సి. కళ్యాణ్ ప్రోడ్యూసర్ గా బాలకృష్ణ హీరోగా సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన చిత్రం జైసింహ. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానుల్ని అలరించింది. ఇదే నిర్మాత-హీరోల కాంబినేషన్ లో మరో చిత్రం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. నందమూరి బాలయ్య ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.
ఆయన ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో బిజీ అయిపోయే లోగానే.. ఈ చిత్రం మేజర్ షూటింగ్ ను పూర్తి చేసేయాలనే ఉద్దేశంతో.. త్వరత్వరగా కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకుడి కోసం అన్వేషణ సాగుతోంది.
టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వంటి దర్శకుల్లో ఒకరైన వినాయక్ ను ఇప్పటికే సంప్రదించారుట. అయితే ఆయన ఎంతకీ తన అంగీకారం గురించి తేల్చి చెప్పలేదని తెలుస్తోంది. వినాయక్ ను గతంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి కూడా అడిగితే నో చెప్పినట్లుగా ఇదివరకు పుకార్లు వచ్చాయి కూడా. బాలయ్య చిత్రం చేయడానికి కూడా వినాయక్ ఏ సంగతి తేల్చకపోవడంతో ఆల్టర్నేటివ్ వెతికే పనిలో పడ్డారు.
ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల రాజా ది గ్రేట్ చిత్రాన్ని రవితేజతో రూపొందించిన అనిల్ రావిపూడిని సంప్రదించినట్లు సమాచారం. ఎటూ అనిల్ రావిపూడికి, కల్యాణ్ రామ్ తో పటాస్ చిత్రం ద్వారా నందమూరి కుటుంబ హీరోలతో చేసిన అనుభవం ఉండనే ఉంది. బాలకృష్ణతో సినిమా చేయడానికి అనిల్ ఓకేనే గానీ.. ఆగస్టునుంచి అయితే అందుబాటులోకి రాగలనని చెప్పారుట.
అయితే ఆ సమయానికి బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన పనిలో బిజీ అయిపోయే అవకాశం ఉన్నదని అనుకోవడంతో.. వీలైనంత త్వరగా సినిమా మొదలు పెట్టేయాలని నిర్మాత సి. కల్యాణ్, హీరో బాలకృష్ణ అనుకుంటున్నారట. ఈ మేరకు అనిల్ రావిపూడినే ఒప్పించడానికి నిర్మాత ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.