ఎమ్బీయస్‌: కత్తులు దూస్తున్న పొత్తుదార్లు

ఎన్‌డిఏ కూటమి బలహీనపడుతోంది. వాజపేయి హయాంలో ఉన్నంత పటిష్టంగా యిప్పటి కూటమి లేదు. దానికి కారణం 543 మంది సభ్యులున్న లోకసభలో వాజపేయి కాలంలో బిజెపికి 1998లో కాని, 1999లో కాని వచ్చిన సీట్లు…

ఎన్‌డిఏ కూటమి బలహీనపడుతోంది. వాజపేయి హయాంలో ఉన్నంత పటిష్టంగా యిప్పటి కూటమి లేదు. దానికి కారణం 543 మంది సభ్యులున్న లోకసభలో వాజపేయి కాలంలో బిజెపికి 1998లో కాని, 1999లో కాని వచ్చిన సీట్లు 182. అందువలన వాళ్లు తగ్గి ఉండవలసి వచ్చింది. ప్రమోద్‌ మహాజన్‌, జశ్వంత్‌ సింగ్‌ వంటి వారిని సమన్వయకర్తలుగా పెట్టుకుని భాగస్వామ్యులతో నిరంతరం సంప్రదిస్తూ, వారిని కలుపుకుపోతూ సంకీర్ణధర్మాన్ని పాటించవలసి వచ్చింది.

ఇప్పుడు బిజెపికి ఆ అగత్యం లేదు. సొంతంగానే వారికి 275 సీట్లున్నాయి. సింపుల్‌ మెజారిటీ కంటె మూడెక్కువ. అయిన కొన్ని ప్రాంతీయ పార్టీలను భాగస్వాములుగా కలుపుకుంది. వారికి ఉన్న సీట్లు 57. ఇతరులు (వీరిలో ప్రతిక్షకులున్నారు, తటస్థంగా ఉన్నవారూ ఉన్నారు) 211 మంది. గతంలో బిజెపిలో అనేకమంది నాయకులకు ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు మోదీ, అమిత్‌ తప్ప వేరే నాయకుడు లేకుండా చేశారు. వారు తమకు ఎపాయింట్‌మెంట్‌ యివ్వటం లేదని, యుపి, అసాం అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత వాళ్లకు అహంకారం పెరిగిందని సణిగే భాగస్వాముల సంఖ్య పెరిగింది.

నోట్ల రద్దు, జిఎస్‌టి కారణంగా నిరుద్యోగం పెరగడం, ద్రవ్యోల్బణం, ఆర్థిక ప్రగతి మందగించడం జరిగి ప్రజల్లో మోదీ పలుకుబడి తగ్గిందని యివి అనుకోసాగాయి. గుజరాత్‌ ఎన్నికలలో బిజెపి మూడంకెలకు చేరలేకపోవడం, రాజస్థాన్‌ ఉపయెన్నికల ఫలితం వారి అంచనాలను ధృవీకరించాయి. పైగా ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండాలంటే కేంద్రం తమకు అన్యాయం చేస్తోందన్న పల్లవి ఎత్తుకోవాలి. అందువలన ఎన్నికలు రాబోతున్న యీ ఏడాదిలో నిరసన ధ్వనులు ఊపందుకున్నాయి. 

ఆంధ్రలో చంద్రబాబు ఆలపిస్తున్న కొత్త రాగం వింటున్నాం. వాజపేయి హయాంలో చక్రం తిప్పిన బాబు మహాజన్‌కు ఒక్క ఫోన్‌ కొడితే చాలు, తలచుకున్నప్పుడల్లా ప్రధానిని కలవగలిగేవారు. ఇప్పుడు టిడిపికి 16 లోకసభ, 6 రాజ్యసభ సీట్లున్నా మోదీని కలవడానికి ఏడాది ఆగవలసి వచ్చింది. ఇన్నాళ్లూ వంత పాడి, యిప్పుడు ఎన్నికల వేళ సణుగుడు మొదలు పెట్టింది. కానీ 18 లోకసభ, 3 రాజ్యసభ సీట్లు ఉన్న శివసేన అలాటి శషభిషలు పెట్టుకోకుండా 2019 వరకు బిజెపితో ప్రభుత్వంలో కలిసి ఉన్నా ఎన్నికలలో మాత్రం కలిసి పోటీ చేయమని కుండ బద్దలు కొట్టి ప్రకటించింది.

ఫడ్‌ణవీస్‌ ప్రభుత్వం ఋణమాఫీ విషయంలో తడబడడం, రైతు ఆత్మహత్యలు నివారించ లేకపోవడం, దళిత వ్యతిరేకులను కట్టడి చేయలేకపోవడంతో ఎన్‌డిఏ భాగస్వామ్యం నుంచి రైతుల పార్టీ స్వాభిమానీ షేత్‌కారీ సంఘటన బయటకు వచ్చింది. బిజెపితో అంటకాగితే ఆ వర్గాలు దూరమవుతాయన్న భయం వేసింది శివసేనకు కూడా. గుజరాత్‌ ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీని ప్రశంసిస్తూ తన ''సామ్‌నా'' లో రెండు వ్యాసాలు ప్రచురించింది కూడా.

బిజెపి బలహీనపడుతోందన్న అంచనాతోనే గోవాలో మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీ తమ కోర్కెలు నెరవేర్చకపోతే సంకీర్ణం నుండి వైదొలుగుతామని హెచ్చరించాయి. అకాలీ దళ్‌ కూడా బిజెపి ముస్లిం వ్యతిరేక విధానాన్ని బహిరంగంగా విమర్శిస్తోంది. దాని ఎంపీ నరేశ్‌ గుజ్రాల్‌ ''మా శిఖ్కులం కూడా ముస్లిములలాగానే మైనారిటీలం. హిందూత్వ శక్తులను నియంత్రించడంలో బిజెపి విఫలమవుతోంది. 2019లో తనంతట తానుగా మెజారిటీ పొందలేదు.'' అన్నాడు.

బిహార్‌లో నీతీశ్‌ కుమార్‌తో పొత్తు సవ్యంగా సాగటం లేదు. 2009లో పార్లమెంటుకు కలిసి పోటీ చేసినప్పుడు 40 సీట్లలో జెడియు 25 చోట్ల పోటీ చేస్తే బిజెపి 15 చోట్ల చేసింది. ఇప్పుడు మళ్లీ కలిశారు, కానీ పెరిగిన మోదీ యిమేజిని లెక్కలోకి వేసుకుని తమకు 15 సీట్లు యిస్తే చాలని నీతీశ్‌ అన్నాడు. అబ్బే మీకు 9 చాలు అంటోంది బిజెపి. 2020లో జరగవలసిన అసెంబ్లీ ఎన్నికలను 2019 పార్లమెంటు ఎన్నికలతో కలిపి ఒకేసారి నిర్వహిద్దామని బిజెపి అంటోంది.

అలా అయితే తమ అసెంబ్లీ సీట్లలో కూడా భారీగా కోత పడుతుందన్న భయంతో నీతీశ్‌ 'వద్దు రెండూ విడివిడిగా జరపాలి' అంటున్నాడు. ప్రస్తుతం 243 సీట్ల అసెంబ్లీలో జెడియుకి 71, బిజెపికి 52 ఉన్నాయి. జెడియు దూరంగా ఉండే రోజుల్లో బిజెపికి సన్నిహితంగా ఉన్న రాష్ట్రీయ లోక సమతా పార్టీ, హిందూస్తానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌), లోక జనశక్తి పార్టీ యిప్పుడు నీతీశ్‌ తిరిగి రావడంతో బిజెపి తమను అలక్ష్యం చేస్తోందని భయపడుతున్నాయి. వీటిపై మాట్లాడదామని నీతీశ్‌ యిటీవల దిల్లీ వెళితే అమిత్‌ ఎపాయింట్‌మెంట్‌ కూడా యివ్వలేదు.

కశ్మీరులో పిడిపితో బిజెపి పొత్తు ఎన్నో వైరుధ్యాలతో కుంటుకుంటు నడుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల పేరు చెప్పి పిడిపి ఎప్పుడైనా తెగతెంపులు చేసుకోవచ్చు. అసాం గణ పరిషద్‌ బిజెపితో చేతులు కలిపినప్పుడు అక్రమంగా వచ్చిన బంగ్లాదేశ్‌ శరణార్థులందరినీ వెనక్కి పంపాలని ఒప్పందం చేసుకుంది. అయితే బిజెపి పౌరసత్వ చట్టానికి మార్పులు చేసి శరణార్థుల్లో హిందువులకు పౌరసత్వం యివ్వడానికి సంకల్పించింది. దీన్ని అసాం గణపరిషద్‌ బాహాటంగా వ్యతిరేకిస్తోంది. గోమాంస భక్షణం సంస్కృతిలో భాగంగా ఉన్న ఈశాన్యభారతంలో దానిపై బిజెపి విధానం కొన్ని ప్రాంతీయ పార్టీలకు యిబ్బందికరంగా మారింది.

ఎన్నికలు ముంచుకు వచ్చేసరికి బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి దడుస్తున్నాయి. నాగాలాండ్‌లో 15 ఏళ్లగా ఉన్న నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ – బిజెపితో పొత్తు సీట్ల సర్దుబాటు వివాదం కారణంగా విచ్ఛిన్నమైంది. క్రైస్తవులు ఎక్కువగా ఉన్న మేఘాలయలో ఎన్‌డిఏ భాగస్వామి ఐన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ బిజెపితో ఎన్నికలకు పూర్వం సీట్ల సర్దుబాటుకి నిరాకరించింది. ఎన్‌డిఏ కూటమి గట్టిపడుతుందో, పలచనవుతుందో కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]