదీకి పట్టం అన్నట్లు నడుస్తోంది. అతను ఏం తలచుకుంటే అదే చేస్తున్నాడు.…

ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో పై మూడు పార్టీలు ఎందుకు విఫలమవుతున్నాయో నా కర్థమైనంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం దేశంలో ఇష్టారాజ్యం, మోదీకి పట్టం అన్నట్లు నడుస్తోంది. అతను ఏం తలచుకుంటే అదే చేస్తున్నాడు. అదేమని అడిగే నాథుడు లేడు. దేశపు ఫెడరల్‌ విధానం విచ్ఛిన్నమవుతోంది, అధికారమంతా కేంద్రం దగ్గర పోగుపడుతోంది. ప్లానింగ్‌ కమిషన్‌ లేదు. ఫైనాన్సు కమిషన్‌ సిఫార్సులు పట్టించుకోనక్కరలేదు. న్యాయంగా రావలసినవి కూడా రాష్ట్రాలకు యివ్వడు. రాజకీయ అవసరాల బట్టే పద్మశ్రీలు, బజెట్‌ కేటాయింపులు. కేంద్ర నిధుల విడుదలకు సరైన మెకానిజం లేదు.

బిహార్‌లో ఎన్నికలకు ముందు ప్రామిస్‌ చేసినది ఓడిపోయాక యివ్వలేదు, ఇప్పుడు త్రిపురకు హామీలు, ఓడిపోతే యివ్వడు, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షత, ఎన్నికలు రాబోతున్న కర్ణాటకలో మాత్రం మెట్రోకు భారీ నిధులు, తెలుగు రాష్ట్రాలకు బజెట్‌లో మొండిచెయ్యి, బజెట్‌లో లేకపోయినా తాజాగా గుజరాత్‌లో ఫార్మాకు, బుందేల్‌ఖండ్‌కు చెరో ఇరవయ్యేసి వేల కోట్లు, కూటమిలో భాగస్వామి యైన ముఖ్యమంత్రికి 14 నెలలకు ఎపాయింట్‌మెంటు, కేసుల్లో నిందితులైన ఆయన ప్రత్యర్థికి మాత్రం ఏడాదిలో రెండుసార్లు.., కేంద్రమంత్రులకు సైతం స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ లేదు.

అంతా ప్రధాని కార్యాలయం కనుసన్నలలోనే. దేశంలో మంచి జరిగినా, చెడు జరిగినా అంతా మోదీకే చెందే విధంగా ఏకపక్ష పాలన నడుస్తోంది. సిబిఐ, ఐటి వంటి ప్రభుత్వ శాఖలే కాదు, మీడియా, న్యాయవ్యవస్థ కూడా అతనికి వంత పాడుతున్నాయి. అమిత్‌ షా, అనుచరులపై కేసులు ఎగిరిపోతున్నాయి. ఎగరకొట్టడానికి ఒప్పుకోని న్యాయమూర్తులు ఎగిరిపోతున్నారు. తలచుకుంటే ఎవరినైనా పాతాళానికి తొక్కేయగలడు. దాసోహమంటే 2 జి స్కాము వంటి దాన్నయినా హుష్‌ కాకీ చేసేయగలడు. మూలవిరాట్టయిన జయలలితను భద్రంగా కాపాడి, రాచమర్యాదలతో సాగనంపి ఉత్సవ విగ్రహమైన శశికళను మాత్రం అణచివేయగలడు. 

ప్రజాస్వామ్యం పేరిట యిలాటి నియంతృత్వం గతంలో లేదా అంటే కొంతకాలం పాటు ఇందిర యిలా చేసినమాట వాస్తవం. కొన్ని రాష్ట్రాలలో కొందరు యిలా చలాయించిన మాటా వాస్తవమే. అయితే వీళ్లందరూ ఒక కనబడని లక్ష్మణరేఖ లోపునే వ్యవహరించారు. తామూ తప్పులు చేస్తున్నాం కదా, రేపు మనం గద్దె దిగి అవతలివాడు అధికారంలోకి వస్తే మనను పీడించగలడు, అందువలన కొంతమేరకు చూసీ చూడనట్లు పోదాం అనే ఆలోచన వారిలో ఉండేది. రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఎన్నికల సభల్లో సవాళ్లు విసురుతారు. కానీ కోర్టులకు వెళ్లరు.

తాము అధికారంలోకి వస్తే గత పాలకుల నిర్ణయాలపై విచారణ కమిషన్లు వేస్తామని వాగ్దానం చేస్తారు. నెగ్గాక ప్రజలే వారిని శిక్షించారు అంటూ ఊరుకుంటారు. ఒక పరస్పర రక్షణావలయంలోనే యీ క్రీడ నడుస్త్తుంది. అయితే మోదీ అలాటి మొహమాటాలు పెట్టుకోవటం లేదు. ఇప్పట్లో తాను దిగే ప్రశ్నే లేదు, అవతలివాడు ఏమనుకున్నా బేఫికర్‌, చేద్దామనుకున్నది చేసేయడమే అనే ధోరణిలో వెళ్లిపోతున్నాడు. దీని వలన పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని అనర్థాలూ జరుగుతున్నాయి. వాటిపైన కినిసిన సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయం కనబడినప్పుడు మోదీకి ఎదురు తిరుగుతున్నారు.

కానీ ఆ ధైర్యం ప్రతిపక్ష నాయకులకు ఉండటం లేదు. గట్టిగా ఏదైనా అంటే కేసులు పెట్టి వేధిస్తాడేమోనని భయం. అరవింద్‌ కేజ్రీవాల్‌ కథ కళ్లముందు తారాడుతూంటే ఎవరికి ఆ ధైర్యం ఉంటుంది? పైగా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారంటే ఎంతో కొంత 'రక్తచరిత్ర' ఉండకుండా ఉండదు. మోదీ విధానం వలన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా నశిస్తోందని, దీర్ఘకాలంలో యిది పార్టీకి చెఱుపు చేస్తుందని సణిగే పార్టీ నాయకులు సైతం నోరెత్తలేని స్థితిలో ఉన్నారు.

ఆంధ్ర విషయానికి వస్తే మోదీ అన్యాయం చేసిన మాట తూర్పున సూర్యుడుదయిస్తాడన్నంత వాస్తవం. వాగ్దానాలు నిలబెట్టుకోలేదు. చట్టంలో ఉన్నవి కూడా యివ్వలేదు. ఉమ్మడి ఆస్తుల విభజనలో, నీటి పంపకాల్లో, బజెట్‌ కేటాయింపుల్లో అన్యాయం చేశాడు, చేస్తున్నాడు. దీన్ని ఎదిరించవలసిన ప్రాంతీయపార్టీలు టిడిపి, వైసిపి ఎదిరిస్తున్నాయా? ఎదిరించగలవా? లేదు. కారణం ఏమిటంటే – టిడిపి, వైసిపి రెండూ కేంద్రంలో ఉన్న పార్టీతో బంధం వదులుకోవు. ఎదుటివాళ్లు వదిలేస్తే ఆ చోటులోకి తాము దూరదామని చూస్తాయి.

గోతికాడ నక్కలా ఒకరుంటే, ఛీత్కరించబడుతున్నా గొయ్యి వదలని నక్కలా మరొకరుంటారు. కారణం ఏమిటి? ఇదిగో పైన చెప్పిన వాస్తవ పరిస్థితే. చుట్టూ ప్రజలుంటే కేంద్రంలో ఉన్న పార్టీదేముంది? అనుకున్న జగన్‌కు సోనియా గుణపాఠం నేర్పింది. 'మీ అత్తగారు పోతే మీ ఆయన ప్రధాని కాలేదా? మా నాన్న పోతే నేను ముఖ్యమంత్రి కాకూడదా?' అని అడిగినందుకు 'నీకూ, నాకూ సాపత్యమా?' అని తడాఖా చూపింది. కేసులు మోపి,  శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపింది. ఏళ్లూ, పూళ్లూ అయినా ఒక్క కేసూ తేలలేదు కానీ 16 నెలల పాటు జైలుకూడు తినిపించింది. దెబ్బకు జగన్‌కు కేంద్రం మహిమ తెలిసివచ్చింది. ఇప్పుడు మోదీని ఏమీ అనకుండా జాగ్రత్తపడుతున్నాడు. బజెట్‌లో ఆంధ్రకు కేటాయింపులు జరక్కపోతే అన్యాయం చేశాడని మోదీని నిందించడు, గట్టిగా అడిగి సాధించలేదని చంద్రబాబును తిడతాడు.

మొన్న బజెట్‌ని ఏ పార్టీ కూడా పెద్దగా మెచ్చుకోలేదు. కానీ ''సాక్షి'' మొదటి పేజీ చూస్తే మాత్రం కళ్లు తిరుగుతాయి. జేట్లే అర్జునుడట, మోదీ కృష్ణుడట. ఇక బజెట్‌లో ప్రతిపక్షాలను ఎదుర్కునే గాండీవాలు, పాశుపతాలు, అంజలీకాలు, బ్రహ్మాస్త్రాలు ఎన్నో ఉన్నాయట. బిజెపి, ఆరెస్సెస్‌ పత్రికలు కూడా అంత రాసి ఉండవు. అంత రాసినా మోదీ ఈడీ కత్తిని జగన్‌పై వేళ్లాడదీసే ఉంచాడు. తాజా నోటీసులు వస్తూనే ఉన్నాయి. పాదయాత్రలో శుక్రవార విరామాలు తప్పటం లేదు. ఇలాటి పరిస్థితుల్లో కేంద్రాన్ని ఎదిరించి జగన్‌ పోరాడుతాడనుకోవడం భ్రమ.

మోదీ దాకా ఎందుకు? కెసియార్‌ను అనగలడా? నిజం చెప్పాలంటే విభజనకు ముందు కూడా కెసియార్‌తో పెద్దగా పేచీ పెట్టుకోలేదు. అదే విషయాన్ని పవన్‌ బహిరంగసభల్లో ఎత్తి చూపాడు. ఇప్పుడు అదే పవన్‌ కెసియార్‌తో సఖ్యం నెరపుతున్నాడు. ఉమ్మడి ఆస్తులతో కట్టిన పుట్టలను యిప్పుడు కెసియార్‌ ఆక్రమించుకున్నా ఆంధ్ర నాయకులెవ్వరూ కిమ్మనటం లేదు. ఎందుకు? అందరికీ హైదరాబాదులో ఆస్తులున్నాయి. కెసియార్‌ను విమర్శిస్తే అక్కడి 'కొంప' మునుగుతుందేమోనని భయం. ఇలాటివారు ఆంధ్రులను రక్షించగలమని నమ్మగలమా? రక్షిస్తానని నమ్మించి అధికారం చేజిక్కించుకున్న బాబు హైదరాబాదులో ఆస్తులను, ఉమ్మడి రాజధాని హక్కులను వదులుకుని పారిపోయేట్లా చేసింది ఆయన చేసిన ఒక ఘోరతప్పిదం.

ఒక ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీ పరంగా రాష్ట్రాన్నే వదులుకోవలసి వచ్చింది, రాష్ట్రపరంగా ఆంధ్రుల హక్కులను వదులుకోవలసి వచ్చింది. పైగా రేవంత్‌ కేసును ఎప్పుడు ఎలా తిప్పుతారోనన్న భయం వెంటాడుతూనే ఉంది. పొరుగు ముఖ్యమంత్రితోనే వ్యవహారం యిలా వుంటే, యిక ఘటనాఘటన సమర్థుడైన మోదీతో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అతను తలచుకుంటే సమాధి అయిపోయిన బోఫోర్స్‌ను కూడా లేపుతున్నాడు.  పట్టిసీమ, పోలవరం, అమరావతి కాంట్రాక్టుల్లో తలచుకుంటే ఏదో ఒకటి దొరక్కపోతుందా? నిరూపించడం సంగతి అవతల చూసుకోవచ్చు. ముందు కేసులు బుక్‌ చేసేస్తే యిక అవస్థలే అవస్థలు.  

ఈ భయాలు వెంటాడుతున్నాయి కాబట్టే బాబు బిజెపి చేస్తున్న అవమానాలను దిగమింగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పున ఘనుడాయన. లెఫ్ట్‌, రైట్‌, సెంటర్‌ ఏ పార్టీ వాళ్లతోనైనా సరే, ముఖాముఖీ మాట్లాడగల స్థాయి ఆయనది. రేపు మూడో ఫ్రంటు ఏర్పడితే మీరేమంటారు? అని ఆయన్నే పలకరిస్తారు వాళ్లు. ఇన్ని ఉండి కూడా బిజెపి కరివేపాకులా తీసి పారేస్తూ ఉంటే, అది బాహాటంగా అందరికీ తెలిసేట్లా ప్రవర్తిస్తూ ఉంటే ఊరకుండవలసి వస్తోంది. బజెట్‌లో ఆంధ్రకు అన్యాయం జరిగితే పాలకపక్షం, ప్రతిపక్షం కలిసి కేంద్రాన్ని విమర్శించే పరిస్థితి లేదు. నువ్వు మెచ్చుకున్నావు అని ఒకరు, నువ్వు మౌనంగా ఉన్నావు అని మరొకరు ఒకరినొకరు నిందించుకుంటూ కూర్చున్నారు.

అయినా కేంద్రంలో బిజెపి బాబు అంటే పడిఛస్తోందన్న బిల్డప్‌ యిస్తూ ఉంటుంది స్థానిక మీడియా. ప్రత్యేక ప్యాకేజీ ఇలా ఉంటోంది, అలా ఉంటోంది అని ఉత్తుత్తి కథనాలతో చాలాకాలం లాక్కుని వచ్చారు. తాజాగా బజెట్‌పై బాబు అసంతృప్తి గమనించి, అమిత్‌ షా ఫోన్‌ చేసి బుజ్జగించారు అనే లీకు వచ్చింది. అలాటిదేమీ లేదని బిజెపి వర్గాలు వెంటనే స్పష్టీకరించాయి. 14 నెలలపాటు ముఖ్యమంత్రికి ఎపాయింట్‌మెంట్‌ యివ్వకుండా 'వి డోంట్‌ కేర్‌' అని వాళ్లు కుండబద్దలు కొట్టి చెపుతున్నారు. అదే బాబుని యిరకాటంలోకి నెడుతోంది. ఎన్నికలు దగ్గర పడిపోయాయి. ఏ పనీ కాలేదు. ప్రజలకు ఏం సంజాయిషీ చెప్పాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. 

దీన్నే జగన్‌ ఉపయోగించుకుంటున్నాడు. ప్యాకేజీ జోలపాట పాడి ప్రత్యేక హోదా గురించి ప్రజలు మర్చిపోయేలా టిడిపి జోకొడుతూ ఉంటే జగన్‌ మాత్రం హోదాహోదా అని రొద పెడుతూ, దానివలన కలిగే ప్రయోజనాలు వల్లిస్తూ ప్రజలు మర్చిపోకుండా చేస్తున్నాడు. దీన్నుంచి తప్పించుకోవడానికి బాబు పోరాటవీరుడి అవతారం ఎత్తవలసి వచ్చింది. బజెట్‌ కేటాయింపుల్లో అన్యాయం గురించి కాకుండా, హోదా గురించి కాకుండా ప్యాకేజీ, కేంద్ర నిధుల విడుదల గురించి పల్లవి ఎత్తుకున్నారు. వీళ్లు ఎత్తుకోగానే అటు బిజెపి తరుముకూత పట్టినట్లు అనేక గణాంకాలు వల్లించి, తప్పంతా టిడిపిదే అనసాగింది. ఇక బాబు పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి తెచ్చారు. బజెట్‌, హోదా వదిలిపెట్టి, కేవలం నిధుల విడుదల గురించే మాట్లాడాలన్న సిలబస్‌తో పవన్‌ ఉపక్రమించారు.

నిజనిర్ధారణ కమిటీ అన్నారు. దానికి విశ్వసనీయత చేకూర్చడానికి జెపి, ఉండవల్లి, పద్మనాభయ్యగారు, ఐవైఆర్‌ యిత్యాదులను ఆహ్వానించారు. 'ఇస్తానన్న నిధులు యివ్వలేదు, బిజెపియే దోషి' అని అనే కన్‌క్లూజన్‌కు రప్పించడానికి వేసుకున్న ఎజెండా సరిగ్గా సాగలేదు. వచ్చిన వక్తల్లో కొందరు ఆ నిధులను రాష్ట్రప్రభుత్వం ఎలా వినియోగించిందో, వినియోగించిన దానికి బిల్లులు సమర్పించిందో లేదో పరిశీలించి నివేదిక యివ్వాలన్నారు. అది జెపికి రుచించలేదు. చంద్రశేఖర్‌గారు ఆ మాట ఎత్తగానే 'అది మనం చూడనక్కరలేదు' అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల వినియోగం గురించి రాష్ట్రం కాగ్‌కు, అసెంబ్లీకి జవాబుదారీ కాబట్టి మనం దాని జోలికి వెళ్లనక్కరలేదు అని ఆయన వాదన.

జెపి గారితో యిదే చిక్కు. తను చూడాలనుకున్నదే ఆయన చూస్తారు. మార్గదర్శి గురించి ఉండవల్లి ప్రశ్నలు లేవనెత్తగానే 'ఆ విషయాలు చూసుకోవడానికి బ్యాంకింగ్‌ శాఖ ఉంది, ఈయనెందుకు మాట్లాడడం?' అన్నారు. వెంటనే జనాలు చెరిగేశారు – 'పెట్రోలులో కల్తీ జరిగితే చూడడానికి ఓ శాఖ ఉంది, ప్రజారాజ్యం పార్టీ సమావేశంలో వాటర్‌ బాటిల్స్‌ పడేస్తే ఎత్తడానికి మరో శాఖ ఉంది. మీ లోకసత్తా వాలంటీర్లు ఎందుకు వెళ్లడం?' అని. ఇప్పుడూ అవే ప్రశ్నలు వస్తాయి. నిధుల వినియోగం ఎలా జరిగిందో చెప్పుకోవడానికి రాష్ట్రస్థాయిలో అసెంబ్లీ ఉంటే కేంద్రస్థాయిలో పార్లమెంటు ఉంది. అక్కడా కాగ్‌ ఉంది.

మరి మీ నిజనిర్ధారణ కమిటీ ఎందుకు? వింటే యిరుపక్షాల వాదనలూ వినాలి. ఎవరిది ఏ మేరకు నిజమో ప్రజలకు చెప్పాలి. టిడిపిని ఒడ్డున పడేయడానికే కమిటీ వేశారన్న ఫీలింగు కలిగిందంటే విశ్వసనీయత పోతుంది. బాబు మనిషన్న ముద్ర పవన్‌ మీదనుంచి చెరిగిపోలేదు. రావలసినవి రాబట్టలేకపోవడంలో బాబు వైఫల్యం ఉందనడు. ఆంధ్ర ఎంపీలది ఉందిట. వారిలో అధిక సంఖ్యాకులు ఏ పార్టీకి చెందినవారు? ఆ పార్టీ నాయకుడెవరు? ఎవరి ఆదేశాల మేరకు వారు వ్యవహరిస్తున్నారు? బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే వైసిపి వెంటనే సై అంది.

అయితే మీ పార్టీ ఎంపీలకు కూడా ఆదేశాలివ్వండి అని బాబుతో అనరు. దేశంలో వివిధ ప్రాంతాల ఎంపీలను  కష్టపడి ఒప్పిస్తారట. ఆంధ్ర ప్రయోజనాల గురించి ఆంధ్ర ఎంపీలతో మాట్లాడకుండా తక్కినవారితో మాట్లాడతానంటే ఏదో మతలబు ఉందనుకోరూ? హోదా గురించి, ప్యాకేజీ గురించి గతంలో పవన్‌ రకరకాలుగా మాట్లాడారు. ఇన్నాళ్లకు నాకు అర్థం కావటం లేదు కాబట్టి.. అంటూ మేధావులను పోగేశారు. తీరా చూస్తే దాని లక్ష్యంపై అనుమానాలు పొడసూపేట్లా తయారైంది. 

కొందరు 'ఇప్పుడీ నిజనిర్ధారణేమిటి? వెంటనే కార్యాచరణకు దిగాలి' అంటారు. కార్యాచరణకు దిగేముందు వాదనకు నైతికబలం చేకూరాలంటే గణాంకాలు ఉండాలి. ఒక శ్వేతపత్రం ఉండాలి. ఇన్నాళ్లు ఆగారు, కమిటీ నివేదిక వచ్చేదాకా ఆగితే మంచిది. అయినా కార్యాచరణ అంటే ఏమిటి? మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయడమా? చట్టంలో ఉన్నవి అమలు చేయండి అని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నలతో యిరకాటంలో పెట్టవలసిన ఎంపీలు పార్లమెంటు బయట చొక్కాలిప్పుకుని తిరిగినా, రాజీనామా లిచ్చి మన మధ్య తిరిగితే ప్రయోజనముందా? గతంలో సమైక్యవాదం అంటూ కాంగ్రెసు ఎంపీలు యిలాగే నాటకాలాడారు.

తమతమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడానికి కేంద్రానికి వత్తాసు పలుకుతూ, బయట మాత్రం అన్యాయం చేస్తే ఊరుకోం అంటూ బుకాయించారు. టెర్మ్‌ ముగిసేవేళకు కొందరు రాజీనామా లిచ్చారు. ఇప్పుడు కేంద్రంలో అధికారం పంచుకుంటున్న టిడిపి ఎంపీలు యిలాటి నాటకాలే ఆడుతున్నారు. టిడిపి కానీ, వైసిపి కానీ – ఈ రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలూ జరిగేదాకా నమ్మడానికి లేదు. అయినా యిప్పుడు టూ లేట్‌. ఇదంతా ఎన్నికల సమయంలో హీరోలుగా చూపించుకోవడానికి చేసే కసరత్తే. 

వైసిపి పవన్‌ కమిటీని దూరంగానే పెట్టింది. ప్యాకేజీ, నిధుల విడుదల జోలికి పోకుండా హోదా, హోదా అంటూనే ఉంది. ఏ మాట కా మాట చెప్పాలంటే అది జనంలోకి బాగానే వెళ్లింది. జనం కూడా హోదా అనసాగారు. అన్ని టీవీ ఛానెల్సూ బాగా ప్రచారం కల్పించి, దానిపై చర్చా కార్యక్రమాలు పెడుతున్నాయి. హోదాపై మాట్లాడడమే దండగ అని తీసిపారేసిన బాబు కూడా మళ్లీ హోదా మా హక్కు అంటూ అనవలసి వచ్చింది. బిజెపి వాళ్లు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. టిడిపి నాయకులపై అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.

రాష్ట్రం పట్ల కేంద్రం పక్షపాతం చూపిస్తోందని బాబు ఆరోపిస్తూ ఉంటే, బాబు రాయలసీమ ప్రాంతం పట్ల పక్షపాతం చూపిస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. వారి వాదనలో సబబు ఉంది. అన్నీ కృష్ణా, గుంటూరు జిల్లాలకే కట్టబెడుతున్నారు. రాయలసీమకు కనీసం హైకోర్టు కూడా యివ్వటం లేదు. 1953లో ఆంధ్ర ఏర్పడినపుడు రాజధాని కర్నూలుకి యిచ్చారు కాబట్టి, హైకోర్టు గుంటూరులో పెట్టారు. ఇప్పుడు రాజధాని గుంటూరు దగ్గరకు వచ్చింది కాబట్టి హైకోర్టు కర్నూలు లేదా మరో రాయలసీమ జిల్లాకు వెళ్లాలి. కానీ బాబుకు ఆ ఆలోచన లేనే లేదు.

తాజాగా బిజెపి రాయలసీమకు రెండో రాజధాని అడుగుతోంది. త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని దింపడానికి అక్కడ గిరిజన ప్రాంతీయ భావాలను ఎగదోస్తున్న బిజెపి యిక్కడ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో అలాటి ఉద్యమం చేపడితే మంచి స్పందన రావడం ఖాయం. దీనికి ప్రతిగా మార్చి 5 తర్వాత మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటోంది టిడిపి. 

అఖిలపక్షాన్ని తీసుకెళతాం అంటున్నారు బాబు. దానిలో వైసిపి ఉంటుందో లేదో తెలియదు. ఆంధ్రలో పాలకపక్షం, ప్రతిపక్షం ఒకదాన్ని మరొకటి గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి. 'వైసిపి దిల్లీ వెళ్లి ప్రదర్శనలు చేయాల్సింది, ఎంపీలు రాజీనామా చేయాల్సింది, మోదీని నిలదీయాల్సింది' అంటూ వారిని తప్పుపడుతున్న బాబు జగన్‌ను తనతో పాటు రమ్మంటారా? రాష్ట్రంలో ప్రతిపక్షం అధికారపక్షంపై నిఘా వేసి ఉంచాలి. వారు తప్పులు చేస్తే ఎండగట్టాలి. వైసిపి ఆ పని చేస్తోంది. అయితే కేంద్రంతో తగాదా వచ్చేసరికి యిద్దరూ కలిసి పోరాడాలి. 'విడిగా ఉంటే మేం ఐదుగురం, మీరు నూరుమంది. వేరే ఎవరైనా మనమీదకు వస్తే మనం నూటఐదుగురం' అనే ఫిలాసఫీ అధికారపక్షం అమలు చేసినప్పుడే ప్రతిపక్షం వారితో కలిసి వస్తుంది.

'మేంమేం ఫ్రెండ్స్‌ కాబట్టి అంటకాగుతాం, పోట్లాడడం నీ వంతు' అంటే వర్కవుట్‌ కాదు. ఇంతకీ బిజెపి-టిడిపి వివాదం ముదురుతుందో, లేకపోతే హఠాత్తుగా రాజీ పడతారో తెలియదు. అవిశ్వాస తీర్మానం అంటున్న వైసిపి చిత్తశుద్ధి పైనా అనుమానాలున్నాయి. విభజన వేళ మీ పార్టీ అభిప్రాయం చెప్పండి అంటే వైసిపి కేంద్రం ఏం చెపితే అదే అంటూ వచ్చింది. విభజన ఖాయం అని తేలాక సమైక్యం అంటూ హంగామా చేసింది. ఏం లాభం? తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది. ఇప్పుడైనా కేంద్రంపై, బిజెపిపై రాజీలేని పోరాటం చేసి ఉంటే రాష్ట్రప్రయోజనాలకై ఏదో చేస్తోందని నమ్మేవారు. బిజెపిపై సన్నాయినొక్కులు మాత్రమే నొక్కుతూంటే ఎవరు నమ్ముతారు?

తమ ప్రవర్తనను యీ పార్టీలు ఎన్నికల వేళ ఎలా సమర్థించుకుంటాయన్నది ఆలోచిస్తే తమాషాగా ఉంటుంది. మూడు పార్టీలూ విడివిడిగా పోటీ చేసినట్లయితే బిజెపి ఎన్నికల ప్రచారం యిలా ఉండవచ్చు – 'టిడిపి, వైసిపి రెండూ రాష్ట్రప్రయోజనాలను కాపాడలేకపోయాయి. అలా కాపాడలేని ప్రాంతీయపార్టీలెందుకు, మన్నులో కలవనా? మేం జాతీయపార్టీ. కేంద్రంలో ఎలాగూ అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో కూడా మేమే ఉంటే నిధులు తేవడమే కాకుండా, సవ్యంగా వినియోగ పరుస్తాం. టిడిపి సరిగ్గా లెక్కలు చెప్పలేకపోవడం చేతనే గతంలో మీకై నిధులు విడిగా పెట్టినా, జారీ చేయలేకపోయాం.

ద్రావిడ ప్రాణాయామంలా ప్రాంతీయ పార్టీని గెలిపించి, మాతో పొత్తు పెట్టుకోమనకండి, నేరుగా మా ముక్కే పట్టుకోండి. బాగుపడతారు. మేం బాబులా కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం కాము. రాయలసీమ, ఉత్తరాంధ్ర, తక్కిన జిల్లాలకు కూడా నిధులు పంచుతాం. మాకు స్థానికంగా క్యాడర్‌ లేదని, మాలో ముఖ్యమంత్రి కాగల వ్యక్తి లేడనీ వర్రీ వద్దు. మోదీ స్వయంగా మార్గదర్శకత్వం చేస్తారు. ఆంధ్ర అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. తిరుపతి వెంకన్న సాక్షిగా తను గతంలో యిచ్చిన హామీలు అమలు చేద్దామని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన తలచుకుంటే గుజరాతీ పెట్టుబడిదారులు ఆంధ్రలో పెట్టుబడులు కురిపిస్తారు.' 

ఇక బాబు 'ఎన్నో చేద్దామనుకున్నాను. నిద్రాహారాలు మానుకుని, అహర్నిశలు కష్టపడ్డాను. బిజెపి సహకరించలేదు. వంచించింది. ఆంధ్రుల ప్రయోజనాలకై అన్నీ ఓర్చుకున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. బిజెపి మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసింది. గతంలో కెసియార్‌ ఓటుకు నోటు విషయంలో నన్ను యిరికించి ఆంధ్రుల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించినట్లే బిజెపి కూడా వ్యవహరించింది. ఎన్టీయార్‌ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుని దానికి బుద్ధి చెప్పాలి. నా కలలు పూర్తి చేసేందుకు మరో అవకాశం యివ్వాలి. ఆ దుష్ట బిజెపితో అంటకాగేందుకు వైసిపి ఎదురుచూస్తోంది. ఎన్నికల తర్వాత వాళ్లిద్దరూ ఏకమవ్వడం ఖాయం. వైసిపికి ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే. వైసిపి గెలిస్తే నేను తలపెట్టిన పనులన్నీ ఆగిపోతాయి. రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిపోతుంది.' అంటారు.

ఇక జగన్‌ విషయానికి వస్తే బిజెపికి వ్యతిరేకంగా ఏమీ అంటారనుకోను. గతంలో అయితే బిజెపితో సఖ్యత కనబరిస్తే తన మైనారిటీ ఓటుబ్యాంకు పోతుందన్న భయం ఉండేది. నంద్యాల ఉపయెన్నికలో ముస్లిములు కూడా ఓటెయ్యకపోయేసరికి ఆ భయం పోయింది. చెడ్డకాపురానికి ముప్పేమిటి అన్నట్లు, ఎన్నికల అనంతరం బిజెపికి మిత్రపక్షమనే సందేహాల ట్యాగ్‌తోనే ముందుకు వెళ్లవచ్చు. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుని దిల్లీలో మాట చెల్లించుకోవాలనే ఏకైక తాపత్రయం. 2009లో వైయస్‌ అతి తక్కువ హామీలిచ్చి మళ్లీ నెగ్గారు, 2014లో బాబు అతి ఎక్కువ హామీలిచ్చి నెగ్గారు. ఇప్పుడు జగన్‌ బాబు బాటనే అనుసరిస్తున్నారు. హామీలపై హామీలు గుప్పిస్తున్నారు.

ఎలాగైనా ఎక్కువ సీట్లు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చి, తన ఎంపీలతో బిజెపికి మద్దతిచ్చి బాబును యిబ్బందుల్లో నెట్టాలనేదే ధ్యేయం. అందువలన ఎన్నికలలో నిధులివ్వని, హోదా యివ్వని బిజెపిని  ఏమీ అనకుండా అవి సాధించలేని బాబును తప్పుపడుతూ ప్రచారం సాగిస్తారని అనుకుంటున్నాను. 1976లో తమిళనాడులో ఎంజీఆర్‌ ఇందిరకు సపోర్టు యిచ్చి, కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేయించి కమిషన్‌ వేయించాడు. తర్వాత నాలుగేళ్లకు కరుణానిధి ఇందిరకు మద్దతిచ్చి ఎంజీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయించాడు. మన తెలుగు నాయకులకు యిటువంటి ఐడియాలు రావని అనడానికి లేదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]